damaged roads
-
AP: ఇదీ మార్పు.. రహదారి రయ్..రయ్..
నాడు ► రాష్ట్రవ్యాప్తంగా రహదార్లు పూర్తిగా నిర్లక్ష్యం ► మరమ్మతుల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోని వైనం ► రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లింపు ► 2019 నాటికి రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు ► అప్పుడు భారీ వర్షాలు, మహమ్మారి కోవిడ్ లేదు ► ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు రూ.2,953.81 కోట్లు ► ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.591 కోట్లు ► రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు వెచ్చించిన నిధులు రూ.4,325 కోట్లే ► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.3,160.38 కోట్లు మాత్రమే . ► ఇతరత్రా కలిపి మొత్తంగా 2014 నుంచి 2019 వరకు రోడ్లకు వెచ్చించిన నిధులు రూ.23,792.19 కోట్లు నేడు ► వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు, కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ► ప్రాధాన్యతా క్రమంలో రహదారుల నిర్మాణం ► ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులకు మోక్షం ► గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి సత్వర చర్యలు ► రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు ► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ. 7,340 కోట్లు ► పంచాయతిరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ. 5,443.69 కోట్లు ► జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 25,304 కోట్లు ► మొత్తంగా నాలుగున్నరేళ్లలో వెచ్చించిన మొత్తం రూ.42,236.28 కోట్లు ► మొత్తంగా రోడ్ల నిర్మాణం 7,600 కిలోమీటర్లు -
కుంగిన సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారి
సాక్షి, సంతోష్‌నగర్: సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐ.ఎస్.సదన్ చౌరస్తా నుంచి సంతోష్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో పిల్లర్ల కోసం గోతులు తీసి అలాగే వదిలేశారు. దీంతో భూమి కుంగిపోవడంతో రోడ్డుపై భారీగా గుంత ఏర్పడింది. అప్రమత్తమైన స్థానికులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులతో సంతోష్‌నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతను మట్టితో పూడ్చివేశారు. చదవండి: ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ? -
Heavy Rains: రోడ్లకు వర్షాఘాతం
సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ జిల్లాల్లో దాదాపు 1,500 కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనే దాదాపు 800 కి.మీ. మేర రోడ్లు దెబ్బతినగా... నెల్లూరు జిల్లాల్లో దాదాపు 400కి.మీ., అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మరో 300 కి.మీ. మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా ఆ జిల్లాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. వరద తగ్గితేగానీ ఎంతమేరకు రోడ్లు దెబ్బతిన్నాయన్నది కచ్చితంగా చెప్పలేమని ఆర్ అండ్ బీ అధికారులు అంటున్నారు. మరోవైపు దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.100 కోట్లు అవసరమని కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. ఆర్ అండ్ బీ అధికారుల బృందాలు ఆ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్లపై ట్రాఫిక్‌ను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దెబ్బతిన్న హైవేలు మరోవైపు పలుచోట్ల జాతీయ రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్ జిల్లా కమలాపురం వద్ద పాపాగ్నిపై వంతెన కూలిపోయింది. 1977లో నిర్మించిన ఈ వంతెనపై ఉన్న ఏడు స్లాబుల్లో ఒకటి కూలిపోగా.. మిగిలిన ఆరు స్లాబులు కుంగిపోయాయి. దాంతో ఆ వంతెనకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనంతపురం నుంచి కడప వెళ్లే వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా మళ్లిస్తున్నారు. కూలిన వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించారు. నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని దారమడుగు వద్ద జాతీయ రహదారి–16 తెగిపోయింది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి మార్గం ధ్వంసమైంది. పడుగుపాడువద్ద రహదారి కోతకు గురైంది. దాంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు చాలాసేపు స్తంభించిపోయాయి. తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో వాహనాలను తొట్టంబేడు వద్ద నిలిపివేసి.. కడప, పామూరు, దర్శి మీదుగా మళ్లిస్తున్నారు. దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు తక్షణ మరమ్మతులు వర్షాలకు గండ్లు పడిన గ్రామీణ రోడ్లను రూ.30.57 కోట్లతో తక్షణం మరమ్మతులు చేపడుతున్నట్టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ సుబ్బారెడ్డి తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో 241 రోడ్లకు పలుచోట్ల గండ్లు పడ్డాయని ఇంజనీరింగ్ అధికారులు గుర్తించినట్టు ఆయన చెప్పారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 116 ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లకు గండ్లు పడగా.. నెల్లూరు జిల్లాలో 72, అనంతపురం జిల్లాలో 53 రోడ్లకు గండ్లు పడినట్టు గుర్తించారు. మరో 772 గ్రామీణ రోడ్లు రోజుల తరబడి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిని పెద్దపెద్ద గుంతలు ఏర్పడినట్టు గుర్తించామన్నారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 463 రోడ్లు గుంతలు పడి దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 2,254 కి.మీ. గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నట్టు వివరించారు. 4 జిల్లాల్లో 9 చోట్ల ప్రభుత్వ భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. -
భారీ వర్షాలతో ధ్వంసమైన లింక్ రోడ్డు
-
హైదరాబాద్‌లో పదే పదే.. అదే సీన్
వర్షం కురిసిన ప్రతిసారీ నగరం వణికిపోతోంది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఎప్పటిలాగే పలు కాలనీలు, బస్తీలతోపాటు ప్రధాన రహదారులు నీట మునిగాయి. వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. అధికారుల లెక్కల మేరకు నగరంలో 200 వాటర్‌లాగింగ్ ప్రాంతాలుండగా, లెక్కలో లేనిప్రాంతాలు ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో శుక్రవారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ మధ్య కేంద్రీకృతమైందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగ రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటి ంచింది. బేగంపేటలోని ద్వారకాదాస్ సొసైటీలో ఇలా.. కాగా గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో 9–10 సెంటీమీటర్ల మేర కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీ ల వా సులు నానా అవస్థలు పడ్డారు. కాగా రాత్రి 10 గంటల వరకు ఆర్సీ పురంలో 4.8 సెం.మీ., శేరిలింగంపల్లి 3.0, ఖాజాగూడ 2.6, మణికొండ 2.5, బీహెచ్ఈఎల్ 2.4, రాయదుర్గం 1.9, షేక్‌పేట్ 1.9, లింగంపల్లి 1.6, మెహిదీపట్నం 1.5, గుడిమల్కాపూర్‌లో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: నేడు మహా గణపతికి నేత్రోత్సవం ► మూడు గంటల్లోనే దాదాపు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఎక్కువ ప్రభావం కనిపించింది ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, కూకట్పల్లి, కృష్ణాగర్, లక్డీకాపూల్,పంజగుట్ట తదితర ప్రాంతాల్లో వర్ష తాకిడికి ప్రజలు అల్లాడిపోయారు ► ప్రధాన రహదారుల ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు నిలిపోవడంతో ముందుకు కదల్లేక వాహనవారులు పడరాని పాట్లు పడ్డారు ► నగర ప్రజలకు సుపరిచితమైన రాజ్‌భవన్‌రోడ్, ఒలిఫెంటా బ్రిడ్జి, మైత్రీవనం, విల్లామేరీ కాలేజ్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వంటి ప్రాంతాల్లోనే కాక పలు కొత్తప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయింది ► జీహెచ్ఎంసీకి 59 ఫిర్యాదులందాయి. వీటిల్లో 40 నీటినిల్వలకు సంబంధించినవి కాగా, 19 ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఫిర్యాదులందని సమస్యలు ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి -
Telangana: ఇవేం రోడ్లు.. వాహనదారుల బెంబేలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయితీరాజ్ శాఖ నుంచి రోడ్లు భవనాల శాఖకు బదిలీ అయిన గ్రామీణ రోడ్లు.. ఇలా ఆ రోడ్డు, ఈ రోడ్డు అని లేదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్లూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ధైర్యం చేసి కొద్దిగా దూరంగా వెళితే చాలు ఒళ్లు హూనమవుతోంది. ఎప్పట్నుంచో మరమ్మతులకు నోచక గుంతలు పడిన రోడ్లు ఇటీవలి భారీ వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు తీస్తున్నాయి. జాతీయ రహదారుల మరమ్మతుకు చాలాచోట్ల సాంకేతిక అంశాలు అడ్డుగా మారుతుండగా, రాష్ట్ర రహదారులను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసేందుకు నిధుల లేమి ఆటంకంగా మారింది. రోడ్లు భవనాల శాఖలోకి బదిలీ అయిన గ్రామీణ రోడ్లపై.. అప్పట్నుంచీ ఒక్క కంకర రాయి కూడా పడలేదంటే అతిశయోక్తి కాదు. హైవేపై స్పీడుకు తారు ధరలతో బ్రేకు జాతీయ రహదారులంటే.. వాహనం రయ్యిన దూసుకెళ్లేలా, ఎలాంటి కుదుపులకు తావివ్వని విధంగా నున్నగా, విశాలంగా ఉండాలి. ఆ మేరకు తీర్చిదిద్దేందుకే సాధారణ రోడ్లను జాతీయ రహదారుల పరిధిలోకి తెస్తారు. వాటి నిర్వహణ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ ఇప్పుడు వాటిని ఓ విచిత్ర సమస్య వెంటాడుతోంది. కోవిడ్ సమస్య ఉత్పన్నం కాకముందు తారు ధర మెట్రిక్ టన్నుకు రూ.27 వేలుగా ఉండేది. గత ఏడాదిన్నర కాలంలో దాని ధర ఏకంగా రూ.40 వేలకు చేరింది. దీంతో జాతీయ రహదారుల రెన్యూవల్ వర్క్స్ (పూర్తిస్థాయి మరమ్మతులు)కు పిలిచే టెండర్లలో కాంట్రాక్టర్లు ఎక్కువ ధరను కోట్ చేస్తున్నారు. సాధారణంగా 5 శాతం ఎక్సెస్ వరకు అనుమతి ఉంటుంది. కానీ తారు ధర భారీగా పెరగటంతో కాంట్రాక్టర్లు 25 శాతం వరకు ధర పెంచి కోట్ చేస్తున్నారు. ఇది నిబంధనలకు లోబడి లేని విషయం కావటంతో అధికారులు టెండర్లను రద్దు చేస్తున్నారు. కొన్ని చోట్ల టెండర్లు ఓకే అయినా.. తారు ధర అదుపులోకి వచ్చాక రెన్యూవల్ వర్క్స్ చేపట్టొచ్చని కాంట్రాక్టర్లు చిన్నపాటి గుంతలను సరిచేసేందుకే పరిమితమవుతున్నారు. రాష్ట్ర రహదారుల్లో 20 వేల కి.మీ. తిప్పలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి రెండు వరుసల రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మించిన దాదాపు 8 వేల కి.మీ. రోడ్లు మాత్రం బాగున్నాయి. ఇవి పోను రాష్ట్రంలో మిగిలిన 20 వేల కి.మీ మేర విస్తరించి ఉన్న రాష్ట్ర రహదారులు మాత్రం క్రమంగా దారుణంగా మారుతున్నాయి. ఇందులో ఏడు వేల కి.మీ మేర ఉన్న పాత పంచా యతీరాజ్ శాఖలోని గ్రామీణ రోడ్లు దాదాపు ధ్వంసమయ్యాయి. ఈ రోడ్లను ఉన్నతీకరించేందుకు గత ఏడేళ్ల కాలంలో కొన్నికొన్ని చొప్పున రోడ్లు భవనాల శాఖకు బదిలీ చేశారు. ఈ శాఖ ఆధీనంలోని 21 వేల కి.మీ. రోడ్లను నిర్వహించేందుకే నిధులు సరిపోని పరిస్థితిలో, కొత్తగా వచ్చిచేరిన ఈ రోడ్లను నిర్వహించటం దానివల్ల కావటం లేదు. దీంతో ఈ ఏడేళ్లలో ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. ఆ రోడ్లను బలవంతంగా తమకు అప్పగించారన్న అభిప్రాయంతో ఆ శాఖ ఉంది. వరంగల్ శివారు హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామం నుంచి ఎల్కతుర్తి మధ్య రోడ్డు. దీని పరిస్థితి కూడా దారుణంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు నామరూపాల్లేకుండా చెదిరిపోయి పెద్దపెద్ద గోతులేర్పడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. అయినప్పటికీ ఆరోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఉత్తర తెలంగాణలో కొంత మేర ఓకే ఇక గత ఏడాది నుంచి వానలు, ఇతర కారణాలతో దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోడ్ల మరమ్మతుకు డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ప్రభుత్వం రూ.300 కోట్లు (బొగ్గు తవ్వకాల ప్రభావం ఉన్న జిల్లాలకు) కేటాయించింది. వాటితో కొన్ని ప్రాంతాల్లో పనులు జరగటంతో కొంతమేర ఆయా రోడ్లు బాగుపడ్డాయి. పనులు జరగని చోట్ల వాహనాలు సరిగా తిరగలేని దుస్థితే ఉంది. అదే దక్షిణ తెలంగాణలో పనులు అంతగా జరగకపోవటంతో ఈ ప్రాంతాల్లో ఎక్కువ సమస్యలు నెలకొన్నాయి. ఇటీవలి వానల తర్వాత గుంతలు పూడ్చేందుకు రోడ్లు భవనాల శాఖ రూ.25 కోట్లు విడుదల చేసింది. కానీ అవి ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది. తీర్చిదిద్దాలంటే వేల కోట్లు కావాలి ఇప్పటికిప్పుడు 21 వేల కి.మీ రోడ్లపై గుంతలు పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలంటే రూ.550 కోట్లు కావాలని ఆర్ అండ్ బీ అధికారులు గుర్తించారు. ఆ నిధుల కోసం ఇప్పుడు ఆ శాఖ ఎదురుచూస్తోంది. గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల బిల్లులు బకాయి ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావటం లేదు. వీటిల్లో ఒక్క పాత పంచాయతీ రోడ్ల తాత్కాలిక మరమ్మతులకే రూ.250 కోట్లు అవసరం. వాటిని పూర్తిస్థాయి మరమ్మతు చేస్తూ సింగిల్ రోడ్లుగా కొత్త తారు పూతతో తీర్చి దిద్దాలంటే ఏకంగా రూ.3 వేల కోట్లు కావాలి. అదే రెండు వరుసలకు విస్తరించాలంటే రూ.5 వేల కోట్లు కావాలి. ముట్టుకుంటే ఇంత ఖర్చు కానుండటంతో రోడ్లు భవనాల శాఖ వాటి జోలికెళ్లటం లేదు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై మరిపెడ–దంతాలపల్లి మధ్య రోడ్డు దుస్థితి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఈ రోడ్డు పూర్తిస్థాయి మరమ్మతు జరిగింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. అప్పట్నుంచీ తూట్లు పడుతూ పడుతూ ఇలా తయారయ్యింది. పెద్దపెద్ద గుంతలతో వాహనదారులకు నిత్యం నరకం చూపుతోంది. ఇటీవల దీని మరమ్మతుకు 3 పర్యాయాలు టెండర్లు పిలిస్తే, తారు (బిటమిన్) ధరలు బాగా పెరిగాయని చెప్పి కాంట్రాక్టర్లు 25శాతానికి పైగా ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేయటంతో అధికారులు తిరస్కరించారు. తారు ధరల పెంపునకు తగ్గట్టు బిల్లులు చెల్లించే అవకాశం లేక జాతీయ రహదారుల విభాగం విషయాన్ని ఢిల్లీకి చేరవేసి మిన్నకుండిపోయింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే హైదరాబాద్–నల్లగొండ ప్రధాన రహదారి అంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. అంతలా ఈ రోడ్డు దెబ్బతింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలు ఆటంకంగా మారాయి. ఫలితంగా వాహనదారులు ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు. -
వైరల్: నడి రోడ్డు మీద తలస్నానం!
జకర్తా: వాహనదారులు ఏ చిన్న పొరపాటు చేసినా చలానా వేయకుండా వదిలిపెట్టరు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలానా డబ్బును కూడా ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటారు. రూల్స్ విషయంలో ఇంత స్ట్రిక్ట్‌గా ఉండే పోలీసులు రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నా అస్సలు పట్టించుకోరు. ఈ తీరుకు చిర్రెత్తిపోయాడు ఇండోనేషియాకు చెందిన అమక్ ఓహాన్ అనే వ్యక్తి. వర్షపు చుక్క పడితే చాలు కాలువను తలపిస్తోన్న రోడ్డును బాగు చేయించే ఉద్దేశ్యమే లేదా? అని ఆలోచించాడు. ఎలాగైనా అధికారుల కళ్లు తెరిపించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వినూత్న నిరసనకు దిగాడు. నడి రోడ్డు మీద బురద నీళ్లలో కూర్చుని స్నానం చేశాడు. అందులోనే పడుకుని అటూఇటూ బొర్లాడు. షాంపూ పెట్టుకుని ఆ బురద నీళ్లతోనే తల శుభ్రం చేసుకున్నాడు. దారిన పోయేవాళ్లు అతడి విన్యాసాలను విడ్డూరంగా చూడగా మరికొందరు ఈ తతంగాన్ని కెమెరాల్లో బంధించారు. ఇలా స్నానం చేయడానికి ముందు ఫొటోషూట్‌తో పాటు చేపలు కూడా పట్టాడట. మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో స్పందించిన అధికారులు మరమ్మత్తులు చేసేందుకు సిద్ధమయ్యారట. అక్కడి మీడియా వెలువరించిన కథనాల ప్రకారం ఈ విచిత్ర నిరసన ఇండోనేషియాలోని వెస్ట్ నుసా టెంగారాలోని ప్రయ నగరంలో జరిగింది. దీని గురించి ఓహాన్ మాట్లాడుతూ.. "ఈ గుంతలమయమైన రోడ్ల వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి దుస్థితిని అధికారులకు తెలియజేసేందుకు, రోడ్డు మీద డ్రైనేజీ పొంగి పొర్లడాన్ని నిరసిస్తూ అక్కడ స్నానం చేశాను" అని చెప్పుకొచ్చాడు. చదవండి: వైరల్: నా రూటే సపరేటు అన్నట్లు..! రెండు శునకాల బెలూన్ ఆట.. చూస్తే వావ్ అనాల్సిందే! -
75 కిలోమీటర్లు.. 350 గోతులు
నిజ్జంగా నిజం.. నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు గానీ ఒక్కసారి ఆ రోడ్డు వెంట ప్రయాణం చేస్తే చాలు నరకమంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుస్తుంది.. ఓ విధంగా చెప్పాలంటే గిరిజనుల పట్ల గత తెలుగుదేశం పాలకుల చిన్నచూపు, అంతులేని నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.. మన్యంలోని జీకే వీధి మండలం ఆర్వీనగర్– పాలగడ్డ వరకు మొత్తం 75.6కిలోమీటర్ల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులకు 2016లోనే నిధులు విడుదలయ్యాయి. డబుల్‌రోడ్డు అటుంచి ఉన్న సింగిల్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయినా గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్అండ్బీ అధికారులు ముందుగా ఈ రోడ్డు పనులపైనే దృష్టిసారించారు. అటవీ అనుమతులు వచ్చేలోగా ముందుగా సింగిల్ రోడ్డుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులతో పాటు తారురోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: చుట్టూ అభయారణ్యం.. మధ్యలో కొండలు, కోనలు.. విశాఖపట్నం–సీలేరు–భద్రాచలం బస్సు రూటులో కొయ్యూరు నుంచి సీలేరు వరకు ప్రయాణించిన వారికి నిజంగా ఆ ప్రయాణమే ఓ అద్భుతంగా అనిపిస్తుంది. ఆ రోడ్డు వెంట కారులోనో, ఆటోలోనో.. ద్విచక్రవాహనంలోనో ప్రయాణించినా చాలు.. అదో అందమైన మజిలీగా అనిపిస్తుంది.. ఇదంతా పర్యాటకుల అనుభూతి. మరి అక్కడే... ఆ మన్యంలోనే తరతరాలుగా నివసిస్తున్న గిరిజనులకు, గిరజనేతరులకు ఆ సింగిల్ రోడ్డు మార్గమే హైవేలాంటిది. అటు ఒడిశాలోని మల్కన్‌గిరి వెళ్లాలన్నా.. తూర్పు గోదావరి జిల్లా భద్రాచలం వెళ్లాలన్నా.. ఇటు కొండదిగి విశాఖపట్నం వయా నర్సీపట్నం రావాలన్నా ఆ ఒక్క రోడ్డు మార్గమే ఆధారం. మరి అటువంటి రోడ్డు మార్గం ఎలా ఉండాలి కానీ గత ఐదారేళ్లుగా ఆ రోడ్డు దాదాపుగా ధ్వంసమైపోయింది. ప్రధానంగా జీకేవీధి నుంచి జిల్లా సరిహద్దు సీలేరు వరకు ఉన్న రోడ్డు పూర్తిగా గొయ్యిలు, గతుకులమయమైంది. సీలేరు వైపున ఉన్న ఏజెన్సీలోని ఏకైక ప్రధాన రోడ్డును బాగుచేయండంటూ గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తూ వచ్చారు. ఫలితంగా మూడేళ్ల కిందట దిగొచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆర్వీనగర్ నుంచి పాలగడ్డ వరకు మొత్తం 75.6 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుకు విస్తరించే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ట్రైబల్ సబ్ ప్లాన్ కింద రూ.84 కోట్లు కూడా మంజూరు చేసింది. సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్ రోడ్డు విస్తరణకు ఆరు రీచ్‌ల కింద పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు నిర్మాణ కాంట్రాక్టును కేసీపీ కన్స్ట్రక్షన్స్కు మూడు రీచ్‌లు, సాయినాథ కన్స్ట్రక్షన్స్కు ఒక రీచ్, కోస్ట్టల్ ఇన్‌ఫీరియల్ సంస్థకు రెండు రీచ్‌లను కట్టబెట్టింది. కానీ సరిగ్గా అప్పుడే టీడీపీ నేతలు తెరపైకి వచ్చారు. ఆ రోడ్డు నిర్మాణం పేరిట రూ.కోట్లు మింగేయాలని భావించారు. అప్పట్లో ఓ మంత్రి కుమారుడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే కొందరు కాంట్రాక్టర్లు టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గలేదు. అడిగినంత ఇవ్వలేమని తేల్చి చెప్పారు. మరోవైపు అభయారణ్యంలో రోడ్డు విస్తరణ పనులకు అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 39.9 హెక్టార్ల భూమి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. పరిహారంగా భూమి ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. వాస్తవానికి అప్పటి పాలకులకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో ఎక్కడో చోట ఖాళీగా ఉన్న భూమిని అప్పజెప్పి పనులు వెంటనే చేపట్టేది. కానీ ఆ మాజీ మంత్రి కుమారుడు పెట్టిన బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గిన నాటి టీడీపీ సర్కారు మొత్తంగా ఆ పనులను అటకెక్కించేసింది. ఓ నెల కాదు.. రెండు నెలలు కాదు.. దాదాపుగా మూడేళ్లు నిధులు ఉండి కూడా పనులను నిలిపివేసింది. ఫలితంగా రోడ్డు మరింత అస్తవ్యస్తమైంది. 75.6 కిలోమీటర్ల రోడ్డులో దాదాపు 350కిపైగా గోతులు, గొయ్యిలు ఉంటాయంటే నమ్మశక్యం కాకపోవచ్చుగానీ పచ్చినిజం. ఆ రోడ్డు వెంట ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నామని రోడ్డు విస్తరణ పక్కన పెట్టి కనీసం మరమ్మతులైనా చేపట్టాలని గిరిజనులు, ప్రయాణికులు నెత్తీనోరు కొట్టుకున్నా, చివరికి ధర్నాలు చేసినా నాటి టీడీపీ ప్రభుత్వం లెక్క చేయలేదు. వాస్తవానికి మరమ్మతు పనులకు అటవీశాఖ అనుమతి అక్కరలేదు. కానీ అసలు టీడీపీ ఏ కోశానా పట్టించుకోలేదు. -
'బీటా'వహం
ప్రాంతం: పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి సమయం: శనివారం ఉదయం 8 గంటలు ఒక ఆటో ప్రయాణికులతో వెళ్తోంది. ఆటో డ్రైవర్ రోజూ ఆదే దారిలో వాహనాన్ని నడుపుతుంటాడు. రోడ్డంతా ఎత్తుపల్లాలుగా ఉండటం, కొద్దిపాటి కదలికలు ఉండటం గమనించాడు. ఎదో కీడు జరగబోతోందని అనుమానించి వెంటనే తెలసిన మిత్రులకు ఫోన్లో చెప్పాడు. అంతే కాసేపటికి విషయం అందరికీ తెలిసి ఆ రోడ్డు వద్దకు వచ్చారు. సమయం: ఉదయం 10 గంటలు ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు స్వరూపమే మారిపోయింది. క్రమంగా రోడ్డు పైకిలేచి బీటలు వారింది. భూప్రకంపనలు వస్తున్నాయేమోనని ఆందోళన చెందారు. ఒక్కోచోట నాలుగైదు అడుగులు కుంగిపోగా, మరికొన్ని చోట్ల రోడ్డు అడుగు వెడల్పు, పది అడుగుల లోతులో బీటలు వారింది. భూకంపం వచ్చినప్పటి మాదిరిగా విధ్వంసం జరిగింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం రూరల్: సర్వీçసురోడ్డు కుంగిన విషయం తెలుసుకున్న పోలవరం ప్రాజెక్టు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సర్వీస్ రోడ్డు కుంగిపోయిందని నిర్ధారించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనూ, పరిసరాల్లోనూ ఎలాంటి ప్రకంపనలు రాలేదని, గత 48 గంటల్లో ఎలాంటి సూచనలు కనిపించలేదని ఆర్టీజీఎస్ – అవేర్ (ఆంధ్రప్రదేశ్ వెథర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చి సెంటర్) నిపుణులు స్పష్టం చేశారు. మట్టిలో తేమశాతం తగ్గడం, వాతావరణంలో మార్పుల వల్లే రహదారిపై పగుళ్లు వచ్చాయని వారు చెబుతున్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న చోట ఈ ఘటన చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణమేమిటో? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గం ఒక్కసారిగా కొంతమార్గం పైకి ఎత్తుగా లేచి బీటలు వారింది. పరిమితికి మించి డంపింగ్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి రోడ్డు పైకి లేచి బీటలు వారిందా, లేదా శాస్త్రీయంగా ఏదైనా కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కేవలం ఆ ప్రాంతంలో ఎందుకు ఇలా జరిగింది? ఇది క్రమేపీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? దీని ప్రభావం పోలవరం గ్రామానికి ఉంటుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారిగా పెద్దపెద్ద బీటలు వారడంతో భూకంపం వచ్చేసిందంటూ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రోడ్డుకు ఇరువైపులా డంపింగ్ చేయడంతో మరో మార్గం లేక ఈ రోడ్డుపై ప్రయాణించే వారు అక్కడే నిలిచిపోయారు. చెరువు పూడ్చడమే కారణమా డంపింగ్ చేసిన ప్రాంతంలో కొంత కొండ ప్రాంతం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో తామరాయిగొంది చెరువు ఉండేదని, చెరువు పూడ్చి డంపింగ్ చేశారని చెబుతున్నారు. అలా చేయడం వల్లే ఇలా జరిగిందా అనేది కొందరి సందేహం. జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. ఈ ప్రాం తానికి ఎవరినీ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 20 అడుగుల ఎత్తు వరకు రోడ్డు క్రమేపీ పెరుగుతుండటంతో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో పోలవరం వాసులు పోలవరం గ్రామానికి సమీపంలో పెద్దెత్తున డంపింగ్ చేయడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని పోలవరం వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. డంపింగ్ ఎత్తు పెరిగిపోవడంతో మట్టి రాయి జారిపోతోందని చెబుతున్నారు. వర్షం నీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో రోడ్డు గుల్లబారిపోతోందని చెబుతున్నారు. ట్రాన్స్‌కోకు రూ.10 లక్షలు నష్టం ప్రాజెక్టు ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణం చేపడితే గాని విద్యుత్ స్తంభాలను వేసి విద్యుత్‌ను పునరుద్ధరించలేమని చెబుతున్నారు. మరో రెండు రోజుల వరకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి గాని, రెండో విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల గిరిజనులకు విద్యుత్ సౌకర్యం కల్పించే అవకాశం కానరావడం లేదు. ప్రాజెక్టు ఈఎన్సీ పరిశీలన ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి సమీపంలో రోడ్డు కుంగిన ప్రదేశాన్ని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిలో వచ్చిన మార్పుల వల్లే ఈ రోడ్డు బీటలు వారిందని, భూకంపం వంటిది కాదని, ఎటువంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రాజెక్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఈయన వెంట ప్రాజెక్టు సీఈ వి.శ్రీధర్, సలహాదారుడు వీఎస్ రమేష్‌బాబులు ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఏజెన్సీలోని 19 గ్రామాల గిరిజనులతో పాటు ప్రాజెక్టు అధికారులు, కార్మికులకు రాకపోకలకు వీలుగా ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలను సాయంత్రానికి ఏర్పాటు చేశారు. రోడ్డుపక్కన ఉన్న డంపింగ్‌యార్డు రోడ్డు మార్గం నుంచి వాహనాలు తిరిగేందుకు వీలుగా ర్యాంపు నిర్మాణం చేపట్టారు. దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉదయం పోలవరం నుంచి టేకూరు వెళ్లిన ఆర్టీసీ బస్సును ప్రాజెక్టు వైపు నిలిపివేయడంతో బస్సులోని ప్రయాణికులు ఉదయం కాలినడకన పోలవరం చేరుకున్నారు. సాయంత్రానికి రోడ్డు మార్గం ఏర్పడటంతో బస్సు పోలవరం చేరుకుంది. -
పోలవరం రోడ్డు భీకరం, భయానకం
అది పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే సర్వీసు రోడ్డు.. సమయం ఉదయం 8 గంటలు.. భూకంపం వచ్చినట్టుగా రోడ్డుకు మెల్లగా ప్రకంపనలు.. పలు చోట్ల రోడ్డు ఒక్కసారిగా 15 నుంచి 20 అడుగుల మేర పైకి లేచింది.. ఆ తర్వాత రోడ్డు మొత్తానికీ బీటలు.. కుంగడం మొదలైంది.. మధ్యాహ్నం 12 గంటల వరకూ రోడ్డు బీటలువారుతూనే ఉంది.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. తీగలు తెగిపడుతున్నాయి.. ఆ రోడ్డంతా భయానక వాతావరణం.. అసలేం జరుగుతుందో అర్థంకావడంలేదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనిచేసే కార్మికులు బెంబేలెత్తిపోయారు.. పరుగులుపెట్టారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే సర్వీసు రోడ్డు దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్డుకు మధ్యలో దాదాపు కిలోమీటర్ మేర శనివారం ఒక్కసారిగా బీటలువారడంతో పాటు పలు ప్రాంతాల్లో 15 నుంచి 20 అడుగుల వరకూ పైకి లేవడంతో పోలవరం ప్రాంత ప్రజలు, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. భూప్రకంపనలు వచ్చాయేమోనని ఆందోళన చెందారు. పోలవరం గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే ఘటన చోటు చేసుకుంది. అసలు ఎందుకిలా జరిగిందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. భూప్రకంపనలు వస్తే భూమి కిందకు దిగుతుంది గానీ.. పైకి లేవదంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా డంపింగ్ చేస్తుండటం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా సుమారు 50 అడుగులకు పైగా మట్టి, రాయి డంపింగ్ చేశారు. డంపింగ్‌ల ప్రభావం వల్ల రోడ్డు దెబ్బతినిందని అధికారులంటున్నారు. రోడ్డు ధ్వంసం అవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం పనులను అధికారులు చేపడుతున్నారు. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి రెండో విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల నిర్వాసితులకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పట్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పరిస్థితి కనబడటం లేదు. ఈ రోడ్డు మార్గం సరిచేసి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేంత వరకు ఏజెన్సీ గ్రామాలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుకు ఒక వైపు డంపింగ్ చేసిన మట్టికి పక్కనే కొంత భాగం కొండమార్గం కూడా ఉంది. దానిపైన ఉన్న రోడ్డు కూడా బీటలు వారి కుంగిపోవడం ప్రారంభించింది. డంపింగ్ చేసిన మట్టి, రాయి కూడా రోడ్డుపైకి జారిపడుతోంది. ఎందుకిలా జరిగింది? స్పిల్ చానల్ నుంచి తొలగించిన ఒండ్రు మట్టితో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారని, దీనిపై ప్రతి నిమిషానికి వంద టన్నులకు పైగా బరువున్న డంపింగ్ వాహనాలు తిరుగుతుంటాయని.. నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డు ఆ బరువును తట్టుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఈ డంపింగ్ యార్డు పక్కన పూర్వం చెరువుండేదని.. దానిని పూడ్చివేయడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని కొందరంటున్నారు. గతంలో కొండ ప్రాంతంలో కురిసిన వర్షం నీరంతా నేరుగా గోదావరి నదిలో కలిసేది. అయితే కాంట్రాక్టర్లు డ్రైనేజీ విషయాన్ని పట్టించుకోకుండా రోడ్డు వేయడంతో వర్షం నీరు బయటకు వెళ్లే మార్గంలేక ఇలా జరిగి ఉండొచ్చని స్థానికులంటున్నారు. ఇటువంటివి జరుగుతూనే ఉంటాయ్ దీనిపై పోలవరం ప్రాజెక్టు సలహాదారుడు వీఎస్ రమేష్‌బాబు మాట్లాడుతూ.. అధిక లోడుతో ఉన్న వాహనాలు డంపింగ్‌కు తిరుగుతుండటం వల్ల ఒత్తిడికి గురై రోడ్డు పైకి లేచిందని, ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. -
కూకట్‌పల్లిలో ప్రజలు వినూత్న నిరసన
-
వర్షాలు తగ్గగానే ఆ పని చేస్తాం: కేటీఆర్
జంటనగరాల్లో చాలాచోట్ల వర్షాలకు రోడ్లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ట్విట్టర్ ద్వారా, ఇంకా పలు రకాలుగా ఏయే ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలిపారు. దాంతో వాటన్నింటికీ కలిపి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. చాలామంది నుంచి హైదరాబాద్‌లో దారుణంగా ఉన్న రోడ్ల పరిస్థితి గురించిన ఫిర్యాదులు వస్తున్నాయని, ఇక మీదట తమ దృష్టి అంతా నగరంలో బాగా పాడైన రోడ్ల మరమ్మతుల మీదే ఉంటుందని ఆయన తెలిపారు. వర్షాలు తమకు కాస్త అవకాశం ఇస్తే ఆ పనులు వెంటనే మొదలుపెడతామని చెప్పారు. Yes, hearing it from many of you; Focus shall be on repairing the heavily damaged roads in Hyderabad. As soon as the rains give us a respite — KTR (@KTRTRS) 15 September 2016 -
వర్షానికి తేలిన కంకర
హైదరాబాద్: నగరంలో ఆదివారం రాత్రి పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి రోడ్లు గుల్లయ్యాయి. బంజారా హిల్స్, అమీర్‌పేట ప్రాంతాల్లో కంకరపైకి తేలడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు జారిపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి తోడు అక్కడక్కడా ఉన్న మ్యాన్‌హోల్‌లు ద్విచక్రవాహనదారులను భయపెడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేసేటప్పుడు మ్యాన్‌హోల్ సమానంగా రోడ్లు వేయటం లేదు. అలా చేయటం వల్ల అవి గుంతలుగా మారి వర్షం పడినపుడు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏ గుంత ఎక్కడ ఉందో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు.