కమీషన్ల కక్కుర్తి..నాణ్యత నట్టేట్లోకి! | Polavaram Spill works Flaws was exposed | Sakshi
Sakshi News home page

కమీషన్ల కక్కుర్తి..నాణ్యత నట్టేట్లోకి!

Published Sat, Sep 8 2018 4:11 AM | Last Updated on Sat, Sep 8 2018 10:01 AM

Polavaram Spill works Flaws was exposed - Sakshi

స్పిల్‌వేలో ఏర్పడిన చీలికలకు సిమెంట్‌ పూతలు

సాక్షి, అమరావతి: ముఖ్యనేత కమీషన్ల యావ పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై ప్రభావం చూపుతోందా? సిమెంట్, స్టీల్‌ను సరఫరా చేసే సంస్థల నుంచి ముక్కుపిండి మరీ ముడుపులు వసూలు చేస్తున్నారా? అందువల్లే ఆయా సంస్థలు నాసిరకం సిమెంట్, స్టీల్‌ను అంటగడుతున్నాయా? పనుల పర్యవేక్షణకు, వాటి నాణ్యతను పరీక్షిం చడానికి కాంట్రాక్టర్‌ సూచించిన అధికారినే నియ మించారా? అందువల్లే కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమా ధానం చెబుతున్నాయి జలవనరుల శాఖ అధికార వర్గాలు. పోలవరం హెడ్‌వర్క్స్‌ (జలాశయం)లో నాణ్యతా లోపాలను బయటపెట్టిన ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావును ఆ పనుల బాధ్యతల నుంచి తప్పించడాన్ని అధికార వర్గాలు గుర్తుచేస్తున్నాయి. 

స్పిల్‌ వే పనులపై ఇంత నిర్లక్ష్యమా?
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో నాణ్యతా లోపాలను గురువారం కేంద్ర నిపుణుల కమిటీ బహిర్గతం చేయడం తీవ్ర కలకలం రేపింది. కాంక్రీట్‌ పనుల్లో నాసిరకం స్టీల్, సిమెంట్‌ను వినియోగి స్తున్నారని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. కాంట్రా క్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్లే స్పిల్‌ వేలో చీలికలు ఏర్పడ్డాయని, వాటిని సరిదిద్దాలని ఆదేశించామని కేంద్ర నిపుణుల కమిటీ ఛైర్మన్‌ వైకే శర్మ స్పష్టం చేశారు. ఇకపై తామే సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులతో ఎప్పటికప్పుడు పనుల నాణ్యతపై తనిఖీలు చేయిస్తామని ప్రకటించడం చర్చనీయాం శంగా మారింది. గోదావరి నదిలో 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సమర్థవంతంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌ వేను నిర్మిస్తున్నారు. స్పిల్‌ వే పనుల్లో ఏమాత్రం నాణ్యత లోపించినా వరదల ఉధృతికి తట్టుకోలేదని సాంకేతిక నిపుణులు అంటున్నారు. స్పిల్‌ వే పనుల్లో నాణ్యతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 

హెడ్‌వర్క్స్‌ నుంచి ఈఎన్‌సీని తప్పిస్తూ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు 

వద్దన్న సంస్థే ముద్దొచ్చింది 
పోలవరం జలాశయం పనులను 2013లో రూ.4,054 కోట్లకు అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ దక్కించుకుంది. అర్హత లేని సంస్థకు పనులు ఎలా అప్పగిస్తారంటూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేశారు. కానీ, 2014 ఎన్నికల ముందు రాయపాటి తెలుగుదేశం పార్టీలో చేరారు. దాంతో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ చంద్రబాబుకు ముద్దయింది. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. కేంద్రమే ప్రాజెక్టు పనులు చేపడితే సత్తా లేని ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటు పడటం ఖాయమని భావించి, నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ చంద్రబాబు పట్టుబట్టారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఆ మరుసటి రోజే ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. అనంతరం ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డం పెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ ముఖ్యనేత భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు. 

కాంట్రాక్టర్లకు ప్రేమతో... 
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోలవరం హెడ్‌ వర్క్స్‌ కాంట్రాక్టర్లకు సిమెంట్, స్టీల్‌ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. తమ నుంచి ముఖ్యనేత ముడుపులు వసూలు చేస్తుండడంతో సరఫరా సంస్థలు 53 గ్రేడ్‌ స్థానంలో 43 గ్రేడ్‌ సిమెంట్‌ను, నాసిరకం స్టీల్‌ను అందజేస్తున్నాయి. అదే స్టీల్, సిమెంట్‌ను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అంటగడుతోంది. హెడ్‌ వర్క్స్‌లో భాగమైన స్పిల్‌ వేలో సెంట్రింగ్‌ పనుల దగ్గర నుంచి సిమెంట్, కంకర, ఇసుక కలిపి కాంక్రీట్‌ మిశ్రమం తయారు చేయడం దాకా అత్యాధునిక సాంకేతిక విధానాలను పాటించాలి. ఎం–20 గ్రేడ్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని చల్లబరచడానికి ప్రత్యేకంగా చిల్లింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్యూబిక్‌ మీటర్‌ కాంక్రీట్‌ పని నాణ్యతను క్వాలిటీ కంట్రోల్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.

నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. పనుల్లో నాణ్యత లేదని క్వాలిటీ కంట్రోల్‌ విభాగం తేల్చితే.. నాసిరకంగా ఉన్న పనులను తొలగించి, వాటి స్థానంలో మళ్లీ కొత్తగా పనులు చేయాలి. కానీ, కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో లాలూచీ పడిన ముఖ్యనేత పనుల పర్యవేక్షణకు, నాణ్యత పరిశీలనకూ ఒకే అధికారిని నియమించే తప్పుడు సాంప్రదాయానికి తెర తీశారు. కాంట్రాక్టర్‌ సూచించిన అధికారినే పనుల పర్యవేక్షణకు నియమించి.. ఆ అధికారికే క్వాలిటీ కంట్రోల్‌(నాణ్యత నియంత్రణ) విభాగం బాధ్యతలను అదనంగా అప్పగించారు. 2016 నుంచి 2018 మే 16వ తేదీ వరకూ పోలవరం హెడ్‌ వర్క్స్‌ ఎస్‌ఈ, క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఎస్‌ఈ పదవుల్లో రమేష్‌ బాబును నియమించారు. అనంతరం ఆ రెండు పదవుల్లోనూ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌ను నియమించారు. దీనివల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. పనుల్లో నాణ్యతపై ప్రశ్నించే వారే లేకుండా పోయారు. 

నాణ్యతపై ప్రశ్నించే వారేరి? 
పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌(ఈఎన్‌సీ)ని నియమించాలంటూ కేంద్రం 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ క్రమంలో గతేడాది జూలై 11న నాటి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్‌ సింగ్‌ పోలవరానికి ప్రత్యేకంగా ఈఎన్‌సీని నియమించాలని లేఖ రాశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీతోపాటు.. పోలవరం ఈఎన్‌సీ బాధ్యతలను ఎం.వెంకటేశ్వరరావు నిర్వర్తిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో పనుల నాణ్యతపై జనవరి నుంచి మే వరకూ పలు సందర్భాల్లో ఆయన కాంట్రాక్టర్లను నిలదీసినట్లు సమాచారం. ఎం.వెంకటేశ్వరావును తప్పించాలంటూ ముఖ్యనేతపై కాంట్రాక్టర్లు ఒత్తిడి తెచ్చారు. దాంతో హెడ్‌ వర్క్స్‌ బాధ్యతల నుంచి ఆయనను తప్పించేలా ముఖ్యనేత చక్రం తిప్పారు.

హెడ్‌ వర్క్స్‌  సీఈగా వి.శ్రీధర్‌ను నియమిస్తూ మే 16న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎన్‌సీ వెంకటేశ్వరరావును సాంకేతిక పరమైన అంశాలకు మాత్రమే పరిమితం చేసింది. అంతటితో ఆగకుండా పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించే ధవళేశ్వరం క్వాలిటీ కంట్రోల్‌ విభాగం సీఈగా వి.శ్రీధర్‌కే అదే రోజు అదనపు బాధ్యతలను అప్పగించడం గమనార్హం. పనుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన బాధ్యతలను ఒకే అధికారి నిర్వర్తిస్తుండటం వల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement