గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 104 సేవలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలో గ్రామీణులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వైద్య సేవలు అందాయి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆ మహోన్నత లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. 104 సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు.
చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే చంద్రన్న సంచార చికిత్స (104) సేవలకు గ్రహణం పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 104 వాహనాల్లో మందులు అందుబాటులోని లేని దుస్థితి నెలకొంది. ఒక్కోసారి సూది, దూది కూడా లేకపోవడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. పైగా జీఓ 151 ప్రకారం సిబ్బందికి వేతనాలు పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేపట్టనున్నారు. జిల్లాలో 24 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ఉన్నాయి. 26 మంది పైలెట్లు, 26 మంది ఫార్మసిస్టులు, 26 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 26 మంది నర్సులు, 20 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ పనికి తగ్గట్టు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు.
జీఓ 151 ప్రకారం వేతనాలు ఇలా..
జీఓ 151 ప్రకారం నర్సులకు రూ.13,780 నుంచి రూ.15వేలకు పెంచాలి. ఫార్మసిస్టులకు రూ.14,452 నుంచి రూ.17,500, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.14,452 నుంచి 17,500, పైలెట్లకు రూ.13,780 నుంచి రూ.15వేలు, సెక్యూరిటీ(వాచ్‌మెన్) రూ.9,519 నుంచి రూ.12వేలకు పెంచాలి. ఈ జీఓ 2018 ఏప్రిల్ ఒకటో తేదీ జారీ అయినా ఇంతవరకు నూతన వేతనాలు అమలు చేయలేదు.
నీరుగారుతున్న రాజన్న లక్ష్యం..
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 104 సేవలు ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం క్రమంగా దాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇందులో భాగంగా 104 వాహనాలకు మందులు ఇవ్వడం లేదు. పెట్రోల్, డీజిల్ ఖర్చులకూ డబ్బు మంజూరు చేయడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మరమ్మతులకు గురైతే వాహనాల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని అంటున్నారు. 2008లో 104 పథకం హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ, 2011లో డీఎం అండ్ హెచ్‌ఓ పరిధిలో నడిచింది. 2016 నుంచి పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి సేవలు పేలవంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తాయి.
వేతనాలు పెంచాలి..
104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలి. అన్ని అర్హతలున్న మాకు కొన్నేళ్లుగా వేతనాలు పెంచలేదు. జీఓ 151 జారీ అయినా వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వచ్చే జీతాలతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది.– విజయ్‌శేఖర్, జిల్లా అధ్యక్షుడు, 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, చిత్తూరు
సేవలు మెరుగుపరచాలి..
జిల్లాలో 108 సేవలు మెరుగుపరచాలి. సంచార వైద్య సేవలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందాలి. మాకు అరకొర వేతనాలు మంజూరు చేస్తూ గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు. నూతన వేతన విధానాన్ని అమలు చేసి న్యాయం చేయాలి.– పి.ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి, 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment