వైద్య సేవలు అందిస్తున్న 104 వాహన సిబ్బంది
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): గ్రామీణ ప్రాంత ప్రజలకు ‘చంద్ర’గ్రహణం పట్టుకుంది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 104 సేవలపై నీలినీడలు కమ్ముకోవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. వైఎస్ హయాంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తుందనే విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే 104 సిబ్బందికి 151 జీవో ప్రకారం పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో మంగళవారం నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలో ఉన్న 30 చంద్రన్న సంచార వైద్యశాలలు మూలకు చేరనున్నాయి.
గ్రామాలకు వైద్యసేవలు
గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందించే చంద్రన్న సంచార చికిత్స (104) వాహనాల ద్వారా ప్రతి నెలా మారుమూల గ్రామాల్లో, నిర్దేశించిన రోజుల్లో (ఫిక్స్‌డ్ సర్వీస్) వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే 104 వాహన సేవలపై ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం కారణంగా మందులు అందుబాటులో లేని దుస్థితి నెలకొంటోంది. ఒక్కో వాహనానికి ఒక్కో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం, పైలట్, వాచ్‌మన్ ఉంటారు. వీరంతా 104 వాహనాల్లో గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రధానంగా రక్తపోటు, చక్కెర, ఆస్తమా, ఫిట్స్, వంటి దీర్ఘకాలిక వ్యాధులతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్ల లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారు. అయితే వీరందరూ పనికి తగ్గట్టు వేతనాలు అందకపోవడంతో సమ్మె సైరన్ మోగించారు.
జీవో 151 ప్రకారం...
జీవో 151 ప్రకారం నర్సులకు, పైలెట్లకు రూ.13,780 నుంచి రూ.15వేలకు పెంచాలి. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు రూ.14,452 నుంచి రూ.17,500, సెక్యూరిటీ (వాచ్‌మెన్) సిబ్బందికి రూ.9,519 నుంచి రూ.12 వేలకు పెంచాలి. ఈ జీవో 2018 మే ఒకటో తేదీన జారీ అయినా ఇంత వరకూ నూతన వేతనాలు అమలుకు నోచుకోలేదు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం చేస్తూ పీఎస్‌ఎంఆర్‌ఐ (పిరమళ్ల స్వస్థ మేనేజ్‌మెంట్ రీచార్జ్ ఇనిస్టిట్యూట్) యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేశారు. అయినా పూర్తి స్థాయిలో వేతనాలు అమలు చేయకుండా, యాజమాన్యం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పీఎఫ్, ఈఎస్‌ఐ నిమిత్తం ఉద్యోగి వాటాతోపాటు, యాజమాన్యం వాటాను తమ వేతనాల నుంచి చెల్లించడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. చట్టం ప్రకారం పీఎఫ్, ఈఎస్‌ఐ యాజమాన్యం భరాయించాల్సి ఉండగా, ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను తమ వేతనాల్లో కట్ చేస్తున్నా ప్రభుత్వం మిన్నకుండడాన్ని వారు తప్పుబడుతున్నారు. గత తొమ్మిది నెలలుగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులు, యాజమాన్యం వద్దకు తిరిగినా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె బాట పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.
నీరుగారుతున్న వైఎస్ ఆశయం...
అందరికీ ఆరోగ్యం అందించాలన్న సదుద్దేశంతో ప్రవేశపెట్టిన 104 విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో గంగా వాహనాలకు సరిగ్గా మందులు సరఫరా చేయకపోవడం, డీజిల్ ఖర్చులు, నిర్వహణకు సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడం, వాహనాలు మరమ్మతులకు గురవుతున్నా పట్టించుకోక పోవడంతో క్రమేపీ ఈ సేవలు రోగులకు దూరమవుతున్నాయి. 2008లో 104 పథకం హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా, 2011లో డీఎంఅండ్‌హెచ్‌వో పరిధిలో నడిచింది. 2016 నుంచి పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచీ సేవలు ఎలుకతోక వాటంగా తయారవుతున్నాయి.
జీవో సక్రమంగా అమలు చేయాలి
104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలి. అన్ని అర్హతలున్న మాకు కొన్నేళ్లుగా వేతనాలు పెంచలేదు. 151 జీవో జారీ చేసినా వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. జీవోను సక్రమంగా అమలు చేయాలి. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మెబాట వీడం. వాహనాలను యాజమాన్యానికి అప్పగించేసాం.– ఎం.త్రిమూర్తులు, జిల్లా అధ్యక్షుడు,104 చంద్రన్న సంచార చికిత్స కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం, కాకినాడ.
Comments
Please login to add a commentAdd a comment