అన్ని జల జగడాలకు ఒకే ట్రిబ్యునల్
శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు కసరత్తు
- ప్రత్యేక బెంచ్‌ల(డీఆర్‌సీ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
- అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లో త్వరలో సవరణలు
న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం తలనొప్పిగా మారడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరితంగా జల జగడాల పరిష్కార లక్ష్యంతో ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆలోచన అమల్లోకి వస్తే ప్రస్తుత ట్రిబ్యునల్స్ అన్నీ రద్దవుతాయి. శాశ్వత ట్రిబ్యునల్‌తో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, 1956లో సవరణలు చేసి ప్రత్యేక ధర్మాసనాలు(డీఆర్‌సీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపైనా కేంద్రం సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి అవసరమున్నప్పుడల్లా ఈ బెంచ్‌ల్ని ఏర్పాటు చేస్తారు. వివాదం ముగిశాక బెంచ్ దానంతటదే రద్దవుతుంది. జల వివాదాల చట్టంలో సవరణలు చేయాలన్న ప్రతిపాదనలను గత వారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో సవరణల బిల్లును తెచ్చే అవకాశముంది.
తలనొప్పిగా మారిన జలవివాదాలు
ఇటీవల కావేరి నదీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటకలు, మహదాయి నదీ జలాల కోసం గోవా–కర్ణాటక–మహారాష్ట్రలు పోట్లాడుకున్నాయి. కావేరి జగడంతో వందల కోట్ల ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఇక కృష్ణా జలాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య, మహానది నీటి కోసం ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల మధ్య తగువులాట కొనసాగుతుంది. వీటికి పరిష్కారం కనుగొనేందుకు శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు సముచితమని కేంద్రం భావిస్తోంది.
మూడేళ్లలో తుది తీర్పు..
‘వివాదాల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్‌పర్సన్‌గా శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. అవసరమున్నప్పుడు ప్రత్యేక ధర్మాసనాలను నియమిస్తారు. ఒకసారి వివాదం పరిష్కారమైతే బెంచ్ కాలపరిమితి ముగుస్తుంది’ అని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్ తెలిపారు. జల జగడాలపై తుది తీర్పు ఇచ్చేందుకు నదీ జలాల ట్రిబ్యునల్స్‌కు ఏళ్ల సమయం పడుతుందని, ప్రతిపాదిత ట్రిబ్యునల్ మూడేళ్లలో తీర్పును వెలువరించగలదని అన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటుతో పాటు వివాద పరిష్కార కమిటీ(డీఆర్‌సీ) ఏర్పాటు కోసం చట్టంలో సవరణలు చేస్తారన్నారు. డీఆర్‌సీలో నిపుణులు, విధాన రూపకర్తలు సభ్యులుగా ఉంటారని, ట్రిబ్యునల్ ముందుకు వచ్చిన వివాదాల పరిష్కారం కోసం వీటిని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ‘ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రం విజ్ఞప్తి మేరకు డీఆర్‌సీని ఏర్పాటు చేస్తారు. చాలా వివాదాలు డీఆర్‌సీ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని ఆశాభావంతో ఉన్నాం. ఒకవేళ తీర్పు పట్ల రాష్ట్రం సంతృప్తి చెందకపోతే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు’ అని శేఖర్ వెల్లడించారు.
ఒకసారి తీర్పు ఇస్తే వెంటనే అమల్లోకి..
ట్రిబ్యునల్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు.. ఏదైనా వివాదంపై ఆదేశాలు ఇచ్చిన వెంటనే తీర్పు అధికారికంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సి వచ్చేది. దీంతో అమలులో జాప్యం జరుగుతోంది. ప్రస్తుత చట్ట ప్రకారం జల వివాదంపై కేంద్రాన్ని రాష్ట్రం ఆశ్రయిస్తే... ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరముందని సంతృప్తి చెందితేనే కేంద్రం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దేశంలో అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి 8 ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కృష్ణా, గోదావరి, కావేరి, బియాస్ తదితర నదుల జల జగడాల పరిష్కారం కోసం వీటిని ఏర్పాటు చేశారు.
జలవివాదాలపై కేంద్రానికే అధికారాలు
రాజ్యాంగం 7వ షెడ్యూల్ (ఆర్టికల్ 246), రాష్ట్రాల జాబితా–2, ఎంట్రీ నంబర్ 17 ప్రకారం నీటి సరఫరా, కాలువలు, డ్రైనేజీలు, నీటి నిల్వ, నీటిగట్టులు, జలవిద్యుత్‌పై అధికారాలు రాష్ట్రాలదే.. అంతరాష్ట్ర జల వివాదాల సమయంలో అధికారం ఆర్టికల్ 262 మేరకు కేంద్రానికి అధికారాలు ఇచ్చారు. రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా ఆర్టికల్ 262 ప్రకారం అంతరాష్ట్ర జల వివాదాల చట్టం 1956ను పార్లమెంటు రూపొందించింది.