పోలవరం రోడ్డు భీకరం, భయానకం | Polavaram Project Service Road Became Destroyed | Sakshi
Sakshi News home page

పోలవరం రోడ్డు భీకరం, భయానకం

Published Sun, Nov 4 2018 4:34 AM | Last Updated on Sun, Nov 4 2018 4:34 AM

Polavaram Project Service Road Became Destroyed - Sakshi

అది పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే సర్వీసు రోడ్డు.. సమయం ఉదయం 8 గంటలు.. భూకంపం వచ్చినట్టుగా రోడ్డుకు మెల్లగా ప్రకంపనలు.. పలు చోట్ల రోడ్డు ఒక్కసారిగా 15 నుంచి 20 అడుగుల మేర పైకి లేచింది.. ఆ తర్వాత రోడ్డు మొత్తానికీ బీటలు.. కుంగడం మొదలైంది.. మధ్యాహ్నం 12 గంటల వరకూ రోడ్డు బీటలువారుతూనే ఉంది.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాలు కూలిపోతున్నాయి. తీగలు తెగిపడుతున్నాయి.. ఆ రోడ్డంతా భయానక వాతావరణం.. అసలేం జరుగుతుందో అర్థంకావడంలేదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనిచేసే కార్మికులు బెంబేలెత్తిపోయారు.. పరుగులుపెట్టారు. 

సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే సర్వీసు రోడ్డు దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్డుకు మధ్యలో దాదాపు కిలోమీటర్‌ మేర శనివారం ఒక్కసారిగా బీటలువారడంతో పాటు పలు ప్రాంతాల్లో 15 నుంచి 20 అడుగుల వరకూ పైకి లేవడంతో పోలవరం ప్రాంత ప్రజలు, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. భూప్రకంపనలు వచ్చాయేమోనని ఆందోళన చెందారు. పోలవరం గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే ఘటన చోటు చేసుకుంది. అసలు ఎందుకిలా జరిగిందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. భూప్రకంపనలు వస్తే భూమి కిందకు దిగుతుంది గానీ.. పైకి లేవదంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా డంపింగ్‌ చేస్తుండటం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు.

ఈ రోడ్డుకు ఇరువైపులా సుమారు 50 అడుగులకు పైగా మట్టి, రాయి డంపింగ్‌ చేశారు. డంపింగ్‌ల ప్రభావం వల్ల రోడ్డు దెబ్బతినిందని అధికారులంటున్నారు. రోడ్డు ధ్వంసం అవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం పనులను అధికారులు చేపడుతున్నారు. విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి రెండో విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల నిర్వాసితులకు కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇప్పట్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించే పరిస్థితి కనబడటం లేదు. ఈ రోడ్డు మార్గం సరిచేసి విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసేంత వరకు ఏజెన్సీ గ్రామాలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుకు ఒక వైపు డంపింగ్‌ చేసిన మట్టికి పక్కనే కొంత భాగం కొండమార్గం కూడా ఉంది. దానిపైన ఉన్న రోడ్డు కూడా బీటలు వారి కుంగిపోవడం ప్రారంభించింది. డంపింగ్‌ చేసిన మట్టి, రాయి కూడా రోడ్డుపైకి జారిపడుతోంది.
 
ఎందుకిలా జరిగింది? 
స్పిల్‌ చానల్‌ నుంచి తొలగించిన ఒండ్రు మట్టితో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారని, దీనిపై ప్రతి నిమిషానికి వంద టన్నులకు పైగా బరువున్న డంపింగ్‌ వాహనాలు తిరుగుతుంటాయని.. నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డు ఆ బరువును తట్టుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఈ డంపింగ్‌ యార్డు పక్కన పూర్వం చెరువుండేదని.. దానిని పూడ్చివేయడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని కొందరంటున్నారు. గతంలో కొండ ప్రాంతంలో కురిసిన వర్షం నీరంతా నేరుగా గోదావరి నదిలో కలిసేది. అయితే కాంట్రాక్టర్లు డ్రైనేజీ విషయాన్ని పట్టించుకోకుండా రోడ్డు వేయడంతో వర్షం నీరు బయటకు వెళ్లే మార్గంలేక ఇలా జరిగి ఉండొచ్చని స్థానికులంటున్నారు.
 
ఇటువంటివి జరుగుతూనే ఉంటాయ్‌ 
దీనిపై పోలవరం ప్రాజెక్టు సలహాదారుడు వీఎస్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ.. అధిక లోడుతో ఉన్న వాహనాలు డంపింగ్‌కు తిరుగుతుండటం వల్ల ఒత్తిడికి గురై రోడ్డు పైకి లేచిందని, ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement