
బందరులో భారీ చోరీ
- కేజీ బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణ
- మొత్తం విలువ రూ.30 లక్షలు!
- రంగంలోకి దిగిన పోలీసులు
మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో భారీ చోరీ జరిగింది. శనివారం రాత్రి ఈ ఘటన వెలుగు చూసింది. కేజీ బంగారంతో పాటు రూ.2 లక్షల మేరకు నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు, టౌన్ సీఐ సుబ్బారావు, క్లూస్‌టీం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడి కుమారుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
పరాసుపేటకు చెందిన కాంత్ కలర్ ల్యాబ్ యజమాని పీసీ కాంత్ ఇంట్లో పట్టణానికి చెందిన న్యాయవాది జేఆర్‌వీ సుబ్బారావు గత కొంతకాలంగా అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 18న తన మేనకోడలు ప్రసవించటంతో పలకరింపు కోసం బెంగళూరు వెళ్లాడు. అదే సమయంలో చెన్నైలో ఉంటున్న తన కుమార్తె నిషిత ఆరోగ్యం బాగోకపోవటంతో ఆమెను పరామర్శించేందుకు సుబ్బారావు భార్య ప్రసన్న 19న అక్కడికి వెళ్లారు.
సుబ్బారావు కుమారుడు రామ్‌నితేష్ ఆర్యా గుంటూరులో జరుగుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనుల నిమిత్తం కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుండగులు వెనుకవైపు కిటికీ తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఇంటి యజమాని కాంత్ విషయాన్ని గ్రహించాడు.
సుబ్బారావుకు ఫోన్ చేసి విషయం వివరించగా, ఆయన తన కుమారుడి ఆర్యాకు సమాచారం అందించారు. ఆర్యా హుటాహుటిన గుంటూరు నుంచి బయలుదేరి వచ్చారు. బీరువాలో ఉంచిన బంగారం, నగదు మాయమైనట్లు గుర్తించారు. గుంటూరులో జరుగుతున్న నిర్మాణ పనుల నిమిత్తం బంధువుల నుంచి సుమారు కేజీ బంగారం అప్పుగా తెచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.