
పొదలకూరు ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు!
♦ మరుగుదొడ్లకు బలవుతున్న ఎంపీడీఓలు
♦ పనితీరు మెరుగుపర్చుకోకుంటే చర్యలు తప్పవంటున్న కలెక్టర్
నెల్లూరు(రెవెన్యూ) : మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి చూపని ఎంపీడీఓలపై చర్యలు మొదలయ్యాయి. మొన్న సైదాపురం ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ జానకి.. శనివారం ఏకంగా పొదలకూరు ఎంపీడీఓ శ్రీహరిని సస్పెండ్ చేయాల్సిందిగాఆదేశించారు. మరికొందరు అధికారులపైనా చర్యలకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ పెట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులను అమలుచేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరుగుదొడ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో పూర్తికాకపోవడంతో ఉన్నతాధికారులు, మంత్రులు జిల్లా అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై కలెక్టర్ ఎం. జానకి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాను 8 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఆత్మకూరు క్లస్టర్ సమావేశాన్ని స్థానిక గోల్డెన్ జూబ్లీహాలులో నిర్వహించారు. మండలాలవారీగా సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తిచేసినా బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, బిల్లుల చెల్లింపులు తదితర విషయాలపై ఎంపీడీఓలకు రెండు పర్యాయాలు సదస్సులు నిర్వహించారు.
వారానికి ఒక పర్యాయం వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి సమీక్షిస్తున్నారు. రెండు నెలలు సమయం ఇచ్చినా ప్రగతి కనిపించలేదు. నిర్మాణాలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టడం లేదు. పొదలకూరు ఎంపీడీఓ రెండు నెలల నుంచి బిల్లులు చెల్లించకుండా రెండు రోజుల్లో 100కుపైగా బిల్లులు చెల్లించారు. ఈ విషయంపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23లోపు ఒక్క బిల్లు కూడా చెల్లించకపోవడంతో ఎంపీడీఓ శ్రీహరిని సస్పెండ్ చేయమని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
నాలుగు రోజుల కిందట బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నా సైదాపురం ఎంపీడీఓను, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈని సస్పెండ్ చేశారు. అనేకమంది పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు నిలిపివేశారు. ఈ నెల 23లోపు బిల్లులు చెల్లించిన వారి జాబితా కలెక్టర్ చేతిలో ఉంది. ఆరు క్లస్టర్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. క్లస్టర్ సమావేశాలు పూర్తి అయ్యేటప్పటికీ ఎంతమంది ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు సస్పెండవుతారో చూడాలి.