‘పీక్’లో పవర్ ఇవ్వలేదు | 'Peak' is not in the power | Sakshi
Sakshi News home page

‘పీక్’లో పవర్ ఇవ్వలేదు

Published Sat, Jun 28 2014 3:33 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

'Peak' is not in the power

జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తయిన విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వని ఏపీ
 
హైదరాబాద్: ఇరు ప్రాంతాల్లోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలూ కోటా మేరకు పంచుకోవాల్సిందేనని దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) ఆదేశించినా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం పెడచెవిన పెడుతోంది. ఏదో ఒక విధంగా తెలంగాణకు సరఫరా చేయాల్సిన విద్యుత్ కోటాలో కోత పెడుతూనే ఉంది. ప్రధానంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (పీక్ అవర్స్)లో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో తెలంగాణ వాటా మేరకు సరఫరా చేయడం లేదు. ఎస్‌ఆర్‌పీసీ ఆదేశాల మేరకు విద్యుత్‌ను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ)కు తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్ (టీఎస్‌ఎల్‌డీసీ) ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం ఉండటం లేదు. థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మాత్రమే కోటా మేరకు తెలంగాణకు సరఫరా అవుతోంది. ఏపీజెన్‌కో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పీక్ అవర్స్‌లో మాత్రమే సీలేరు బేసిన్‌లోని ఎగువ సీలేరు, డొంకరాయి, దిగువ సీలేరులో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వడం లేదు. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎస్‌ఆర్‌పీసీకి తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి లేఖ కూడా రాశారు.   

 ఇదీ వివాదం!: గతంలో తాము విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏల)ను రద్దు చేసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ఏపీజెన్‌కో లేఖ రాసింది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ మొత్తాన్ని తామే వినియోగించుకుంటామని ఆ  ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్‌కు కత్తెర వేసింది. ఈ అంశంలో దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) జోక్యం చేసుకుని కోటా ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలని, పీపీఏల అంశంలో కేంద్ర విద్యుత్ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి పీపీఏల మేరకు ఇరు ప్రాంతాల్లోని విద్యుత్ ప్లాంట్లలో ఎవరికీ కేటాయించని కోటా 20 శాతం మినహాయించి తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్‌ను సరఫరా చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ పీపీఏలకు ఈఆర్‌సీ ఆమోదం లేనందున రద్దు చేసుకుంటున్నట్టు ఏపీజెన్‌కో ప్రకటించింది. ప్రస్తుతం ఈ పంచాయతీ కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోకి వెళ్లింది. ఈ వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ కమిటీ వచ్చే వరకు అయినా ప్రస్తుత కోటా మేరకే విద్యుత్ సరఫరా జరగాలి. అయినా.. దానిని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోందని ఎస్‌ఆర్‌పీసీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement