= గరిష్ట స్థాయిలో ఉత్పత్తి
= రిజర్వాయర్లలో నిండుగా నీరు
=ప్రస్తుతం నిలకడగా విద్యుదుత్పాదన
సీలేరు, న్యూస్‌లైన్ : చీకట్లు చెదరగొట్టి వెలుగులు పంచే జలవిద్యుత్ కేంద్రాలు వేసవిలో సైతం ఇబ్బందికి తావు లేకుండా విద్యుత్తును అందివ్వనున్నాయి. రిజర్వాయర్లలో నీరు లేక ఏటా వేసవిలో రాష్ట్ర ప్రజలు విద్యుత్ కోతతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. రాబోయే వేసవిలో మాత్రం ఈ పరిస్థితి ఉండదని స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో కురిసిన భారీవర్షాలకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా చేరింది. దాంతో ఈ రిజర్వాయర్లు నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.
దీంతో వేసవిలో అడిగిందే తడవుగా విద్యుదుత్పత్తి చే సేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ జెన్‌కో ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇ.ఎల్.రమేష్‌బాబు, జలవిద్యుత్ కేంద్రం డీఈ సుధాకర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు నీరందించే బలిమెల రిజర్వాయర్‌లో ఏపీ వాటాగా 76 టీఎంసీల నీరు ఉందని, ఈ నీటితో వేసవిలో నాలుగు నెలలు పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయవచ్చని చెప్పారు. వారంరోజులుగా బలిమెల నుండి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామని అన్నారు.
సాఫీగా విద్యుదుత్పత్తి
ప్రస్తుతం సీలేరు బేస్‌లో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో నిరాటంకంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. బలిమెల నుండి రోజుకు 4వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడంతో సీలేరు (గుంటువాడ) రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయిలో 1360 అడుగులు ఉండగా ప్రస్తుతం 1353.5 అడుగులకు చేరుకుంది. ఇక్కడ మూడు యూనిట్ల ద్వారా ప్రస్తుతం 180 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. అన్ని రిజర్వాయర్ల నీటిమట్టాలు నిలకడగా ఉన్నాయి.
జోలాపుట్టు రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 2748.2 అడుగులు ఉంది. అలాగే బలిమెలలో పూర్తి స్థాయి నీటి మట్టం 1516అడుగులు కాగా ఇప్పుడు నీటి మట్టం 1512.4అడుగులుగా గుర్తించారు. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో నీటి మట్టం 1037అడుగులు కాగా ఇప్పుడు 1035.5 అడుగులు ఉంది. ఈ మూడు యూనిట్లలో సక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. సీలేరులో మూడు యూనిట్ల ద్వారా విద్యుత్తు తయారుచేయడంతో ఆ నీరు డొంకరాయికి చేరుతుంది. అక్కడ ప్రమాదస్థాయికి చేరకుండా రోజుకు 25 మెగావాట్ల విద్యుత్తును నిరంతరం ఉత్పత్తి చేస్తున్నారు.
వేసవిలోనూ పుష్కలంగా విద్యుత్తు
Published Sat, Dec 7 2013 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement