గట్టెక్కించిన పోలీస్
- ఆర్టీసీ సమ్మె, మండుటెండతో అల్లాడిన ఎంసెట్ విద్యార్థులు
- ప్రత్యేక వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తరలించిన పోలీస్
- మేముసైతం అంటూ ముందుకొచ్చిన ప్రయవేటు, స్వచ్ఛంద సంస్థలు
- ఇంజినీరింగ్ 96, మెడిసిన్ 97.15 శాతం హాజరు నమోదు
కృష్ణలంక : నగరంలో శుక్రవారం జరిగిన ఎంసెట్ పరీక్షార్థులను పోలీసులే ఆదుకున్నారు. ఓవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు ట్రాఫిక్ రద్దీ, ఇంకోవైపు మండుటెండలో సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్తామో, లేదో అనే మీమాంసలో కొట్టుమిట్టాడిన విద్యార్థులను దగ్గరుండి నడిపించారు. సీపీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు పోలీస్ శాఖకు చెందిన వాహనాలు, సొంత వాహనాలను విద్యార్థుల కోసం సిద్ధం చేశారు. బైకులపై విద్యార్థులను సరైన సమయానికి చేర్చారు.
ఉదయం ఇంజినీరింగ్, మధ్యాహ్నం మెడిసిన్ పరీక్షలు పూర్తయ్యేంత వరకు సీపీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పోలీస్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లే ప్రాంతాల్లో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ యంత్రాంగం మొత్తం మోహరించింది. వీరితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు కూడా మానవతా దృక్పథంతో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూశాయి. దీంతో ఆర్టీసీ సమ్మె ఉన్నా.. విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా సజావుగా పరీక్షలు రాశారు. పోలీసుల తీరును విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశంసించారు.
సీపీ కృతజ్ఞతలు
ఎంసెట్ ప్రశాంతంగా ముగిసేందుకు నగరవాసులు స్వచ్ఛందంగా చూపిన చొరవకు సీపీ వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. డీసీపీ (లా అండ్ ఆర్డర్) కాళిదాసు వెంకట రంగారావు, ఏడీసీపీ ట్రాఫిక్ టీవీ నాగరాజు, ట్రాఫిక్ ఏసీపీ చిదానందరెడ్డి, శ్రావణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు ఎం.శ్రీనివాస్, జి.శ్రీనివాస్, ఏసీపీ అమర్‌నాథ్ నాయుడు, ప్రభాకర్ బాబు, అభిషేక్ మహంతి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.