ప్రాంతం: పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి
సమయం: శనివారం ఉదయం 8 గంటలు
ఒక ఆటో ప్రయాణికులతో వెళ్తోంది. ఆటో డ్రైవర్ రోజూ ఆదే దారిలో వాహనాన్ని నడుపుతుంటాడు. రోడ్డంతా ఎత్తుపల్లాలుగా ఉండటం, కొద్దిపాటి కదలికలు ఉండటం గమనించాడు. ఎదో కీడు జరగబోతోందని అనుమానించి వెంటనే తెలసిన మిత్రులకు ఫోన్‌లో చెప్పాడు. అంతే కాసేపటికి విషయం అందరికీ తెలిసి ఆ రోడ్డు వద్దకు వచ్చారు.
సమయం: ఉదయం 10 గంటలు
ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు స్వరూపమే మారిపోయింది. క్రమంగా రోడ్డు పైకిలేచి బీటలు వారింది. భూప్రకంపనలు వస్తున్నాయేమోనని ఆందోళన చెందారు. ఒక్కోచోట నాలుగైదు అడుగులు కుంగిపోగా, మరికొన్ని చోట్ల రోడ్డు అడుగు వెడల్పు, పది అడుగుల లోతులో బీటలు వారింది. భూకంపం వచ్చినప్పటి మాదిరిగా విధ్వంసం జరిగింది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం రూరల్: సర్వీçసురోడ్డు కుంగిన విషయం తెలుసుకున్న పోలవరం ప్రాజెక్టు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సర్వీస్ రోడ్డు కుంగిపోయిందని నిర్ధారించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనూ, పరిసరాల్లోనూ ఎలాంటి ప్రకంపనలు రాలేదని, గత 48 గంటల్లో ఎలాంటి సూచనలు కనిపించలేదని ఆర్టీజీఎస్ – అవేర్ (ఆంధ్రప్రదేశ్ వెథర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చి సెంటర్) నిపుణులు స్పష్టం చేశారు. మట్టిలో తేమశాతం తగ్గడం, వాతావరణంలో మార్పుల వల్లే రహదారిపై పగుళ్లు వచ్చాయని వారు చెబుతున్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న చోట ఈ ఘటన చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కారణమేమిటో?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గం ఒక్కసారిగా కొంతమార్గం పైకి ఎత్తుగా లేచి బీటలు వారింది. పరిమితికి మించి డంపింగ్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి రోడ్డు పైకి లేచి బీటలు వారిందా, లేదా శాస్త్రీయంగా ఏదైనా కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కేవలం ఆ ప్రాంతంలో ఎందుకు ఇలా జరిగింది? ఇది క్రమేపీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? దీని ప్రభావం పోలవరం గ్రామానికి ఉంటుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారిగా పెద్దపెద్ద బీటలు వారడంతో భూకంపం వచ్చేసిందంటూ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రోడ్డుకు ఇరువైపులా డంపింగ్ చేయడంతో మరో మార్గం లేక ఈ రోడ్డుపై ప్రయాణించే వారు అక్కడే నిలిచిపోయారు.
చెరువు పూడ్చడమే కారణమా
డంపింగ్ చేసిన ప్రాంతంలో కొంత కొండ ప్రాంతం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో తామరాయిగొంది చెరువు ఉండేదని, చెరువు పూడ్చి డంపింగ్ చేశారని చెబుతున్నారు. అలా చేయడం వల్లే ఇలా జరిగిందా అనేది కొందరి సందేహం. జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. ఈ ప్రాం తానికి ఎవరినీ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 20 అడుగుల ఎత్తు వరకు రోడ్డు క్రమేపీ పెరుగుతుండటంతో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.
భయం గుప్పిట్లో పోలవరం వాసులు
పోలవరం గ్రామానికి సమీపంలో పెద్దెత్తున డంపింగ్ చేయడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని పోలవరం వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. డంపింగ్ ఎత్తు పెరిగిపోవడంతో మట్టి రాయి జారిపోతోందని చెబుతున్నారు. వర్షం నీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో రోడ్డు గుల్లబారిపోతోందని చెబుతున్నారు.
ట్రాన్స్‌కోకు రూ.10 లక్షలు నష్టం
ప్రాజెక్టు ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణం చేపడితే గాని విద్యుత్ స్తంభాలను వేసి విద్యుత్‌ను పునరుద్ధరించలేమని చెబుతున్నారు. మరో రెండు రోజుల వరకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి గాని, రెండో విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల గిరిజనులకు విద్యుత్ సౌకర్యం కల్పించే అవకాశం కానరావడం లేదు.
ప్రాజెక్టు ఈఎన్‌సీ పరిశీలన
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి సమీపంలో రోడ్డు కుంగిన ప్రదేశాన్ని ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిలో వచ్చిన మార్పుల వల్లే ఈ రోడ్డు బీటలు వారిందని, భూకంపం వంటిది కాదని, ఎటువంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రాజెక్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఈయన వెంట ప్రాజెక్టు సీఈ వి.శ్రీధర్, సలహాదారుడు వీఎస్ రమేష్‌బాబులు ఉన్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఏజెన్సీలోని 19 గ్రామాల గిరిజనులతో పాటు ప్రాజెక్టు అధికారులు, కార్మికులకు రాకపోకలకు వీలుగా ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలను సాయంత్రానికి ఏర్పాటు చేశారు. రోడ్డుపక్కన ఉన్న డంపింగ్‌యార్డు రోడ్డు మార్గం నుంచి వాహనాలు తిరిగేందుకు వీలుగా ర్యాంపు నిర్మాణం చేపట్టారు. దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉదయం పోలవరం నుంచి టేకూరు వెళ్లిన ఆర్టీసీ బస్సును ప్రాజెక్టు వైపు నిలిపివేయడంతో బస్సులోని ప్రయాణికులు ఉదయం కాలినడకన పోలవరం చేరుకున్నారు. సాయంత్రానికి రోడ్డు మార్గం ఏర్పడటంతో బస్సు పోలవరం చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment