బలప్రయోగంతో కార్మిక నేతల్ని అరెస్టు చేస్తున్న పోలీసులు
తిరుపతి అర్బన్: తిరుమల–తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పనిచేస్తున్న 14,370 మంది కాంట్రాక్ట్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో టీటీడీ పరిపాలనా భవనం ముందు చేస్తున్న రిలే నిరాహార దీక్షల స్థలం మంగళవారం యుద్ధభూమిని తలపించింది. నాలుగు రోజులుగా శాంతియుతంగా సాగుతున్న దీక్షా స్థలం పరిసరాల్లోకి అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో పోలీసు అధికారుల జీపులు, ప్రత్యేక బలగాలు, పోలీసు బస్సులు చేరుకోవడంతో నగర వాసులు, టీటీడీ ఉద్యోగులు, అటు వెళ్తున్న భక్తులు ఆందోళన చెందారు. తాము నాలుగు రోజులుగా శాంతియుత నిరాహార దీక్షలు చేస్తున్నా ధార్మిక సంస్థ పాలకులు కనీసం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు మంగళవారం పరిపాలనా భవనం ముట్టడికి సన్నద్ధమయ్యాయి. దీంతో అధికార పార్టీ నాయకులు, టీటీడీ ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో నగరంలోని అలిపిరి, ఈస్ట్. వెస్ట్ పోలీస్ స్టేషన్ల పోలీసు వాహనాలతో భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకున్నాయి.
ముందుగా అటు వరదరాజనగర్ పెట్రోల్ బంక్ వద్ద, ఇటు భవానీనగర్ సిగ్నల్స్ వద్ద రోడ్డును పూర్తిగా దిగ్బంధం చేయించి దీక్షా స్థలం వద్దకు పోలీసులు చేరుకోవడం గమనార్హం! దీక్షను భగ్నం చేయాలని వారు యత్నించడంతో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ప్రతిఘటించారు. మరోవైపు పోలీసులు కార్మిక సంఘాల నాయకులు, టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులను బలవంతంగా వాహనాల్లోకి, జీపుల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అయినా కార్మికులు వెనుకంజ చేయకుండా శాంతియుత దీక్షలను కొనసాగించేందుకే పూనుకోవడంతో పోలీసులు, అదనపు బలగాలు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి స్త్రీ, పురుషులు అని చూడకుండా కార్మికులందరినీ వాహనాల్లోకి ఎక్కించారు. ఒక దశలో మహిళా కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినాగానీ వాటిని లెక్కచేయని పోలీసులు కార్మికులను పోలీసుస్టేషన్లకు తరలించడమే లక్ష్యంగా వారితో దుర్మార్గంగా వ్యవహరించారని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. పోలీసులు, ప్రత్యేక బలగాలు చేరుకోవడంతోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
60 మందికి పైగా కార్మికులు, కార్మిక నేతలు అరెస్ట్
ఉదయం 9 గంటల నుంచే కార్మికుల దీక్షా శిబిరానికి సీపీఎం జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, నగర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నారాయణబాబు, హాకర్స్ సంఘం కార్యదర్శి బుజ్జి, టీటీడీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, గోపీనా«థ్, రజని, బీసీ సంఘం రాష్ట్రనేత ఆల్మెన్‌రాజు, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు చేరుకున్నారు. ముందుగా టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో సానుకూల ప్రకటన రానిపక్షంలో తదుపరి చేయాల్సిన కార్యాచరణపై చర్చించుకుంటున్న సమయంలో పోలీసులు, అదనపు బలగాలు ఒక్కసారిగా చేరుకుని అరెస్టులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో వామపక్షాల నేతలు, కార్మిక సంఘాల ముఖ్య నాయకులే కాకుండా టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల్లో చాలామందిని కలిపి సుమారు 60 మందిని వరకు అరెస్ట్ చేసి అలిపిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పోలీసు స్టేషన్ వద్ద కూడా కార్మికులు తమ ఆందోళనపథం వీడలేదు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. కార్మికుల ప్రధాన డిమాండ్‌లో భాగంగా ఇప్పుడు ఇస్తున్న రూ.6500 వేతనాలను సుప్రీంకోర్టు తీర్పు మేరకు రూ.12,500కు పెంచాలని శాంతియుత దీక్షలతో టీటీడీ అధికారులకు తెలిపే ప్రయత్నం చేస్తే అరెస్టులు చేసి భయానికి గురిచేయడం దారుణమని నిరసించారు. పోలీసులతో కార్మికుల ఉద్యమాలను అణిచివేయాలని యత్నిస్తే ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment