శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలి:దేవీ ప్రసాద్
హైదరాబాద్ నగరాన్ని అశాంతి నగరంగా మార్చేందుకే కిరణ్ సర్కార్ 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు అనుమతి ఇచ్చిందని టీఎన్జీవో రాష్ట్రాధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆరోపించారు. బుధవారం ఆయన కరీంనగర్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చినట్లే టీఎన్జీవోలు నిర్వహించే శాంతి ర్యాలీ కూడా అనుమతి ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రాంత ఉద్యోగులు నిర్వహించే శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకుంటే తెలంగాణ వ్యాప్తంగా శాంతియుత నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఏడో తేదీన హైదరాబాద్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరిగితే తదనంతర జరగబోయే పరిణామాలకు తెలంగాణ ప్రాంత మంత్రులే బాధ్యత వహించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేందుకు రాష్ట ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని లేదా తమ ప్రాంతానికి బదిలీ చేయాలని దేవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారని టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ వ్యాఖ్యానించారు.