
16న విశాఖకు ప్రధాని మోదీ
స్టీల్ ప్లాంట్‌లో బహిరంగ సభకు హాజరు
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్నం రానున్నారు. హెచ్‌పీసీఎల్ నిర్మించిన భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల భూగర్భ ప్రాజెక్టు (ఐఎస్‌పీఆర్‌ఎల్)తో పాటు స్టీల్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ యువరాజ్ విడుదల చేశారు. దాని ప్రకారం.. ప్రధాని 16వ తేదీ ఉదయం ఢిల్లీ నుంచి వైమానిక దళ విమానంలో బయల్దేరి 9.20కి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొంటారు. అక్కడి నుంచి 9.25కి హెలికాప్టర్‌లో బయల్దేరి ఐఎన్‌ఎస్ శాతవాహనకు చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్‌పీసీఎల్ నిర్మించిన ఐఎస్‌పీఆర్‌ఎల్ ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. భూగర్భంలో నిర్మించిన ఈ ప్రాజెక్టును ఉదయం 10 గంటలకు జాతికి అంకితం చేస్తారు. 10.40కి శాతవాహన హెలిపాడ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో స్టీల్‌ప్లాంట్‌కు వెళ్తారు. 12,500 కోట్లతో చేపట్టిన స్టీల్‌ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. 12.40కి స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 1.20కి విశాఖ నుంచి వైమానిక దళ విమానంలో బయల్దేరి వారణాసి వెళ్తారు.