పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.ఇరాన్ మిసైల్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.మిసైల్ దాడుల తర్వాత ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇప్పటివరకైతే నేరుగా దాడి చేయలేదు.ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై మాత్రం దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ పెంచింది.వేల మంది హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లతో పాటు లెబనాన్‌లోని సామాన్యులు ఇజ్రాయెల్ దాడుల్లో మరణిస్తున్నారు.
అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా దాడిచేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ దాడులు ఇరాన్ చమురు స్థావరాలపై ఉంటాయని కొందరు అణుస్థావరాలపై ఉండొచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ రెండింటిలో ఏది జరిగినా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించే ఛాన్సుంది. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాజాగా రాజధాని టెహ్రాన్‌లో జరిగిన నమాజ్ సభలో ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ కూడా హెచ్చరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్,ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చనుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ రెండు దేశాలకు మద్దతుగా అమెరికా,బ్రిటన్,రష్యా లాంటి అగ్ర దేశాలు కూడా యుద్ధంలో పాల్గొని మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మధ్య ప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)లో ఏ దేశం సైన్యం బలం ఎంతో ఒకసారి తెలుసుకుందాం.
మిడిల్ ఈస్ట్‌లో ఏ దేశ ఆర్మీ బలమెంత..?
టర్కీ..
మిడిల్‌ఈస్ట్‌లోని దేశాల్లోకెల్లా టర్కీ ఆర్మీ అత్యంత శక్తివంతమైనదని పవర్ ఇండెక్స్ స్కోరు చెబుతోంది. ఇండెక్స్‌లో 0.16971 స్కోరుతో టర్కీ నెంబర్‌వన్ స్థానంలో ఉంది. అత్యాధునిక ఆయుధాలు, వీటిని వాడే నైపుణ్యమున్న బలగాలతో టర్కీ ఆర్మీని పూర్తిగా ఆధునీకరించారు.
ఇరాన్..
పవర్ ఇండెక్స్ స్కోరులో టర్కీ తర్వాత మిడిల్‌ఈస్ట్‌లో ఇరాన్ రెండవ స్థానంలో ఉంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న బలగాలు,దేశ అమ్ములపొదిలో ఉన్న మిసైల్‌లు ఇరాన్ బలం. ఇరాన్ పవర్ ఇండెక్స్ స్కోరు 0.22691గా ఉంది.
ఈజిప్టు..
పది లక్షలకుపైగా ఉన్న బలగాలతో ఈజిప్టు మిలిటరీ శక్తివంతంగా ఉంది. 0.22831 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో ఈ దేశం మూడో స్థానంలో ఉంది.
ఇజ్రాయెల్..
ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఇజ్రాయెల్ 0.25961 స్కోరుతో పవర్ ఇండెక్స్‌లో నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. దేశంలో అమల్లో ఉన్న తప్పనిసరి మిలిటరీ సర్వీసు కారణంగా ఇజ్రాయెల్‌కు ఎక్కువ మంది సైనికులు రిజర్వులో అందుబాటులో ఉన్నారు. డిఫెన్స్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ ఈ దేశం సొంతం.
సౌదీఅరేబియా..
బలమైన ఆర్థిక వనరులు,అత్యాధునిక డిఫెన్స్ పరికరాలతో సౌదీ అరేబియా పవర్ ఇండెక్స్‌లో ఐదో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశ స్కోరు 0.32351గా ఉంది.
ఇరాక్..
పవర్ ఇండెక్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ఇరాక్ స్కోరు 0.74411.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)..
సైనికులకు అత్యాధునిక శిక్షణతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో యూఏఈ పవర్ ఇండెక్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు0.80831గా ఉంది.
సిరియా..
పవర్ ఇండెక్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న సిరియా స్కోరు 1.00261.
ఖతార్..
ఖతార్ 1.07891 స్కోరుతో ఖతార్ పవర్ ఇండెక్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది.
కువైట్..
మిడిల్ ఈస్ట్ దేశాల పవర్ ఇండెక్స్‌లో కువైట్ పదవ ప్లేస్‌లో ఉంది.ఇండెక్స్‌లో ఈ దేశం స్కోరు 1.42611.
అసలు ‘పవర్’ ఇండెక్స్ స్కోరు ఏంటి.. ఎలా లెక్కిస్తారు..
ఒక దేశం మిలిటరీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పవర్ ఇండెక్స్‌ను కొలమానంగా వాడతారు. దేశాల సైన్యాలకు ఉన్న వివిధ రకాల సామర్థ్యాల ఆధారంగా పవర్ ఇండెక్స్ స్కోరును నిర్ణయిస్తారు.ఒక దేశం సైన్యంలో మొత్తం బలగాల సంఖ్య, పదాతి దళం, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రవాణా సదుపాయాలు, చమురు వంటి సహజ వనరుల లభ్యత, ఆర్థిక బలం, ప్రపంచపటంలో భద్రతా పరంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉందా లేదా అనే అంశాలన్నింటినీ పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కించడానికి పరిగణలోకి తీసుకుంటారు.
స్కోరు విషయంలో చిన్న ట్విస్టు..
ఒక దేశ సైన్యం పవర్ ఇండెక్స్ స్కోరు లెక్కింపులో పైన పేర్కొన్న అంశాలన్నింటికీ సమాన వెయిటేజీ ఇస్తారు. ఉదాహరణకు ఒక దేశ ఆర్మీ అన్ని హంగులూ కలిగిన ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం కలిగి ఉందనుకుందాం. కానీ ఇదే దేశానికి నేవీ బలం అంతగా లేకపోతే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో ఈ దేశం వెనుకబడుతుంది. పవర్ ఇండెక్స్ స్కోరును ఒక దేశ సైన్యానికి సంబంధించిన అన్ని సామర్థ్యాల మేళవింపుగా భావించొచ్చు. అయితే పవర్ ఇండెక్స్ స్కోరు విషయంలో చిన్న ట్విస్టుంది. ఈ స్కోరు ఎంత తక్కువగా ఉంటే దేశాల సైన్యాలు అంత బలంగా ఉన్నాయని అర్థం.
ఇదీ చదవండి: నస్రల్లా వారసుడూ మృతి
Comments
Please login to add a commentAdd a comment