Service Road
-
ప్రారంభించిన 4 నెలలకే కుంగిన రోడ్డు.. ‘అట్లుందటి ప్రభుత్వ పనితనం’
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. ప్రారంభించిన నాలుగు నెలలకే రోడ్డుపై ఇలా గుంతలు పడటం గమనార్హం. బెంగళూరులోని తూర్పు శివారు ప్రాంతాలను ఐటీ హబ్‌లోని ఇతర ప్రాంతాలకు కలిపేలా కుందనహళ్లి అండర్‌పాస్ నిర్మించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) రూ. 19.5 కోట్లతో ఈ అండర్‌పాస్‌ను నిర్మించింది. ఇందులో భాగంగా వేసిన సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రభుత్వ నాసిరకపు పనికి ఇది నిదర్శమని మండిపడింది. కాంట్రాక్టర్ నుంచి ‘40 శాతం’ కమీషన్ అంటూ బీజేపీపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే నాగరాజు యాదవ్ విమర్శించారు. సంబంధిత కాంట్రాక్టర్‌తోపాటు ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరు నగరానికి ప్రత్యేక మంత్రి కావాలని తాము డిమాండ్ చేస్తున్నామని.. బెంగళూరు ఇంచార్జీ అయిన సీఎం బసవరాజ్ బొమ్మై ఆ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు.. #WATCH: Another day, another road in Bengaluru. A section of road caves in near NPS Kengeri. Officials have taken up restoration work. While @chairmanbwssb says it's because of leakage from a water pipe, the issue persists across the city. pic.twitter.com/v1LJ7hr3H1 — Suraj Suresh (@Suraj_Suresh16) October 10, 2022 ప్రస్తుతం కుంగిపోయిన రోడ్డుపై అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పట్టనుంది. మరోవైపు రోడ్డు లోపల పైప్ లైన్ పగలడం వల్ల గత కొన్ని రోజులుగా నీరు చేరి రోడ్డు కుంగిందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. బెంగళూరు వాటర్ సప్లై, సీవేజ్ బోర్డు పగిలిన పైప్‌లైన్‌ను సరిచేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తూ.. ఉచితంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయనున్నట్లు బెంగుళూరు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక అనుమానాస్పద మృతి
ఘట్కేసర్: ఫోన్లో మాట్లాడొద్దని తల్లి మందలించడంతో వేదనకు గురైన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఘట్కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా ఒంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల కుమార్తె (16), కుమారుడితో కలసి అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. కొంతకాలంగా కూతురు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించారు. బాలికలో మార్పు రాకపోగా శుక్రవారం తిరిగి అపరిచితునితో మాట్లాడుతుండటంతో గట్టిగా హెచ్చరించారు. దీంతో వేదనకు గురైన బాలిక శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో వారు నిద్రించాక కిరోసిన్ సీసా తీసుకొని, కుటుంబ సభ్యులు బయటకు రాకుండా గడియపెట్టి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి డాగ్, క్లూస్ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఖాళీ ప్రదేశంలో బాలిక మృతదేహం కనిపించడంతో దుండగులు బాలికను సజీవదహనం చేసి ఉండొచ్చనే వదంతులు వచ్చాయి. దీంతో స్థానికులు భారీగా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా బాలిక కిరోసిన్ సీసాతో ఒంటరిగా వెళ్లడం కనిపించింది. దీంతో పోలీసులు ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్? -
60 కాస్త 10 అయ్యింది.. పట్టించుకోండి సారూ
సాక్షి ,హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని లోయర్ ట్యాంకు బండ్ గోశాల నుంచి ఏసీటీసీ కళాశాల మీదగా బీమామైదానం, ఇందిరా పార్కు రోడ్డు 60 అడుగుల వరకు ఉండేది. విశాలమైన ఈ రోడ్డుకు ఇరువైపులా గోశాల నుంచి ఇందిరా పార్కు రోడ్డు వరకు కార్లు, ద్విచక్ర వాహనాలను అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు. డెంటింగ్, వాటర్ సర్వీసింగ్ తదితర వ్యాపారులు ఆక్రమించారు. ఇష్టారాజ్యంగా మెకానిక్ షెడ్లను ఏర్పాటు చేశారు. మరమ్మతులకు వచ్చే వాహనాలు, వాహన చోదకులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేసి సర్వీసింగ్ చేయడంతో 60 అడుగులు కాస్త 10 అడుగులకు కుంచించుకుపోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఇదేమని ఎవరైనా వాహనదారులు అడిగితే ఘర్షణలు, వాగ్వాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో మెకానిక్ షాపుల యజమానులు ఒకరిని మించి మరొకరు అక్రమంగా షెడ్లను నిర్మించి రోడ్లను ఆక్రమించారు. దీంతో పాదచారులు నడవడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులకు దారేదీ.. ► ఇదే మార్గంలో ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉంది. ► ఇక్కడికి నిత్యం వందలాది మంది వైద్యం కోసం వస్తుంటారు. ► ఇటీవల కరోనా నేపథ్యంలో ఈ సెంటర్‌ను కరోనా వైద్యం కోసం కేటాయించారు. ► దీంతో కవాడిగూడ డివిజన్‌తో పాటు ఇతర డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షల కోసం, వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. ► వారి వాహనాలను పార్క్ చేయడానికి స్థలం లేకపోవడంతో ఇబ్బందులకు గురువుతున్నారు. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు.... అనేక సంవత్సరాలుగా రోడ్డును ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని విపరీతంగా షెడ్లను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం అవుతున్న షెడ్ల యజమానులపై ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఫలితంగా రోజు రోజుకు కొత్త షెడ్లు ఈ మార్గంలో రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించి, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందిపడుతున్న రోడ్డు ఆక్రమణలను తొలగించాలని పలువురు వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు. ( చదవండి: సిబ్బంది మధ్య వార్.. నిలిచిపోయిన కరోనా పరీక్షలు.. ) -
విధులకు వెళ్తూ అనంతలోకాలకు..
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): ‘నాన్నా మాకు దిక్కెవరు.. పనికి వెళ్తున్నానని చెప్పి ఇలా వెళ్లిపోయావా.. రోడ్డు పాడుగాను నిన్ను మాకు దూరం చేసిందా.. ఇక మాకు నాన్నలేడా’.. అని నాగపురి రాజయ్య మృతదేహం వద్ద కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం రామగుండం మండలం మల్యాలపల్లెకు చెందిన నాగపురి రాజయ్య(48) ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు డీఎం ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం విధుల కోసమని సైకిల్‌పై మల్యాలపల్లె నుంచి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుకు వస్తున్న క్రమంలో లేబర్ గేట్ క్రాస్ చేసే సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతదేహం వద్ద రోదించారు. మృతుడికి భార్య కొమురమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్.. రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందడంతో గోదావరిఖని వైపు వెళ్లే వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ట్రాఫిక్, ఎన్టీపీసీ పోలీసులు సంఘటనా స్థలం వద్ద ట్రా ఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణౖ మెన కారును ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లా రు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గోదావరిఖ ని ప్రభుత్వం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సర్వీసు రోడ్డు లేకనే ప్రమాదం.. రాజీవ్ రహదారిపై బీ–పవర్ హౌస్ నుంచి సర్వీసు రోడ్డు లేకపోవడంతోనే మల్యాలపల్లెకు చెందిన రాజయ్య మృతిచెందాడని కాంట్రాక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసు రోడ్డు ఉంటే మెయిన్ రోడ్డుపైకి రాకుండా ఉండేవాడని, పట్టపగలే నిండు ప్రాణం పోవడంపై వారు రోడ్డు నిర్వాహకులు, సంబంధిత ప్రజాప్రతినిధుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 18న హైకింగ్ రెస్టారెంట్ ఎదుట రహదారిపై జరిగిన ప్రమాదంలో గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన కారు డ్రైవర్ నూతి రమేశ్ మృతిచెందిన విషాదం నుంచి ప్రజలు కోలుకోకముందే మరో ప్రమాదం జరగడంపై ఆవేదన చెందుతున్నారు. పట్టింపులేని ప్రజాప్రతినిధులు.. రాజీవ్ రహదారిపై సర్వీసు రోడ్డు లేకపోవడంతో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలను కోల్పోవడంతో పాటు చాలామంది అంగవైకల్యానికి గురవుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డులో ఉన్న సర్వీసు రోడ్డును నిర్మించలేని వారు ఇంకా ఆయా కాలనీలలో ఉన్న సమస్యలు ఏం పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పడు పరామర్శించడం మానుకుని సర్వీసు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. -
'బీటా'వహం
ప్రాంతం: పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి సమయం: శనివారం ఉదయం 8 గంటలు ఒక ఆటో ప్రయాణికులతో వెళ్తోంది. ఆటో డ్రైవర్ రోజూ ఆదే దారిలో వాహనాన్ని నడుపుతుంటాడు. రోడ్డంతా ఎత్తుపల్లాలుగా ఉండటం, కొద్దిపాటి కదలికలు ఉండటం గమనించాడు. ఎదో కీడు జరగబోతోందని అనుమానించి వెంటనే తెలసిన మిత్రులకు ఫోన్లో చెప్పాడు. అంతే కాసేపటికి విషయం అందరికీ తెలిసి ఆ రోడ్డు వద్దకు వచ్చారు. సమయం: ఉదయం 10 గంటలు ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు స్వరూపమే మారిపోయింది. క్రమంగా రోడ్డు పైకిలేచి బీటలు వారింది. భూప్రకంపనలు వస్తున్నాయేమోనని ఆందోళన చెందారు. ఒక్కోచోట నాలుగైదు అడుగులు కుంగిపోగా, మరికొన్ని చోట్ల రోడ్డు అడుగు వెడల్పు, పది అడుగుల లోతులో బీటలు వారింది. భూకంపం వచ్చినప్పటి మాదిరిగా విధ్వంసం జరిగింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం రూరల్: సర్వీçసురోడ్డు కుంగిన విషయం తెలుసుకున్న పోలవరం ప్రాజెక్టు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సర్వీస్ రోడ్డు కుంగిపోయిందని నిర్ధారించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనూ, పరిసరాల్లోనూ ఎలాంటి ప్రకంపనలు రాలేదని, గత 48 గంటల్లో ఎలాంటి సూచనలు కనిపించలేదని ఆర్టీజీఎస్ – అవేర్ (ఆంధ్రప్రదేశ్ వెథర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చి సెంటర్) నిపుణులు స్పష్టం చేశారు. మట్టిలో తేమశాతం తగ్గడం, వాతావరణంలో మార్పుల వల్లే రహదారిపై పగుళ్లు వచ్చాయని వారు చెబుతున్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న చోట ఈ ఘటన చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణమేమిటో? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గం ఒక్కసారిగా కొంతమార్గం పైకి ఎత్తుగా లేచి బీటలు వారింది. పరిమితికి మించి డంపింగ్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి రోడ్డు పైకి లేచి బీటలు వారిందా, లేదా శాస్త్రీయంగా ఏదైనా కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కేవలం ఆ ప్రాంతంలో ఎందుకు ఇలా జరిగింది? ఇది క్రమేపీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? దీని ప్రభావం పోలవరం గ్రామానికి ఉంటుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారిగా పెద్దపెద్ద బీటలు వారడంతో భూకంపం వచ్చేసిందంటూ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రోడ్డుకు ఇరువైపులా డంపింగ్ చేయడంతో మరో మార్గం లేక ఈ రోడ్డుపై ప్రయాణించే వారు అక్కడే నిలిచిపోయారు. చెరువు పూడ్చడమే కారణమా డంపింగ్ చేసిన ప్రాంతంలో కొంత కొండ ప్రాంతం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో తామరాయిగొంది చెరువు ఉండేదని, చెరువు పూడ్చి డంపింగ్ చేశారని చెబుతున్నారు. అలా చేయడం వల్లే ఇలా జరిగిందా అనేది కొందరి సందేహం. జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. ఈ ప్రాం తానికి ఎవరినీ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 20 అడుగుల ఎత్తు వరకు రోడ్డు క్రమేపీ పెరుగుతుండటంతో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో పోలవరం వాసులు పోలవరం గ్రామానికి సమీపంలో పెద్దెత్తున డంపింగ్ చేయడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని పోలవరం వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. డంపింగ్ ఎత్తు పెరిగిపోవడంతో మట్టి రాయి జారిపోతోందని చెబుతున్నారు. వర్షం నీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో రోడ్డు గుల్లబారిపోతోందని చెబుతున్నారు. ట్రాన్స్‌కోకు రూ.10 లక్షలు నష్టం ప్రాజెక్టు ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణం చేపడితే గాని విద్యుత్ స్తంభాలను వేసి విద్యుత్‌ను పునరుద్ధరించలేమని చెబుతున్నారు. మరో రెండు రోజుల వరకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి గాని, రెండో విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల గిరిజనులకు విద్యుత్ సౌకర్యం కల్పించే అవకాశం కానరావడం లేదు. ప్రాజెక్టు ఈఎన్సీ పరిశీలన ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి సమీపంలో రోడ్డు కుంగిన ప్రదేశాన్ని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిలో వచ్చిన మార్పుల వల్లే ఈ రోడ్డు బీటలు వారిందని, భూకంపం వంటిది కాదని, ఎటువంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రాజెక్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఈయన వెంట ప్రాజెక్టు సీఈ వి.శ్రీధర్, సలహాదారుడు వీఎస్ రమేష్‌బాబులు ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఏజెన్సీలోని 19 గ్రామాల గిరిజనులతో పాటు ప్రాజెక్టు అధికారులు, కార్మికులకు రాకపోకలకు వీలుగా ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలను సాయంత్రానికి ఏర్పాటు చేశారు. రోడ్డుపక్కన ఉన్న డంపింగ్‌యార్డు రోడ్డు మార్గం నుంచి వాహనాలు తిరిగేందుకు వీలుగా ర్యాంపు నిర్మాణం చేపట్టారు. దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉదయం పోలవరం నుంచి టేకూరు వెళ్లిన ఆర్టీసీ బస్సును ప్రాజెక్టు వైపు నిలిపివేయడంతో బస్సులోని ప్రయాణికులు ఉదయం కాలినడకన పోలవరం చేరుకున్నారు. సాయంత్రానికి రోడ్డు మార్గం ఏర్పడటంతో బస్సు పోలవరం చేరుకుంది. -
పోలవరం రోడ్డు భీకరం, భయానకం
అది పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే సర్వీసు రోడ్డు.. సమయం ఉదయం 8 గంటలు.. భూకంపం వచ్చినట్టుగా రోడ్డుకు మెల్లగా ప్రకంపనలు.. పలు చోట్ల రోడ్డు ఒక్కసారిగా 15 నుంచి 20 అడుగుల మేర పైకి లేచింది.. ఆ తర్వాత రోడ్డు మొత్తానికీ బీటలు.. కుంగడం మొదలైంది.. మధ్యాహ్నం 12 గంటల వరకూ రోడ్డు బీటలువారుతూనే ఉంది.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. తీగలు తెగిపడుతున్నాయి.. ఆ రోడ్డంతా భయానక వాతావరణం.. అసలేం జరుగుతుందో అర్థంకావడంలేదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనిచేసే కార్మికులు బెంబేలెత్తిపోయారు.. పరుగులుపెట్టారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే సర్వీసు రోడ్డు దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్డుకు మధ్యలో దాదాపు కిలోమీటర్ మేర శనివారం ఒక్కసారిగా బీటలువారడంతో పాటు పలు ప్రాంతాల్లో 15 నుంచి 20 అడుగుల వరకూ పైకి లేవడంతో పోలవరం ప్రాంత ప్రజలు, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. భూప్రకంపనలు వచ్చాయేమోనని ఆందోళన చెందారు. పోలవరం గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే ఘటన చోటు చేసుకుంది. అసలు ఎందుకిలా జరిగిందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. భూప్రకంపనలు వస్తే భూమి కిందకు దిగుతుంది గానీ.. పైకి లేవదంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా డంపింగ్ చేస్తుండటం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా సుమారు 50 అడుగులకు పైగా మట్టి, రాయి డంపింగ్ చేశారు. డంపింగ్‌ల ప్రభావం వల్ల రోడ్డు దెబ్బతినిందని అధికారులంటున్నారు. రోడ్డు ధ్వంసం అవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం పనులను అధికారులు చేపడుతున్నారు. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి రెండో విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల నిర్వాసితులకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పట్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పరిస్థితి కనబడటం లేదు. ఈ రోడ్డు మార్గం సరిచేసి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేంత వరకు ఏజెన్సీ గ్రామాలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుకు ఒక వైపు డంపింగ్ చేసిన మట్టికి పక్కనే కొంత భాగం కొండమార్గం కూడా ఉంది. దానిపైన ఉన్న రోడ్డు కూడా బీటలు వారి కుంగిపోవడం ప్రారంభించింది. డంపింగ్ చేసిన మట్టి, రాయి కూడా రోడ్డుపైకి జారిపడుతోంది. ఎందుకిలా జరిగింది? స్పిల్ చానల్ నుంచి తొలగించిన ఒండ్రు మట్టితో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారని, దీనిపై ప్రతి నిమిషానికి వంద టన్నులకు పైగా బరువున్న డంపింగ్ వాహనాలు తిరుగుతుంటాయని.. నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డు ఆ బరువును తట్టుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఈ డంపింగ్ యార్డు పక్కన పూర్వం చెరువుండేదని.. దానిని పూడ్చివేయడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని కొందరంటున్నారు. గతంలో కొండ ప్రాంతంలో కురిసిన వర్షం నీరంతా నేరుగా గోదావరి నదిలో కలిసేది. అయితే కాంట్రాక్టర్లు డ్రైనేజీ విషయాన్ని పట్టించుకోకుండా రోడ్డు వేయడంతో వర్షం నీరు బయటకు వెళ్లే మార్గంలేక ఇలా జరిగి ఉండొచ్చని స్థానికులంటున్నారు. ఇటువంటివి జరుగుతూనే ఉంటాయ్ దీనిపై పోలవరం ప్రాజెక్టు సలహాదారుడు వీఎస్ రమేష్‌బాబు మాట్లాడుతూ.. అధిక లోడుతో ఉన్న వాహనాలు డంపింగ్‌కు తిరుగుతుండటం వల్ల ఒత్తిడికి గురై రోడ్డు పైకి లేచిందని, ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): అసంపూర్తిగా ఉన్న ఔటర్ సర్వీసు రోడ్డుపై ఉన్న ఓ గుంతలో పడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని పోశెట్టిగూడ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై అహ్మద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ జిల్లా మంగపేట్ మండలం కమలాపూర్ వాసి జి.శంకర్(26) శంషాబాద్ సమీపంలో ఉన్న అమెజాన్ కంపెనీ గోదాంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శంషాబాద్‌లో నివాసముంటున్న ఇతను సోమవారం ఉదయం బైక్‌పై తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్ వస్తున్నాడు. ఔటర్‌లోని సర్వీసు దారిగుండా హమీదుల్లానగర్ సమీపంలోకి రాగానే.. ఇతను తొండుపల్లి మార్గం వైపు వెళ్లకుండా నేరుగా ముందుకు వెళ్లాడు. కొద్దిదూరంలో అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్డు చివరలో గుంతలో పడిపోయాడు. బీటీ రోడ్డు చివరి నుంచి దాదాపు వంద అడుగుల దూరం వరకు బైక్ వేగంగా రాళ్లు, మట్టికుప్పలు దాటుకుంటూ అక్కడున్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో శంకర్ తలకు తీవ్రగాయాలై సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వీస్ రోడ్ లా? పార్కింగ్ ప్లేస్‌లా?
పటాన్చెరు: నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాదం.. రక్తపుటేరులవుతున్న రహదారులు. మృత్యుదేవత ఆవాసంగా రోడ్లు. ఇటువంటి సంఘటలను మనం నిత్యం వింటూనే ఉంటాం. రోడు ప్రమాదాల్లో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతూ వారి కుటుంబాల్లో శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణమని నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంల సాక్షి పటాన్చెరు జాతీయ రహదారిపై అసలు ప్రమాదాలకు కారణాలేమిటో అన్వేషించింది. పటాన్చెరు పట్టణం నుంచి వెళుతున్న జాతీయ రహదారి నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఉన్న రింగ్ రోడ్‌పై కూడా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే జాతీయ రహదారితోపాటూ, రింగ్ రోడ్‌కు అనుబంధంగా సర్వీస్‌రోడ్లు ఉన్నాయి. ఇవి ఇప్పుడు పార్కింగ్ ప్లేస్‌లుగా మారిపోతున్నాయి. ప్రధానంగా పటాన్చెరు నుంచి రుద్రారం వరకు జాతీయ రహదారి వెంబడే ఉన్న సర్వీస్‌రోడ్‌లలో వాహనాలు ఎక్కడంటే అక్కడ నిలిపివేస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు సర్వీస్‌రోడ్‌లలో గంటల తరబడి నిలిచిపోతున్నాయి. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వందలాది లారీలె సర్వీస్రోడ్లోనే నిలిచిఉంటున్నాయంటే అతిశయోక్తికాదు. రింగ్ రోడ్‌కు అనుకుని ఉన్న సర్వీస్ రోడ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రింగ్‌రోడ్ నుంచి వాహనాలు దిగే కూడలి వద్ద ఉన్న సర్వీస్‌రోడ్‌లో అయితే వందల సంఖ్యలో లారీలో గంటల తరబడి నిలిచిపోతున్నాయి. హెవీ వెహికల్స్‌ను కూడా సర్వీస్రోడ్లలోనే పార్క్ చేస్తున్నారు. పటాన్చెరు నుంచి వెళ్లే జాతీయ రహదారిపై కానీ, రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లపై కాని లైటింగ్ వ్యవస్థ ఉండదు. దీంతో రాత్రి వేళల్లోసర్వీస్రోడ్లలో ప్రయాణించే వారు ఆగి ఉన్న లారీలను ఢీకొని నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. కొంత మంది అయితే ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. రింగ్‌రోడ్‌కు అనుబంధంగా ఉన్న సర్వీస్ రోడ్లో వివిధ గ్రామాలకు నిత్యం వందలాది మంది టూ వీలర్, ఫోర్ వీలర్లలో వెళుతుంటారు. వీరికి సర్వీస్‌రోడ్‌లలో పార్క్ చేసి ఉన్న వాహనాలు రాత్రివేళల్తో కనిపించక, ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా అయితే సర్వీస్‌రోడ్‌లలో వాహనాలు నిలపకూడదు. ఈ నిబంధనను తుంగలో తొక్కి కొంత మంది లారీల యజమానులు సర్వీస్ రోడ్లనే పార్కింగ్ ప్లేస్‌లుగా మార్చేస్తున్నారు. ముత్తంగి రింగ్‌రోడ్‌కు అనుకున్న ఉన్న సర్వీస్‌రోడ్ వెంబడే హోటళ్లు విచ్చలవిడిగా వెలియడంతో వాహనాల పార్కింగ్ అక్కడ మరింత ఎక్కువైంది. దీంతో ఇక్కడ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. దీనినే అదునుగా చేసుకుని కొంత మంది దళారులు పార్కింగ్‌కు ఫీజులు కూడా వసూలు చేస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం. ప్రమాదాలకు హేతువుగా ఉన్న ఈ పార్కింగ్‌ను నిత్యం పోలీసులు చూస్తున్నా, నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దళారులు, పోలీసులు కుమ్మకై సర్వీస్రోడ్లను పార్కింగ్ ప్లేస్‌లుగా మార్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానికులు మాట్లాడుతూ జాతీయ రహధారితోపాటూ, రింగ్‌రోడ్‌కు అనుబంధంగా ఉన్న సర్వీస్ రోడ్లలో లారీలను నిలిపివేస్తుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయని అంటున్నారు. హెల్మెట్లేదని,ఆర్సీ లేదని మాటిమాటికి ఎక్కడంటే అక్కడ వాహనాలు నిలిపివేసి చలానాలు రాసే పోలీసులకు సర్వీస్‌రోడ్‌లలో పార్కింగ్ చేస్తు్న వాహనాలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు వాహనచోదకుల కన్నా, పోలీసులు నిర్లక్ష్యమే అధికంగా ఉందని, పోలీసులు లంచాలకు మరిగి చేస్తున్న నిర్లక్ష్యం అభాగ్యుల ప్రాణాలను హరిస్తుందని ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారి, రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లలో వాహనాలు పార్క్ చేయకుండా చూడాలని, మరీ ముఖ్యంగా ముత్తంగి రింగ్ రోడ్ వద్ద వందలాదిగా వాహనాలు పార్క్ చేయబడుతున్నాయని, దీనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
అంతా ఉట్టి మాటలే.. వేసేది మట్టిరోడ్డే !
– పోలవరం కుడికాలువపై నాలుగు లైన్ల రోడ్డుకు బ్రేక్ – సర్వీసు రోడ్డుకే పరిమితం.. – అది కూడా గ్రావెల్ రోడ్డు ! – ప్రభుత్వ తీరుపై విమర్శలు పల్లెర్లమూడి (నూజివీడు రూరల్) : పోలవరం కుడి కాలువపై నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం విషయంలో ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. సర్వీస్ రోడ్డుకు మాత్రమే పరిమితమైంది. తూర్పుగోదావరి జిల్లా పట్టిసీమ నుంచి గోదావరి, కృష్ణా నదులు కలిసే ఫెర్రి వరకు పోలవరం కుడి కాలువపై ఇరువైపులా నాలుగు లైన్ల రోడ్డు నిర్మిస్తామని పుష్కరాల ముందు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోడ్డు ద్వారా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల మధ్య దూరాన్ని తగ్గిస్తామని చెప్పింది. ఈ మేరకు పట్టిసీమ నుంచి పెర్రి వరకు 186 కిలో మీటర్లు ఉండగా, పోలవరం కుడి కాలువకు రెండువైపులా 372 కిలో మీటర్లు నాలుగు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం పోలవరం కాలువ కరకట్టను 20 మీటర్లకు పైగా విస్తరించాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మిస్తే విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి వెళ్లే వారికి, అటువైపు నుంచి వచ్చేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. పుష్కరాల తర్వాత ఇలా... పుష్కరాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. నాలుగు లైన్ల రోడ్డు స్థానంలో సర్వీస్ రోడ్డు చాలని భావించింది. ఈ మేరకు రోడ్డును కేవలం ఆరు మీటర్లకు కుదించింది. పనులు కూడా ప్రారంభించింది. ఈ సర్వీస్ రోడ్డు కూడా గ్రావెల్‌తో వేస్తున్నట్లు పనులు నిర్వహిస్తున్న సిబ్బంది చెబుతున్నారు. సర్వీస్ రోడ్డు పేరుతో కరకట్ట కోసం కేటాయించిన స్థలంలో ఆరు మీటర్ల మాత్రమే చదును చేస్తున్నారు. దీంతో మిగిలిన భూమి అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందనే అనుమానావులు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముందుగా ప్రకటించిన మేరకు నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
చస్తున్నారు.. చూడండిటు
బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై అనంతపురం శివారులోని కక్కలపల్లి క్రాస్.. ఇక్కడ ప్రమాదం జరగని రోజంటూ లేదు. జాతీయ రహదారికి ఇరు వైపులా సర్వీస్ రోడ్డు ఉన్నప్పటికీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడ క్రాస్ ఏర్పాటు చేసి జనం చావుకు కారణమవుతున్నారు. అయ్యా.. జనం చస్తున్నారు ఇక్కడ క్రాస్‌ను మూసేయండంటూ జనం మొత్తుకుంటుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కలెక్టర్ గారూ.. మీరైనా దృష్టి సారించండని జనం వేడుకుంటున్నారు. అనంతపురం రూరల్, న్యూస్‌లైన్ : అనంతపురం శివారులోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న కక్కలపల్లి క్రాస్ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. రోజూ ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రాణాలు పోతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహన్నారు. కక్కలపల్లి క్రాస్ అంటేనే జనం వణికిపోయే పరిస్థితి వస్తోంది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చే వాహనాలు నియంత్రణ కోల్పోయి తరచూ ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ప్రదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల వీఆర్వో సుధాకర్‌రెడ్డి, సాక్షి ఉద్యోగి సురేష్, ధర్మవరం పట్టణానికి చెందిన నారాయణమ్మతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు మృతి చెందారు. వీరంతా జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా వాహనాలు ఢీకొన్న ఘటనల్లో మృత్యువాతపడ్డారు. గతంలో తపోవనం వద్ద ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో స్థానికులు ఆందోళన చేశారు. దీంతో ఉన్నతాధికారులు అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అదే తరహాలో కక్కలపల్లి క్రాస్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు ఇటీవల హైవేపై అడ్డంగా నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్న వీరభద్రయ్య ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వేగంగా వస్తున్న వాహనాలు బోర్డును కొట్టేసుకుంటూ వెళ్లిపోతున్నాయని చెప్పారు. -
ముంచుకొచ్చిన నిద్రతో..దూసుకొచ్చిన మృత్యువు
ఆల్కాట్‌తోట (రాజమండ్రి), న్యూస్‌లైన్ :వేగంగా వస్తున్న లారీ... ఇంతలో డ్రైవర్‌కి నిద్ర ముంచుకొచ్చింది. కనురెప్ప వాలింది... అంతే... అదుపు తప్పి డివైడర్ మీదుగా దూసుకుపోయింది. విద్యుత్ దీపాల స్తంభాన్ని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా రెండు లారీలను ఢీకొంది... ఆపై సర్వీస్‌రోడ్ పిట్టగోడను ఢీకొట్టి నిలిచిపోయింది. సోమవారం తెల్లవారుజామున మోరంపూడి జాతీ య రహదారిపై ఐఎల్టీడీ వద్ద జరిగిన ఈ ప్రమాదం యాక్షన్ సినిమాల్లో సన్నివేశంలా దిగ్భ్రమ గొల్పిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మృతి చెందగా, అందులోని క్లీనర్, మరో లారీ లోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. ఒక బొగ్గులారీ ధ్వంసమై బోల్తాకొట్టింది. పక్కనే ఉప్పులోడుతో వస్తున్న గూడ్సు ఆటో డివైడర్‌కి లారీకి మధ్య చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంపై స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురంజిల్లా తాడిపత్రి మండలం నందలపోడుకి చెందిన లారీడ్రైవర్ జి.మల్లికార్జున (34), నార్పల్ల మండలం కురగాలపల్లికి చెందిన క్లీనర్ పొట్లూరు సూర్యనారాయణరెడ్డి యర్రవరం నుంచి లారీలో ఎర్రమట్టి తో ఆదివారం రాత్రి 11 గంటలకు తాడిపత్రి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజాము 3.15 గంటలకు రాజమండ్రి మోరంపూడి సెంటర్ సమీపాన ఐఎల్టీడీ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ మల్లికార్జునకు నిద్రమత్తుతో కనురెప్ప మూతపడింది. దీంతో లారీ అదుపుతప్పి డివైడర్‌పై విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొంది. అప్పటికీ ఆగక పక్కరోడ్లో ఎదురుగా వస్తున్న బొగ్గు లోడు లారీని, మరో ఖనిజ పౌడర్ లోడు లారీని కూడా ఢీకొట్టింది. అనంతరం పిట్టగోడను ఢీకొ ని ఆగిపోయింది. ఈ ప్రమాదాల పరంపరలో లారీ డ్రైవర్ మల్లికార్జున క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ సూర్యనారాయణరెడ్డికి గాయాలయ్యా యి. బొగ్గులోడు లారీ ధ్వంసమై బోల్తాపడింది. ఖనిజ పౌడర్ లోడ్‌తో ఉన్న లారీ టైర్లు పేలిపోయి పెద్ద శబ్దం వినిపించింది. ఈ లారీలో తిరుచ్చికి చెందిన డ్రైవర్లు సేవదాస్, సుబ్రహ్మణి గాయపడ్డారు. బొగ్గులారీ పక్కనే నర్సాపురం నుంచి దివాన్‌చెరువుకు ఉప్పులోడుతో వెళుతు న్న ఆటో లారీకి డివైడర్‌కి మధ్య ఇరుక్కుపోయింది. ప్రమాదస్థలాన్ని ప్రకాష్‌నగర్, బొమ్మూరు పోలీసులు, నేషన ల్ హైవే సిబ్బంది పరిశీలించారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో లాలాచెరువు వైపు వెళ్లే వాహనాలను సబ్‌రోడ్డుకు మళ్లించారు. జేసీబీ, పొక్లెయిన్‌తో లారీలను, శిథిలాలను తొలగించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. పరిస్థితిని చక్కదిద్దడానికి 4 గంటలకు పైగా శ్రమించారు. ప్రకాష్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చూస్తూండగానే... లారీ మీదకు వస్తుండడం గమనించాను. పక్కకు తీద్దామనుకునే లోపే అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మా లారీ బోల్తాపడింది. ఇంటికి వెళతానని అంతకుముందే మా క్లీనర్ రావులపాలెంలో దిగిపోయాడు. లేదంటే ఈ ప్రమాదంలో అతడికి ఏమయ్యేదో? డ్రైవర్ నిద్రమత్తుకు లోనైన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. - కృష్ణ, బొగ్గు లోడు లారీ డ్రైవర్, మణుగూరు.