
ఆ హక్కు కాంగ్రెస్‌కు లేదు
పోలవరంపై ఆర్డినెన్స్ తెచ్చింది బీజేపీయే
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
నెల్లూరు : పోలవరం ప్రాజెక్టు అంశంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని, పోలవరానికి ఆర్డినెన్స్ తెచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రంలో శనివారం జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు పదేళ్ల క్రితమే టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రాన్ని రెండుగా విభజించి, న్యాయం చేయకుండా గాలికొదిలేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు.
9 నెలల కిందట గద్దెనెక్కిన ఎన్‌డీఏ ప్రభుత్వంపై నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నెల 28న ఐఐటీ, ఐఐఐటీ, ఐఎస్‌ఆర్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబుతో కలసి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.నారాయణ, పి.మాణిక్యాలరావు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
శ్రీసిటీ ఐఐఐటీలో స్మార్ట్ సిటీస్ ప్రారంభం
చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలంలోని శ్రీసిటీ సెజ్‌లోని ఐఐఐటీలో కేంద్ర వుంత్రి వెంకయ్యునాయుుడు శనివారం స్మార్ట్ సిటీస్‌ను ప్రారంభించారు.
ప్రక్రియ వేగవంతం: ఎంపిక చేసిన కొన్ని ముఖ్యపట్టణాలను స్మార్ట్‌సిటీలుగా రూపొందించే ప్రక్రియను అక్టోబర్ నుంచి వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీలో కొన్ని పరిశ్రమలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి శనివారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉదయం 10.50 గంటలకు విమానంలో చెన్నైకి చేరుకున్న మంత్రి కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు 3వ నంబర్ ద్వారం సమీపంలోని వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారు. ఆయన లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి 3వ నంబరు ద్వారానికున్న గ్లాస్ డోర్ ఊడిపడి ముక్కలు ముక్కలైంది. ఈ శబ్దంతో ఒకవైపు విమానాశ్రయ అధికారులు, మరోవైపు వెంకయ్య భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.