సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : బెట్టింగ్ మాఫియా కన్ను పట్టణాలు, పల్లెలపై పడింది. మెట్రో నగరాల్లో వీరి కార్యకలాపాలకు అక్కడ పోలీసు యంత్రాంగం చెక్ పెడుతుండటంతో ఇటువైపు దృష్టిసారించింది. ఇటీవల శ్రీకాకుళం, రాజాంలో బయటపడిన బెట్టింగ్ బాగోతాలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇక్కడ యువతలో క్రికెట్ మోజును బలహీనతగా చేసుకున్న ఓ ముఠా ప్రత్యేక యాప్ ద్వారా బెట్టింగ్ రొంపిలోకి దించుతోంది. దీంతో ఆర్థికంగా చితికిపోయి జీవితాలను నాశనం చేసుకునే స్థితికి దిగజార్చుతోంది. రాజాంలో గుట్టుగా సాగిస్తున్న బెట్టింగ్ వ్యవహారాన్ని ఇటీవల పోలీసులు రట్టు చేశారు. ప్రపంచకప్ సెమీఫైనల్ –2 మ్యాచ్ సందర్భంగా ఐదుగురు బెట్టింగ్ రాయుళ్లను ఈ నెల 11న అదుపులోకి తీసుకోగా, పరారైన మరో ఐదుగురిని ఈనెల 17న అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 5.05 లక్షలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసిన విషయం విదితమే.
యువతే టార్గెట్.....
ప్రస్తుతం యువత ప్రపంచీకరణ మోజులోపడింది. డబ్బులు ఈజీగా సంపాదించే ఆలోచనలోనే బెట్టింగ్ ముఠా వలలో చిక్కుతోంది. ఇదే అదునుగా చేసుకుని వందకు వెయ్యి, వెయ్యికి పది వేలు, రూ. పది వేలకు రూ.లక్ష అంటూ పదింతలు సంపాదించవచ్చునని ఆశపెడుతోంది. మ్యాచ్ ఏదైనా బెట్టింగ్ మాత్రం ఒకటే. ముందుగానే ఇటువంటి బలహీనత యువతను గుర్తించి వారి ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడడం వంటివి చేస్తుండడం గమనార్హం. ఒక్క రాజాంలోనే కాకుండా జిల్లా అంతటా ఇదే తంతు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది యువత విలువైన వస్తువులతోపాటు బైక్‌లను, ల్యాప్‌టాప్‌లను కుదవపెట్టి బెట్టింగ్‌లకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కడో పెద్ద పట్టణాల్లో సాగిన బెట్టింగ్ చిన్న పట్టణాలకు పాకడంతో విజ్ఞులు నిట్టూరుస్తున్నారు.
కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం...
బెట్టింగ్ రాయుళ్లు ఉచ్చులో చిక్కుకున్న యువత రంజీ, ఐపీఎల్, టీ20, వన్డే మ్యాచ్‌లతోపాటు టీవీల్లో వచ్చే లైవ్ మ్యాచ్‌లకు బెట్టింగ్‌కు పాల్పడుతోంది. ఈ బెట్టింగ్‌ల్లో బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్, బ్యాటింగ్, వికెట్లు, సిక్సర్స్, ఫోర్స్ వంటి వాటిపై కూడా ఉత్కంఠగా బెట్టింగ్ కాయడం. ఒకవేళ చేతిలో సొమ్ములు అయిపోతే వారి వద్ద ఉన్న గోల్డ్, ఇతర విలువైన వస్తువులు కూడా పద్దు రూపంలోను, అమ్మకం చేసో పోగొట్టుకున్న సొమ్మును రాబెట్టుకునేందుకు బెట్టింగ్‌లవైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఆర్థికంగా చితికిపోయి ఎక్కువ వడ్డీకి అప్పులు చేయడం, పరారైపోవడంతో కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారు. ఒకవేళ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో కేవలం సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కొద్ది మొత్తంలో సొమ్ము మాత్రమే దొరుకుతోంది. కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నప్పటికీ ఎవరికీ దొరకుండా జాగ్రత్త పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతా యాప్‌లోనే....
క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి యాప్‌ల ద్వారా సాగిస్తున్నారు. యాప్ ద్వారా రేటింగ్స్ ముందుగానే లెక్కించి ఏ జట్టుకు బెట్టింగ్ కాస్తే లాభదాయకంగా ఉంటుందో తెలియజేసి, తదనుగుణంగా బెట్టింగ్‌లోకి దించుతున్నారు. దీనికి సంబంధించి లాగిన్ ఐడీ ఇచ్చి ముందుగానే డిపాజిట్ కూడా చేయిస్తున్నారనే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదంతా విజయవాడ కేంద్రంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను బెట్టింగ్ నిర్వాహకులు భారీగానే ఆర్జిస్తున్నారు. బెట్టింగ్‌లో రెండు వైపుల నుంచి కూడా వీరికి భారీస్థాయిలో కమీషన్ అందుతున్నట్లు తెలుస్తోంది.
అంతా గోప్యంగానే.....
బెట్టింగ్ రాయుళ్లు ఎవరి కంటా పడకుండా అంతా గోప్యంగానే సాగిస్తున్నారు. నలుగురిలో తిరుగుతూ పక్కవాడికి కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనికోసం శివార్లలో ఇళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుని బెట్టింగ్ గుట్టుగా సాగిస్తున్నారు. అంత వరకు సామాన్యుడిలా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా లైఫ్‌స్టైల్ మార్చడం, కొన్ని రోజులకే పూర్వ స్థితికిరావడం తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం, పలుచోట్ల సంభవిస్తున్నాయి. అయితే రాజాంలో కలకలం రేపిన బెట్టింగ్ వ్యవహారంలో పది మంది మాత్రమే ఇప్పటివరకు పట్టుబడ్డారు. వీరు మాత్రమేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది పట్టణంలో గుసగుసలాడుకుంటున్నారు. దీనిని మొగ్గలోనే తుంచి ఈ భూతాన్ని తరిమివేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
బెట్టింగ్‌లపై నిఘా పెట్టాం
పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా బెట్టింగ్‌ల వ్యవహారంపై ఇప్పటికే నిఘా పెట్టాం. ఇందులో భాగంగానే ఇటీవల పది మంది బెట్టింగ్ రాయుళ్లును అదుపులోకి తీసుకున్నాం. ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే సమాచారం అందిస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు బెట్టింగ్ రాయుళ్లును పట్టుకుంటాం.
జి.సోమశేఖర్, సీఐ, రాజాం టౌన్
Comments
Please login to add a commentAdd a comment