chinakakani
-
‘మేఘా’ వితరణ
మంగళగిరి: గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ రెండు అంబులెన్స్‌లను వితరణగా అందజేసింది. ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ పి.సుధారెడ్డి బుధవారం అంబులెన్స్‌ల తాళాలను ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.నరసరాజు, ప్రిన్సిపల్ లక్ష్మిలకు అందజేశారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. మేఘా సంస్థ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు నిర్మించామని, పలు ఆసుపత్రులకు అవసరమైన అంబులెన్సులను అందించటంతో పాటు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎంఈఐఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై ఆసుపత్రికి తమ సంస్థ అందజేసిన అంబులెన్స్‌లలో ఐసీయూకు అవసరమైన సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎన్నారై ఆస్పత్రి సీఈవో వెంకట ఫణిదర్, ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ కోశాధికారి టీసీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి
సాక్షి, మంగళగిరి : శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుధాకర్ గాయపడ్డాడు. సుధాకర్ తాజాగా ‘నువ్వు తోపురా’ చిత్రంలో నటించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న నటుడు సుధాకర్ గాయపడ్డారు. కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో సుధాకర్ నువ్వు తోపు రా అనే సినిమాలో సుధాకర్ నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జనసేన రాష్ట్ర కార్యాలయం లీజుపై వివాదం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/సాక్షి, అమరావతి :గుంటూరు జిల్లా చినకాకానిలో రాష్ట్ర కార్యాలయం కోసం జనసేన పార్టీ లీజుకు తీసుకున్న స్థలం వివాదంలో చిక్కుకుంది. ఆ భూమి తమదంటూ కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం గురువారం మీడియా ముందుకు వచ్చింది. కోర్టు వివాదంలో ఉన్న భూమిని పవన్‌కల్యాణ్ ఎలా తీసుకున్నారో తమకు తెలియదని, తమ భూమి తమకు ఇవ్వాలంటూ భూ యజమానులు షేక్ షఫీ, ముస్తాక్, మెహబూబా, షంషాద్ కోరారు. ముస్లిం ఐక్య వేదిక కార్యాలయంలో వేదిక రాష్ట్ర అ«ధ్యక్షుడు షేక్ జలీల్, లీగల్ సెల్ చైర్మన్ గౌతంరెడ్డితో కలిసి గురువారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ స్థల వివాదమై 1997లో గుంటూరు కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని.. అనంతరం యార్లగడ్డ సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించారన్నారు. ప్రస్తుతం కేసు అక్కడ పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ సుబ్బారావు వారసులు యార్లగడ్డ సాంబశివరావు తదితరులు సదరు స్థలాన్ని జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి లీజుకు ఇచ్చిన విషయం తమకు ఆలస్యంగా తెలిసిందన్నారు. లీజులో దురుద్దేశాల్లేవు : పవన్ కాగా, స్థల వివాదంపై పవన్ స్పందిస్తూ.. త్వరలోనే న్యాయ నిపుణులతో కలిసి జనసేన ప్రతినిధులు చినకాకాని వస్తారని, భూ యజమానులు తమ డాక్యుమెంట్లు వారికి ఇవ్వాలని ఓ ప్రకటనలో సూచించారు. స్థలం ముస్లింలదేనని నిర్థారణ అయిన మరుక్షణం జనసేన ఆ స్థలానికి దూరంగా ఉంటుందని హామీ ఇస్తున్నట్టు పవన్ స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని కేవలం మూడున్నర సంవత్సరాలకు మాత్రమే జనసేన లీజుకు తీసుకుందని, అందువల్ల ఈ స్థలం విషయంలో దురుద్దేశాలు లేవని ఆయన పేర్కొన్నారు. -
చినకాకానిలో భారీ పేలుడు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిలోని చినకాకాని వద్ద ఉన్న టపాసుల గోదాములో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. గోదాములో బాణాసంచాకు మంటలు అంటుకోవడంతో ఈ పేలుడు జరిగింది. టపాసుల పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో రహదారిపై వాహక రాకపోకలు నిలిచిపోయాయి. -
పోలీసుల అదుపులో మాయలేడి!
మంగళగిరి: చినకాకానిలోని ఎన్నారై మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని రూ.1.50 కోట్లతో ఉడాయించిన మాయలేడి శ్రీదేవిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె చేతిలో మోసపోయిన గుంటూరుకు చెందిన బాధితులు ఇటీవల మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కేసు విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో శ్రీదేవితోపాటు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆమె భర్త ఆచార్యులును కూడా విచారిస్తున్నట్లు సమాచారం. మాయలేడి భర్త వ్యవసాయశాఖలో విధులు నిర్వర్తిస్తుండగా.. ఏడు సంవత్సరాల క్రితం మనస్పర్థలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. అయితే కుమారుడికి వివాహం చేసేందుకు ఆరు నెలలుగా ఇద్దరూ కలిసి ఉంటున్నారని తెలిసింది. అంతకుముందే జల్సాలకు అలవాటుపడిన శ్రీదేవి గుంటూరు పట్టాభిపురంలో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు నొక్కేసినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో, విజయవాడలో సైతం ఇదేవిధంగా మోసాలకు పాల్పడి డబ్బు సంపాదించి కుమార్తెను ఆస్ట్రేలియాకు పంపి కుమారుడిని ఎంబీఏ చదివించినట్లు తెలుస్తోంది. గుంటూరుతో పాటు కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఆమెపై పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులతో ఫొటోలు దిగి వారితో తనకు సత్సంబంధాలు వున్నాయని, సినిమా అవకాశాలు కల్పిస్తానని యువతులను, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు యువకులను మోసగించినట్లు సమాచారం. శ్రీదేవిని అదుపులోకి తీసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఆమె వద్ద రూ.25 లక్షల నగదు, రూ. 25లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
వైద్యులకు సేవాభావం అవసరం
చినకాకాని(మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్: రోగులకు సేవాభావంతో వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ అన్నారు. ఎన్నారై వైద్యశాలలో మంగళవారం అవయవ మార్పిడిపై వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ ఎస్పీ జ్యోతిప్రజ్వలన గావించి సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రులకు ఎక్కువ మంది రోగులు వస్తే అధిక డబ్బులు వస్తాయని వైద్యులు అనుకోవడం తప్పని, సమాజానికి సేవ చేయాలనే భావన కలిగి ఉండాలని సూచించారు. తల్లి తరువాత ప్రాణం పోసేది వైద్యులు, పోలీసులు మాత్రమేనని చెప్పారు. వైద్యులు ప్రాణాలు పోస్తే, పోలీసులు ప్రాణాలను కాపాడతారన్నారు. అవయవ దానం గొప్పది : అర్బన్ ఎస్పీ సదస్సులో అర్బన్ ఎస్పీ జెట్టి గోపినాథ్ మాట్లాడుతూ అవయవదానం ఎంతో గొప్పదానమనే విషయాన్ని వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది విలువైన తమ అవయవాలను, ఒక్కోసారి ప్రాణాలను సైతం కోల్పోతున్నారని చెప్పారు. పేద కుటుంబాలకు అవయవ దానం మేలు చేకూర్చుతుందని, మృతుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తుందని తెలిపారు. అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నారై డెరైక్టర్లు డాక్టర్ మంతెన నర్సరాజు, ముక్కామల సుమతి, డాక్టర్ పోలవరపు రాఘవరావు, డాక్టర్ పిన్నమనేని రామకృష్ణ, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్ సాహెబ్, డాక్టర్ శ్రీలత, డాక్టర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.