జకర్తా: వాహనదారులు ఏ చిన్న పొరపాటు చేసినా చలానా వేయకుండా వదిలిపెట్టరు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలానా డబ్బును కూడా ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటారు. రూల్స్ విషయంలో ఇంత స్ట్రిక్ట్‌గా ఉండే పోలీసులు రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నా అస్సలు పట్టించుకోరు. ఈ తీరుకు చిర్రెత్తిపోయాడు ఇండోనేషియాకు చెందిన అమక్ ఓహాన్ అనే వ్యక్తి. వర్షపు చుక్క పడితే చాలు కాలువను తలపిస్తోన్న రోడ్డును బాగు చేయించే ఉద్దేశ్యమే లేదా? అని ఆలోచించాడు. ఎలాగైనా అధికారుల కళ్లు తెరిపించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వినూత్న నిరసనకు దిగాడు.
నడి రోడ్డు మీద బురద నీళ్లలో కూర్చుని స్నానం చేశాడు. అందులోనే పడుకుని అటూఇటూ బొర్లాడు. షాంపూ పెట్టుకుని ఆ బురద నీళ్లతోనే తల శుభ్రం చేసుకున్నాడు. దారిన పోయేవాళ్లు అతడి విన్యాసాలను విడ్డూరంగా చూడగా మరికొందరు ఈ తతంగాన్ని కెమెరాల్లో బంధించారు. ఇలా స్నానం చేయడానికి ముందు ఫొటోషూట్‌తో పాటు చేపలు కూడా పట్టాడట. మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో స్పందించిన అధికారులు మరమ్మత్తులు చేసేందుకు సిద్ధమయ్యారట. అక్కడి మీడియా వెలువరించిన కథనాల ప్రకారం ఈ విచిత్ర నిరసన ఇండోనేషియాలోని వెస్ట్ నుసా టెంగారాలోని ప్రయ నగరంలో జరిగింది. దీని గురించి ఓహాన్ మాట్లాడుతూ.. "ఈ గుంతలమయమైన రోడ్ల వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి దుస్థితిని అధికారులకు తెలియజేసేందుకు, రోడ్డు మీద డ్రైనేజీ పొంగి పొర్లడాన్ని నిరసిస్తూ అక్కడ స్నానం చేశాను" అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment