ఉక్రెయిన్‌పై భారీ సైనిక చర్య దిశగా రష్యా ముమ్మర సన్నాహాలు. అదే జరిగితే కఠినమైన ఆంక్షలతో పాటు సైనికంగా కూడా తీవ్రస్థాయిలో ప్రతి చర్యలు తప్పవని అమెరికా బెదిరింపులు. ఉక్రెయిన్‌లో సైనిక స్థావరాల ఏర్పాటుతో రష్యాను కట్టడి చేసేందుకు నాటో ప్రయత్నాలు. ఆ కూటమిలో చేరి రష్యా దాడి గండం నుంచి గట్టెక్కాలని చూస్తున్న ఉక్రెయిన్. ఈ మాజీ సోవియట్ సభ్య దేశం కేంద్రంగా అమెరికా నేతృత్వంలోని యూరప్ దేశాలకు, రష్యాకు మధ్య నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీయనున్నాయి?
రష్యా, ఉక్రెయిన్ గొడవలు ఇప్పటివి కావు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన నాటినుంచీ వాటి మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. అది కాస్తా పెరిగి 2014లో దక్షిణ ఉక్రెయిన్‌లోని క్రిమియాను రష్యా ఆక్రమించి తన భూభాగంలో కలుపుకునే దాకా వెళ్లింది. అంతటితో ఆగకుండా తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్‌స్క్, లుహాన్‌స్క్ ప్రావిన్సుల్లో పెచ్చరిల్లిన వేర్పాటువాద ఉద్యమాలను రష్యానే పెంచి పోషిస్తోందన్నది పాశ్చాత్య దేశాల ఆరోపణ. రష్యా వీటిని ఖండిస్తున్నా, వేర్పాటువాద దళాలకు రష్యా సైనికాధికారులే నేరుగా నాయకత్వం వహిస్తున్నారని ఉక్రెయిన్ అంటోంది.
2015లో జర్మనీ, ఫ్రాన్స్ జోక్యంతో శాం తి ఒప్పందం కుదిరినా మూణ్నాల్ల ముచ్చటే అ యింది. తిరుగుబాటుదారులకు క్షమాభిక్ష, ఆ ప్రాంతాలకు విస్తృత స్వయంప్రతిపత్తి వంటి నిబంధనను ఉక్రెయిన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ రష్యా ఏడాదిగా మళ్లీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో తాజాగా 1.75 లక్షల సైన్యాన్ని ఉక్రెయిన్ సరిహద్దులకు 200 కిలోమీటర్ల దూరంలో మోహరించిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇదంతా ఆ దేశంపై మెరుపు దాడి కోసమేనని మండిపడుతోంది. రష్యా మాత్రం తమకలాంటి ఉద్దేశమే లేదని, అవన్నీ సొంత భూభాగంలో రొటీన్ సైనిక విన్యాసాలేనని చెప్పుకొస్తోంది. నెలన్నర కింద రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మధ్య గంటన్నర పాటు జరిగిన వీడియో కాల్ చర్చలు ఉక్రెయిన్ విషయమై వారిద్దరి పరస్పర హెచ్చరికలతో అర్ధంతరంగానే ముగిశాయి. సైనిక చర్యకు తెగబడితే తీవ్ర పరిణామాలు తప్పవని చర్చల అనంతరం రష్యాను బైడెన్ హెచ్చరిం చారు.
నాటో కేంద్రంగా గొడవ
ఎలాగోలా నాటో కూటమిలో చేరితే అమెరికాతో పాటు శక్తివంతమైన యూరప్ దేశాల దన్నుంటుంది గనుక రష్యా సైనిక బెదిరింపులకు చెక్ చెప్పొచ్చన్నది ఉక్రెయిన్ భావన. ఈ ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. సరిహద్దు గొడవలున్న దేశానికి సభ్యత్వం ఇవ్వడానికి నాటో రూల్స్ ఒప్పుకోవు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దూకుడుకు ఇదీ ఓ కారణమేనని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వొద్దని పుతిన్ పట్టుబడుతున్నారు. అమెరికా నుంచి ఈ మేరకు చట్టబద్ధమైన హామీ డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను తక్షణం నిలిపేయాలని కూడా కోరుతున్నారు. బైడెన్ మాత్రం రష్యా దూకుడే అసలు సమస్య గనుక దానికి తక్షణం ఫుల్‌స్టాప్ పెట్టాలని అంటున్నారు.
ఏం జరగవచ్చు?
కఠినమైన ఆర్థిక ఆంక్షలు తప్పవన్న అమెరికా, యూరప్ దేశాల హెచ్చరికల నేపథ్యంలో రష్యా ఎంతో కొంత వెనక్కు తగ్గవచ్చన్నది కొందరు విశ్లేషకుల భావన. అయితే సైనిక మోహరింపు తదితరాల తర్వాత యూఎస్, యూరప్ దేశాల నుంచి రష్యాకు అనుకూలంగా హామీల వంటివైనా సాధించకుండా వెనక్కు తగ్గితే స్వదేశంలో పుతిన్‌కు సమస్యేనంటున్నారు. ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కన్పించడం లేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్‌కు యూఎస్ భారీగా ఆయుధాలు సరఫరా చేస్తోంది. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉంచుతోంది.
పలు యూరప్ దేశాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. వీటిని తక్షణం నిలిపేయాలన్న రష్యా డిమాండ్‌కు అవి ఒప్పకుంటే ఉద్రిక్తతలు ఎంతో కొంత తగ్గే ఆస్కారముంటుంది. అలాగాక రష్యా, ఉక్రెయిన్ ఘర్షణలు యుద్ధంగా మారితే యూరప్‌కు గ్యాస్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడవచ్చు. యూరప్‌కు దాదాపు 40 శాతం గ్యాస్ రష్యా నుంచే సరఫరా అవుతోంది. ముఖ్యంగా జర్మనీ చాలావరకు రష్యా గ్యాస్‌పైనే ఆధారపడింది. ఇప్పటికే యూరప్‌కు గ్యాస్ సరఫరాను రష్యా కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా తగ్గిస్తూ వస్తోంది. గ్యాస్ అవసరాలు పీక్స్‌లో ఉండే శీతాకాలం వేళ సరఫరా తగ్గిపోవడంతో ఆ దేశాలు ఇప్పటికే అల్లాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment