Hydro-electric
-
జలవివాదాలపై కేంద్రం అనూహ్య నిర్ణయం
-
అన్ని జల జగడాలకు ఒకే ట్రిబ్యునల్
శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు కసరత్తు - ప్రత్యేక బెంచ్‌ల(డీఆర్సీ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం - అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లో త్వరలో సవరణలు న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం తలనొప్పిగా మారడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరితంగా జల జగడాల పరిష్కార లక్ష్యంతో ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆలోచన అమల్లోకి వస్తే ప్రస్తుత ట్రిబ్యునల్స్ అన్నీ రద్దవుతాయి. శాశ్వత ట్రిబ్యునల్‌తో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, 1956లో సవరణలు చేసి ప్రత్యేక ధర్మాసనాలు(డీఆర్సీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపైనా కేంద్రం సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి అవసరమున్నప్పుడల్లా ఈ బెంచ్‌ల్ని ఏర్పాటు చేస్తారు. వివాదం ముగిశాక బెంచ్ దానంతటదే రద్దవుతుంది. జల వివాదాల చట్టంలో సవరణలు చేయాలన్న ప్రతిపాదనలను గత వారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో సవరణల బిల్లును తెచ్చే అవకాశముంది. తలనొప్పిగా మారిన జలవివాదాలు ఇటీవల కావేరి నదీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటకలు, మహదాయి నదీ జలాల కోసం గోవా–కర్ణాటక–మహారాష్ట్రలు పోట్లాడుకున్నాయి. కావేరి జగడంతో వందల కోట్ల ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఇక కృష్ణా జలాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య, మహానది నీటి కోసం ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య తగువులాట కొనసాగుతుంది. వీటికి పరిష్కారం కనుగొనేందుకు శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు సముచితమని కేంద్రం భావిస్తోంది. మూడేళ్లలో తుది తీర్పు.. ‘వివాదాల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్‌పర్సన్‌గా శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. అవసరమున్నప్పుడు ప్రత్యేక ధర్మాసనాలను నియమిస్తారు. ఒకసారి వివాదం పరిష్కారమైతే బెంచ్ కాలపరిమితి ముగుస్తుంది’ అని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్ తెలిపారు. జల జగడాలపై తుది తీర్పు ఇచ్చేందుకు నదీ జలాల ట్రిబ్యునల్స్‌కు ఏళ్ల సమయం పడుతుందని, ప్రతిపాదిత ట్రిబ్యునల్ మూడేళ్లలో తీర్పును వెలువరించగలదని అన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటుతో పాటు వివాద పరిష్కార కమిటీ(డీఆర్సీ) ఏర్పాటు కోసం చట్టంలో సవరణలు చేస్తారన్నారు. డీఆర్సీలో నిపుణులు, విధాన రూపకర్తలు సభ్యులుగా ఉంటారని, ట్రిబ్యునల్ ముందుకు వచ్చిన వివాదాల పరిష్కారం కోసం వీటిని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ‘ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రం విజ్ఞప్తి మేరకు డీఆర్సీని ఏర్పాటు చేస్తారు. చాలా వివాదాలు డీఆర్సీ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని ఆశాభావంతో ఉన్నాం. ఒకవేళ తీర్పు పట్ల రాష్ట్రం సంతృప్తి చెందకపోతే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు’ అని శేఖర్ వెల్లడించారు. ఒకసారి తీర్పు ఇస్తే వెంటనే అమల్లోకి.. ట్రిబ్యునల్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు.. ఏదైనా వివాదంపై ఆదేశాలు ఇచ్చిన వెంటనే తీర్పు అధికారికంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సి వచ్చేది. దీంతో అమలులో జాప్యం జరుగుతోంది. ప్రస్తుత చట్ట ప్రకారం జల వివాదంపై కేంద్రాన్ని రాష్ట్రం ఆశ్రయిస్తే... ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరముందని సంతృప్తి చెందితేనే కేంద్రం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దేశంలో అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి 8 ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కృష్ణా, గోదావరి, కావేరి, బియాస్ తదితర నదుల జల జగడాల పరిష్కారం కోసం వీటిని ఏర్పాటు చేశారు. జలవివాదాలపై కేంద్రానికే అధికారాలు రాజ్యాంగం 7వ షెడ్యూల్ (ఆర్టికల్ 246), రాష్ట్రాల జాబితా–2, ఎంట్రీ నంబర్ 17 ప్రకారం నీటి సరఫరా, కాలువలు, డ్రైనేజీలు, నీటి నిల్వ, నీటిగట్టులు, జలవిద్యుత్‌పై అధికారాలు రాష్ట్రాలదే.. అంతరాష్ట్ర జల వివాదాల సమయంలో అధికారం ఆర్టికల్ 262 మేరకు కేంద్రానికి అధికారాలు ఇచ్చారు. రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా ఆర్టికల్ 262 ప్రకారం అంతరాష్ట్ర జల వివాదాల చట్టం 1956ను పార్లమెంటు రూపొందించింది. -
కృష్ణా డెల్టాకు నీటి విడుదల
మరో రెండు రోజుల్లో కుడి కాలువకు ? విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి కృష్ణాడెల్టాకు ఆదివారం తెల్లవారుజాము నుంచి అధికారులు 1,133 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణాడెల్టా ఆయకట్టు ప్రాం తంలో తాగునీటి అవసరాల నిమిత్తం నీటి ని విడుదల చేయాలని ప్రభుత్వం కృష్ణాబోర్డుకు విజ్ఞప్తి చేసింది. దీంతో 5టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డు నాలుగు రోజుల క్రితం నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా డెల్టాకు నీటి విడుదల జరి గింది. మరో రెండ్రోజుల్లో కుడికాలువకు కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 509.40 అడుగుల వద్ద ఉంది. ఇది 130.6544 టీఎంసీలకు సమానం. -
‘పీక్’లో పవర్ ఇవ్వలేదు
జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తయిన విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వని ఏపీ హైదరాబాద్: ఇరు ప్రాంతాల్లోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలూ కోటా మేరకు పంచుకోవాల్సిందేనని దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ (ఎస్ఆర్పీసీ) ఆదేశించినా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం పెడచెవిన పెడుతోంది. ఏదో ఒక విధంగా తెలంగాణకు సరఫరా చేయాల్సిన విద్యుత్ కోటాలో కోత పెడుతూనే ఉంది. ప్రధానంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (పీక్ అవర్స్)లో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో తెలంగాణ వాటా మేరకు సరఫరా చేయడం లేదు. ఎస్ఆర్పీసీ ఆదేశాల మేరకు విద్యుత్‌ను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ)కు తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్ (టీఎస్ఎల్డీసీ) ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం ఉండటం లేదు. థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మాత్రమే కోటా మేరకు తెలంగాణకు సరఫరా అవుతోంది. ఏపీజెన్కో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పీక్ అవర్స్‌లో మాత్రమే సీలేరు బేసిన్‌లోని ఎగువ సీలేరు, డొంకరాయి, దిగువ సీలేరులో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వడం లేదు. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎస్ఆర్పీసీకి తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి లేఖ కూడా రాశారు. ఇదీ వివాదం!: గతంలో తాము విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏల)ను రద్దు చేసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ఏపీజెన్కో లేఖ రాసింది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ మొత్తాన్ని తామే వినియోగించుకుంటామని ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్‌కు కత్తెర వేసింది. ఈ అంశంలో దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ (ఎస్ఆర్పీసీ) జోక్యం చేసుకుని కోటా ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలని, పీపీఏల అంశంలో కేంద్ర విద్యుత్ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి పీపీఏల మేరకు ఇరు ప్రాంతాల్లోని విద్యుత్ ప్లాంట్లలో ఎవరికీ కేటాయించని కోటా 20 శాతం మినహాయించి తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్‌ను సరఫరా చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ పీపీఏలకు ఈఆర్సీ ఆమోదం లేనందున రద్దు చేసుకుంటున్నట్టు ఏపీజెన్కో ప్రకటించింది. ప్రస్తుతం ఈ పంచాయతీ కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోకి వెళ్లింది. ఈ వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ కమిటీ వచ్చే వరకు అయినా ప్రస్తుత కోటా మేరకే విద్యుత్ సరఫరా జరగాలి. అయినా.. దానిని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోందని ఎస్ఆర్పీసీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
విద్యుదుత్పత్తికి అంతరాయం
మాచ్‌ఖండ్‌లో మొరాయించిన ఒకటో యూనిట్ ప్రాజెక్టుకు తప్పిన ముప్పు ముంచంగిపుట్టు,న్యూస్‌లైన్: ఆంధ్ర, ఒడిశా రా ష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రోజు రోజుకు విద్యుదుత్పత్తి దిగజారుతోంది. ఆరు జనరేటర్లకు ప్రస్తుతం ఒక్కటి మా త్రమే పని చేస్తోంది. శనివా రం రాత్రి ఒకోటో నంబర్ జనరేటర్లో సాంకేతిక లోపంతో విద్యుదుత్పత్తి 17 మోగా వాట్లకు పడిపొయింది. ఆరు జనరేటర్లతో 120 మోగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న జలవిద్యుత్ కేంద్రంలో గత నెల 26న ఆరో నంబర్ జనరేటర్ మూలకు చేరడంతో కేవలం రెండు జనరేటర్లతో 34 మోగావాట్లు మాత్రమే విద్యుదుత్పత్తి అయ్యేది. 2,4,5 నంబర్ల జనరేటర్లు గత కొన్ని రోజులుగా మూలకు చేరాయి. ఒకోటో నంబర్ జనరేటర్లో సాంకేతిక లోపంతో ప్రస్తుతం మూడో నంబర్ జనరేటర్‌తో మాత్రమే 17 మోగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. తరచూ జనరేటర్లు మొరాయిస్తున్నా.. ప్రాజెక్టు ఆధునికీకరణకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రాజెక్టుకు తప్పిన ముప్పు : మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి పెనుముప్పు తప్పింది. విద్యుత్ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే పైపులో శనివారం రాత్రి రంధ్రం ఏర్పడి ప్రాజెక్టు లోపలికి నీరు చేరింది. అది మరింత పెరిగితే ప్రాజెక్టుకే ముప్పు ఏర్పడేది. దీనిని గమనించిన ప్రాజెక్టు అధికారులు దానికి సంబంధించిన గేటును మూసివేయడంతో ప్రమాదం తప్పింది. దీనిపై ప్రాజెక్టు ఎస్ఈ గౌరీపతి మాట్లాడుతూ రంధ్రం ఏర్పడిన పైపు స్థానంలో కొత్తది ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
శ్రమించారు..సాధించారు
ఆత్మకూర్, న్యూస్‌లైన్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం ట్రయల్ రన్ విజయవంతమైంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి వరకు నిపుణులు, అధికారులు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తిచేశారు. దిగువ జూరాల విద్యుదుత్పత్తి కేంద్రం మొదటి యూనిట్లో 300 క్యూసెక్కుల నీటిని వినియోగించి సన్నాహక పరీక్షలు నిర్వహించారు. మొదట టర్బయిన్లలో ఆయిల్ లీకేజీ, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్రయల్న్‌ల్రో కొన్ని ఆవాంతరాలు ఏర్పడ్డాయి. సాయంత్రం వరకు చిన్నచిన్న సమస్యలను అధిగమించి రాత్రి 7.30గంటల ప్రాంతంలో మొదటి టర్బయిన్‌లో 18 నిమిషాల పాటు ట్రయల్న్‌న్రు విజయవంతంగా చేపట్టారు. దీంతో జెన్కో అధికారులు, కార్మికులు ఆనందాల్లో మునిగితేలారు. ఈ ప్రక్రియను జెన్కో మాజీ డెరైక్టర్ ఆదిశేషుల బృందం పర్యవేక్షించింది. అనంతరం జెన్కో సీఈ(హెచ్పీసీ) రత్నాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంలో అనుకున్న సమయానికే పనులు పూర్తిచేశామని వివరించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సన్నాహక పరీక్షలు గురువారం రాత్రితో విజయవంతమయ్యాయని చెప్పారు. మరో రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో చిన్నపాటి సాంకేతిక సమస్యలను అధిగమించి మొదటి యూనిట్‌ను రన్ చేస్తామని, మరో పదిరోజుల్లోపు రెండవ యూనిట్‌ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. దిగువ జూరాలలో ఇదివరకే 294మీటర్ల మేర నీటిని నిల్వఉంచామన్నారు. మొదటిసారిగా నిర్వహించిన ఈ సన్నాహక పరీక్షల్లో 18నిమిషాల పాటు మొదటి యూనిట్‌ను రన్ చేసినట్లు వెల్లడించారు. అనుకున్న ప్రకారం త్వరలోనే దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా చేపడతామన్నారు. అంతకుముందు పవర్‌హౌజ్, వీయర్స్ను సందర్శించారు. జనవరి కల్లా 240మెగావాట్ల విద్యుదుత్పత్తిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీఈ సివిల్ సూర్యలక్షి్ష్మ, ఎలక్ట్రికల్ ఎస్ఈ శ్రీనివాస్, ఎస్సీ సివిల్ శ్రీనివాస్, ఈఈలు రమణమూర్తి, రామభద్రరాజు, డీఈ వ్యాసరాజ్, ఏడీఈలు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, జయరాంరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, రామక్రిష్ణరెడ్డి, రూపేష్, పవన్‌కుమార్, ఆనంద్, శ్రీనివాస్, సునిల్, వీఆర్స్క్ కంపెనీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, డెరైక్టర్ కౌషిక్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలోనూ పుష్కలంగా విద్యుత్తు
= గరిష్ట స్థాయిలో ఉత్పత్తి = రిజర్వాయర్లలో నిండుగా నీరు =ప్రస్తుతం నిలకడగా విద్యుదుత్పాదన సీలేరు, న్యూస్‌లైన్ : చీకట్లు చెదరగొట్టి వెలుగులు పంచే జలవిద్యుత్ కేంద్రాలు వేసవిలో సైతం ఇబ్బందికి తావు లేకుండా విద్యుత్తును అందివ్వనున్నాయి. రిజర్వాయర్లలో నీరు లేక ఏటా వేసవిలో రాష్ట్ర ప్రజలు విద్యుత్ కోతతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. రాబోయే వేసవిలో మాత్రం ఈ పరిస్థితి ఉండదని స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో కురిసిన భారీవర్షాలకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా చేరింది. దాంతో ఈ రిజర్వాయర్లు నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. దీంతో వేసవిలో అడిగిందే తడవుగా విద్యుదుత్పత్తి చే సేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ జెన్కో ఇన్చార్జి ఎస్ఈ ఇ.ఎల్.రమేష్‌బాబు, జలవిద్యుత్ కేంద్రం డీఈ సుధాకర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు నీరందించే బలిమెల రిజర్వాయర్‌లో ఏపీ వాటాగా 76 టీఎంసీల నీరు ఉందని, ఈ నీటితో వేసవిలో నాలుగు నెలలు పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయవచ్చని చెప్పారు. వారంరోజులుగా బలిమెల నుండి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామని అన్నారు. సాఫీగా విద్యుదుత్పత్తి ప్రస్తుతం సీలేరు బేస్‌లో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో నిరాటంకంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. బలిమెల నుండి రోజుకు 4వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడంతో సీలేరు (గుంటువాడ) రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయిలో 1360 అడుగులు ఉండగా ప్రస్తుతం 1353.5 అడుగులకు చేరుకుంది. ఇక్కడ మూడు యూనిట్ల ద్వారా ప్రస్తుతం 180 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. అన్ని రిజర్వాయర్ల నీటిమట్టాలు నిలకడగా ఉన్నాయి. జోలాపుట్టు రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 2748.2 అడుగులు ఉంది. అలాగే బలిమెలలో పూర్తి స్థాయి నీటి మట్టం 1516అడుగులు కాగా ఇప్పుడు నీటి మట్టం 1512.4అడుగులుగా గుర్తించారు. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో నీటి మట్టం 1037అడుగులు కాగా ఇప్పుడు 1035.5 అడుగులు ఉంది. ఈ మూడు యూనిట్లలో సక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. సీలేరులో మూడు యూనిట్ల ద్వారా విద్యుత్తు తయారుచేయడంతో ఆ నీరు డొంకరాయికి చేరుతుంది. అక్కడ ప్రమాదస్థాయికి చేరకుండా రోజుకు 25 మెగావాట్ల విద్యుత్తును నిరంతరం ఉత్పత్తి చేస్తున్నారు.