అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం తలనొప్పిగా మారడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరితంగా జల జగడాల పరిష్కార లక్ష్యంతో ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆలోచన అమల్లోకి వస్తే ప్రస్తుత ట్రిబ్యునల్స్ అన్నీ రద్దవుతాయి. శాశ్వత ట్రిబ్యునల్‌తో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, 1956లో సవరణలు చేసి ప్రత్యేక ధర్మాసనాలు(డీఆర్‌సీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపైనా కేంద్రం సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి అవసరమున్నప్పుడల్లా ఈ బెంచ్‌ల్ని ఏర్పాటు చేస్తారు. వివాదం ముగిశాక బెంచ్ దానంతటదే రద్దవుతుంది. జల వివాదాల చట్టంలో సవరణలు చేయాలన్న ప్రతిపాదనలను గత వారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో సవరణల బిల్లును తెచ్చే అవకాశముంది.