ముంచుకొచ్చిన నిద్రతో..దూసుకొచ్చిన మృత్యువు
Published Tue, Jan 21 2014 1:39 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
ఆల్కాట్‌తోట (రాజమండ్రి), న్యూస్‌లైన్ :వేగంగా వస్తున్న లారీ... ఇంతలో డ్రైవర్‌కి నిద్ర ముంచుకొచ్చింది. కనురెప్ప వాలింది... అంతే... అదుపు తప్పి డివైడర్ మీదుగా దూసుకుపోయింది. విద్యుత్ దీపాల స్తంభాన్ని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా రెండు లారీలను ఢీకొంది... ఆపై సర్వీస్‌రోడ్ పిట్టగోడను ఢీకొట్టి నిలిచిపోయింది. సోమవారం తెల్లవారుజామున మోరంపూడి జాతీ య రహదారిపై ఐఎల్‌టీడీ వద్ద జరిగిన ఈ ప్రమాదం యాక్షన్ సినిమాల్లో సన్నివేశంలా దిగ్భ్రమ గొల్పిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మృతి చెందగా, అందులోని క్లీనర్, మరో లారీ లోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు.
ఒక బొగ్గులారీ ధ్వంసమై బోల్తాకొట్టింది. పక్కనే ఉప్పులోడుతో వస్తున్న గూడ్సు ఆటో డివైడర్‌కి లారీకి మధ్య చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంపై స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురంజిల్లా తాడిపత్రి మండలం నందలపోడుకి చెందిన లారీడ్రైవర్ జి.మల్లికార్జున (34), నార్పల్ల మండలం కురగాలపల్లికి చెందిన క్లీనర్ పొట్లూరు సూర్యనారాయణరెడ్డి యర్రవరం నుంచి లారీలో ఎర్రమట్టి తో ఆదివారం రాత్రి 11 గంటలకు తాడిపత్రి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజాము 3.15 గంటలకు రాజమండ్రి మోరంపూడి సెంటర్ సమీపాన ఐఎల్‌టీడీ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ మల్లికార్జునకు నిద్రమత్తుతో కనురెప్ప మూతపడింది. దీంతో లారీ అదుపుతప్పి డివైడర్‌పై విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొంది.
అప్పటికీ ఆగక పక్కరోడ్లో ఎదురుగా వస్తున్న బొగ్గు లోడు లారీని, మరో ఖనిజ పౌడర్ లోడు లారీని కూడా ఢీకొట్టింది. అనంతరం పిట్టగోడను ఢీకొ ని ఆగిపోయింది. ఈ ప్రమాదాల పరంపరలో లారీ డ్రైవర్ మల్లికార్జున క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ సూర్యనారాయణరెడ్డికి గాయాలయ్యా యి. బొగ్గులోడు లారీ ధ్వంసమై బోల్తాపడింది. ఖనిజ పౌడర్ లోడ్‌తో ఉన్న లారీ టైర్లు పేలిపోయి పెద్ద శబ్దం వినిపించింది. ఈ లారీలో తిరుచ్చికి చెందిన డ్రైవర్లు సేవదాస్, సుబ్రహ్మణి గాయపడ్డారు.
బొగ్గులారీ పక్కనే నర్సాపురం నుంచి దివాన్‌చెరువుకు ఉప్పులోడుతో వెళుతు న్న ఆటో లారీకి డివైడర్‌కి మధ్య ఇరుక్కుపోయింది. ప్రమాదస్థలాన్ని ప్రకాష్‌నగర్, బొమ్మూరు పోలీసులు, నేషన ల్ హైవే సిబ్బంది పరిశీలించారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో లాలాచెరువు వైపు వెళ్లే వాహనాలను సబ్‌రోడ్డుకు మళ్లించారు. జేసీబీ, పొక్లెయిన్‌తో లారీలను, శిథిలాలను తొలగించారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. పరిస్థితిని చక్కదిద్దడానికి 4 గంటలకు పైగా శ్రమించారు. ప్రకాష్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చూస్తూండగానే...
లారీ మీదకు వస్తుండడం గమనించాను. పక్కకు తీద్దామనుకునే లోపే అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మా లారీ బోల్తాపడింది. ఇంటికి వెళతానని అంతకుముందే మా క్లీనర్ రావులపాలెంలో దిగిపోయాడు. లేదంటే ఈ ప్రమాదంలో అతడికి ఏమయ్యేదో? డ్రైవర్ నిద్రమత్తుకు లోనైన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది.
- కృష్ణ, బొగ్గు లోడు లారీ డ్రైవర్,
మణుగూరు.
Advertisement
Advertisement