రోడ్డుపై బీటలు వారుతుండటంతో పరుగులు తీస్తున్న సందర్శకులు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం)లో నాణ్యత లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. హెడ్ వర్క్స్ ప్రాంతానికి వెళ్లే మార్గంలోని రెస్టారెంట్ ఎదురుగా ప్రధాన రహదారి ఆదివారం మరోసారి భారీగా బీటలు వారి 6 అడుగుల వరకు కుంగిపోయింది. ఇది చూసి సమీప ప్రాంతాల్లో పనులు చేస్తున్న కూలీలు, ఇతరులు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్గంలో ప్రయాణించే ఏజెన్సీ ప్రాంత గిరిజనులు కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అయోమయంగా ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను, వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
యంత్రాలను రప్పించి పగుళ్లు బారిన రహదారికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. గతంలో ఇదే రహదారి ఒక్కసారిగా 20 అడుగులు పైకి ఎగదన్ని నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా కుంగిపోయిన విషయం తెలిసిందే. స్పిల్ ఛానల్ ప్రాంతంలో బెడ్ లెవల్‌లో మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయని.. దాంతో భూమి పైభాగం నుంచి ఒత్తిడి ఏర్పడటం వల్ల రోడ్డు కుంగిపోయి ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. కమీషన్‌లకు కక్కుర్తి పడిన ప్రభుత్వ పెద్దలు నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడటం వల్లే పోలవరం రోడ్డుకు ఈ దుస్థితి దాపురించిందని జలవనరుల శాఖ అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తల సూచనలు బుట్టదాఖలు
రహదారి పనుల్లో నాణ్యత లోపాలను, డంపింగ్ యార్డ్ ఏర్పాటులో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు యధాప్రకారం అబద్ధాలను పదే పదే చెబుతున్నారు. మట్టిలో తేమ శాతం తగ్గిందని, వాతావరణంలో మార్పుల వల్ల మట్టి ఉబికి రావడం, కుంగిపోవడం సహజమంటూ అధికారులతో చెప్పిస్తున్నారు. కానీ.. నిబంధనలు తుంగలో తొక్కి చిన్న నీటి వనరులను విధ్వంసం చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం, రహదారిని నాసిరకంగా నిర్మించడం వల్లే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొందరు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాయి, మట్టి నమూనాలను ప్రాథమికంగా పరిశీలించిన సెంటర్ ఫర్ సాయిల్ అండ్ మెటీరియల్ రెసెర్చ్ స్టేషన్(కేంద్ర మట్టి, రాయి పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తల సూచనల మేరకు పనులు నాణ్యంగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని అధికారవవర్గాలు పేర్కొంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపాలను కాగ్ ఎత్తిచూపినా.. సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) సభ్యులు వైకే శర్మ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ స్పిల్‌వే పనులు నాసిరకంగా ఉన్నాయని తేల్చిచెప్పినా రాష్ట్ర సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment