‘రాయ’వరం తరహాలో ‘నామా’ పరం! | Polavaram hydro power project tenders in TDP main leader | Sakshi
Sakshi News home page

‘రాయ’వరం తరహాలో ‘నామా’ పరం!

Published Tue, Jun 6 2017 1:01 AM | Last Updated on Wed, Oct 3 2018 7:42 PM

‘రాయ’వరం తరహాలో ‘నామా’ పరం! - Sakshi

‘రాయ’వరం తరహాలో ‘నామా’ పరం!

పోలవరం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు టెండర్లలోనూ చక్రం తిప్పిన ప్రభుత్వ ముఖ్య నేత
మాజీ ఎంపీ నామాను అడ్డుపెట్టుకుని భారీగా కమీషన్‌లు కాజేసే ఎత్తుగడ
రెండు బహుళ జాతి కాంట్రాక్టు సంస్థలతో కలసి దండుకునేందుకు వ్యూహం


సాక్షి, అమరావతి: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టును తన అక్రమార్జనకు అక్షయపాత్రగా మార్చుకున్న ప్రభుత్వ ముఖ్య నేత.. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సంస్థకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులోనూ వందల కోట్లను కొట్టేసేందుకు తాజాగా వ్యూహం పన్నారు. ఇందు కోసం టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డుపెట్టుకుని పోలవరం హెడ్‌వర్క్స్‌ (ప్రధాన పనులు)ను సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్‌లు కొట్టేస్తోన్న తరహా వ్యూహాన్నే ఎంచుకున్నారు.

టెండర్ల గడువును నాలుగు సార్లు పొడిగించారు. తాజాగా షెడ్యూళ్లు దాఖలు చేసే గడువును జూన్‌ 13గా ఖరారు చేశారు. జూన్‌ 14న టెక్నికల్‌ బిడ్‌.. జూన్‌ 29న ప్రైస్‌ బిడ్‌ ఖరారు చేసి అస్మదీయ సంస్థకే పనులు కట్టబెట్టడానికి పావులు కదుపుతున్నారు. పోలవరం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకముందే ఉమ్మడి రాష్ట్రంలో తను పెంచి పోషిం చిన రెండు బహుళ జాతి కాంట్రాక్టు సంస్థలను ప్రభుత్వ ముఖ్య నేత మళ్లీ చేరదీశారు.

ఆ సంస్థలతో కలసి టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సంస్థ మధుకాన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసేలా చక్రం తిప్పారు. వర్టికల్‌ హారిజాంటల్‌ ఫుల్‌ కప్లాన్‌ టర్బైన్‌లు ఉత్పత్తి చేసి బిగించడం, హైడ్రాలిక్‌ హోస్ట్‌ను ఉత్పత్తి చేసి అమర్చిన అనుభవం, జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుల పనులు చేసిన అనుభవం ఉన్న సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తే తాను ఎంపిక చేసిన సంస్థకే పనులు దక్కుతాయని ముఖ్య నేత భావించారు. ఆ మేరకు జెన్‌కో అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆ సంస్థకు అనుకూలంగా టెండర్ల నిబంధనలు రూపొం దించారు.

58 నెలల్లోగా పూర్తి చేయాలనే షరతు విధించి జనవరి 25న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. అంతకు ముందే పనుల అంచనా వ్యయాన్ని రూ.3,013.68 కోట్ల నుంచి రూ.4,956.39 కోట్లకు పెంచేశారు. 2010 – 11 ధరలతో పోల్చితే ప్రస్తుతం స్టీలు, సిమెంట్, డీజిల్, పెట్రోల్‌ ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా అంచనా వ్యయం 64.46 శాతం (రూ.1,942.81 కోట్లు) పెంచడంపై నీటి రంగం నిపుణులు విస్తుపోతున్నారు.  ప్రాజెక్టు పనులను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందనే సంకేతాలను తస్మదీయ కాంట్రాక్టర్లకు పంపినట్లయింది. దాంతో తాను ఎంపిక చేసిన సంస్థ మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నది ముఖ్య నేత ఎత్తుగడగా జెన్‌కో అధికారులు చెబుతున్నారు.

సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్‌ల దందా
పోలవరం హెడ్‌ వర్క్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డుపెట్టుకుని కాంక్రీట్‌ పనులను ఫూజీమీస్టర్, పెంటా, మట్టి పనులు త్రివేణి, డయాఫ్రమ్‌ వాల్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులు బావర్, ఎల్‌ అండ్‌ టీ, గేట్ల పనులు బీకెన్, కాఫర్‌ డ్యామ్‌ జియో గ్రౌటింగ్‌ పనులు కెల్లర్‌ సంస్థకు సబ్‌ కాంట్రాక్టు కింద అప్పగించి ప్రభుత్వ ముఖ్యనేత భారీ ఎత్తున కమీషన్‌లు కొట్టేస్తున్నారు. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులు నామా సంస్థకు దక్కాక అదే రీతిలో సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి కమీషన్‌లు కొట్టేయాలన్నది ఆయన ఎత్తుగడ. ఇందుకోసం తనకు అనుకూలమైన సంస్థలకు పనులు దక్కేలా కీలక నిబంధనలు తప్పనిసరి చేయడం గమనార్హం.

 ఏటా రూ.1,200 కోట్లకు తక్కువ కాకుండా టర్నోవర్, అన్ని పన్నులు చెల్లిస్తూ లాభాల ఆర్జన, బ్యాంకుల్లో రూ. 210 కోట్ల నగదు నిల్వ, లేక ఆ మేరకు అప్పు ఇవ్వడానికి బ్యాంకు అంగీకా రపత్రం, ఐదేళ్లలో సీడీఆర్‌ (కార్పొరేట్‌ డెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌), ఎస్‌డీఆర్‌ (స్ట్రాటజిక్‌ డెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌) అమలు చేసి ఉండకపోవడం, ఏటా రూ.140 కోట్ల విలువైన జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులు చేసి ఉండటం, 200 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి తగ్గకుండా 12.5 స్ట్రోక్‌ హైడ్రాలిక్‌ సిలిండర్‌తో కూడిన హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ను ఉత్పత్తి చేసే సంస్థలు, డీలర్లతో అవగాహన ఒప్పందం తదితర నిబంధనలు రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement