మంగళగిరి: చినకాకానిలోని ఎన్నారై మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని రూ.1.50 కోట్లతో ఉడాయించిన మాయలేడి శ్రీదేవిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె చేతిలో మోసపోయిన గుంటూరుకు చెందిన బాధితులు ఇటీవల మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కేసు విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో శ్రీదేవితోపాటు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఆమె భర్త ఆచార్యులును కూడా విచారిస్తున్నట్లు సమాచారం. మాయలేడి భర్త వ్యవసాయశాఖలో విధులు నిర్వర్తిస్తుండగా.. ఏడు సంవత్సరాల క్రితం మనస్పర్థలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. అయితే కుమారుడికి వివాహం చేసేందుకు ఆరు నెలలుగా ఇద్దరూ కలిసి ఉంటున్నారని తెలిసింది. అంతకుముందే జల్సాలకు అలవాటుపడిన శ్రీదేవి గుంటూరు పట్టాభిపురంలో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు నొక్కేసినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో, విజయవాడలో సైతం ఇదేవిధంగా మోసాలకు పాల్పడి డబ్బు సంపాదించి కుమార్తెను ఆస్ట్రేలియాకు పంపి కుమారుడిని ఎంబీఏ చదివించినట్లు తెలుస్తోంది.
గుంటూరుతో పాటు కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఆమెపై పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులతో ఫొటోలు దిగి వారితో తనకు సత్సంబంధాలు వున్నాయని, సినిమా అవకాశాలు కల్పిస్తానని యువతులను, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు యువకులను మోసగించినట్లు సమాచారం. శ్రీదేవిని అదుపులోకి తీసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఆమె వద్ద రూ.25 లక్షల నగదు, రూ. 25లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో మాయలేడి!
Published Wed, Sep 10 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement