
రాజమహేంద్రవరంలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ/దేవీచౌక్/సీటీఆర్‌ఐ: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, రైతుల గతి ఆయనకు పట్టదని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాల మైదానంలో సోమవారం జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. పోలవరం పూర్తి కావడం చంద్రబాబుకు ఇష్టం లేదని, అంచనాలు పెంచుకుంటూ పోతూ, ఆ ప్రాజెక్ట్‌ను ఏటీఎంగా మార్చుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.7 వేల కోట్లు మంజూరు చేసిందని, దాని నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయనన్నారు. తమ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించామని, ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశామని గుర్తు చేశారు. జిల్లాలో పెట్రో కారిడార్, గ్రీన్‌ఫీల్డ్స్ పార్క్స్ కాంప్లెక్స్ నిర్మాణాలకు, అభివృద్ధికి కేంద్రం ముందుకు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని మోదీ అన్నారు. తన వైఫల్యాలను ఇతరులపైకి నెట్టడం చంద్రబాబుకు అలవాటని విమర్శించారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. చంద్రబాబుని పదేపదే యూటర్న్ బాబు, స్టిక్కర్‌బాబు అని మోదీ అన్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
బాబు వ్యతిరేక పవనాలు
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. అడ్డగోలు అవినీతికి, దుర్మార్గపు పాలనకు చిరునామాగా బాబు మారారని, అభివృద్ధికి చంద్రబాబు విలన్ అని దుయ్యబట్టారు. ఓట్లు చీల్చడానికి, లాలూచీ రాజకీయాలు చెయ్యడానికే సినీ హీరో పవన్ కల్యాణ్ రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మంగళగిరి వైపు పవన్ కల్యాణ్ చూడడు. గాజువాక వైపు బాబు చూడడు’’ అని ఎద్దేవా చేశారు.
పోలవరంలో బాబు పాత్ర నామమాత్రం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నూరు శాతం కేంద్ర నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతోందని అన్నారు. ఇందులో చంద్రబాబు పాత్ర నామమాత్రమేనని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాగి సత్యనారాయణ మాట్లాడుతూ, వివిధ కులాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు సామాజిక ఉగ్రవాది అని అన్నారు. టీడీపీకి ఓటు వేస్తే కాంగ్రెస్‌కు వెయ్యడమేనన్నారు. జనసేన, బీఎస్పీకి, బీఎస్పీ.. కాంగ్రెస్‌కు, కాంగ్రెస్.. టీడీపీకి మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థి సత్యగోపీనాథ్‌దాస్, అసెంబ్లీ అభ్యర్థి బొమ్ముల దత్తు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రేలంగి శ్రీదేవి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment