అంతా ఉట్టి మాటలే.. వేసేది మట్టిరోడ్డే !
అంతా ఉట్టి మాటలే.. వేసేది మట్టిరోడ్డే !
Published Fri, Aug 26 2016 12:00 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
– పోలవరం కుడికాలువపై నాలుగు లైన్ల రోడ్డుకు బ్రేక్
– సర్వీసు రోడ్డుకే పరిమితం..
– అది కూడా గ్రావెల్ రోడ్డు !
– ప్రభుత్వ తీరుపై విమర్శలు
పల్లెర్లమూడి (నూజివీడు రూరల్) :
పోలవరం కుడి కాలువపై నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం విషయంలో ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. సర్వీస్ రోడ్డుకు మాత్రమే పరిమితమైంది. తూర్పుగోదావరి జిల్లా పట్టిసీమ నుంచి గోదావరి, కృష్ణా నదులు కలిసే ఫెర్రి వరకు పోలవరం కుడి కాలువపై ఇరువైపులా నాలుగు లైన్ల రోడ్డు నిర్మిస్తామని పుష్కరాల ముందు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోడ్డు ద్వారా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల మధ్య దూరాన్ని తగ్గిస్తామని చెప్పింది. ఈ మేరకు పట్టిసీమ నుంచి పెర్రి వరకు 186 కిలో మీటర్లు ఉండగా, పోలవరం కుడి కాలువకు రెండువైపులా 372 కిలో మీటర్లు నాలుగు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం పోలవరం కాలువ కరకట్టను 20 మీటర్లకు పైగా విస్తరించాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మిస్తే విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి వెళ్లే వారికి, అటువైపు నుంచి వచ్చేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
పుష్కరాల తర్వాత ఇలా...
పుష్కరాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. నాలుగు లైన్ల రోడ్డు స్థానంలో సర్వీస్ రోడ్డు చాలని భావించింది. ఈ మేరకు రోడ్డును కేవలం ఆరు మీటర్లకు కుదించింది. పనులు కూడా ప్రారంభించింది. ఈ సర్వీస్ రోడ్డు కూడా గ్రావెల్‌తో వేస్తున్నట్లు పనులు నిర్వహిస్తున్న సిబ్బంది చెబుతున్నారు. సర్వీస్ రోడ్డు పేరుతో కరకట్ట కోసం కేటాయించిన స్థలంలో ఆరు మీటర్ల మాత్రమే చదును చేస్తున్నారు. దీంతో మిగిలిన భూమి అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందనే అనుమానావులు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముందుగా ప్రకటించిన మేరకు నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Advertisement