బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై అనంతపురం శివారులోని కక్కలపల్లి క్రాస్.. ఇక్కడ ప్రమాదం జరగని రోజంటూ లేదు. జాతీయ రహదారికి ఇరు వైపులా సర్వీస్ రోడ్డు ఉన్నప్పటికీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడ క్రాస్ ఏర్పాటు చేసి జనం చావుకు కారణమవుతున్నారు. అయ్యా.. జనం చస్తున్నారు ఇక్కడ క్రాస్‌ను మూసేయండంటూ జనం మొత్తుకుంటుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కలెక్టర్ గారూ.. మీరైనా దృష్టి సారించండని జనం వేడుకుంటున్నారు.
అనంతపురం రూరల్, న్యూస్‌లైన్ : అనంతపురం శివారులోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న కక్కలపల్లి క్రాస్ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. రోజూ ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రాణాలు పోతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహన్నారు. కక్కలపల్లి క్రాస్ అంటేనే జనం వణికిపోయే పరిస్థితి వస్తోంది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చే వాహనాలు నియంత్రణ కోల్పోయి తరచూ ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ ప్రదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల వీఆర్వో సుధాకర్‌రెడ్డి, సాక్షి ఉద్యోగి సురేష్, ధర్మవరం పట్టణానికి చెందిన నారాయణమ్మతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు మృతి చెందారు. వీరంతా జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా వాహనాలు ఢీకొన్న ఘటనల్లో మృత్యువాతపడ్డారు.
గతంలో తపోవనం వద్ద ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో స్థానికులు ఆందోళన చేశారు. దీంతో ఉన్నతాధికారులు అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అదే తరహాలో కక్కలపల్లి క్రాస్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు ఇటీవల హైవేపై అడ్డంగా నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్న వీరభద్రయ్య ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వేగంగా వస్తున్న వాహనాలు బోర్డును కొట్టేసుకుంటూ వెళ్లిపోతున్నాయని చెప్పారు.
చస్తున్నారు.. చూడండిటు
Published Sat, Jan 25 2014 1:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement