స్తంభించిన ‘మీ సేవ’ | Mee Seva Centers Strikes in East Godavari | Sakshi
Sakshi News home page

స్తంభించిన ‘మీ సేవ’

Published Fri, Jan 18 2019 8:04 AM | Last Updated on Fri, Jan 18 2019 8:04 AM

Mee Seva Centers Strikes in East Godavari - Sakshi

అమలాపురంలో ఓ మీ సేవా కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న సిబ్బంది

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: జిల్లాలో ‘మీ సేవ’లు స్తంభిం చాయి. తమ డిమాండ్ల సాధన కోసం ‘మీ సేవ’ కేంద్రాల సిబ్బం ది గురువారం నుంచి సమ్మె బాట పట్టారు. రాష్ట్ర సంఘం పిలు పు మేరకు చేపట్టిన ఆ సమ్మెలో జిల్లాకు చెందిన దాదాపు రెండు వేల మీ సేవా కేంద్రాలు తాత్కాలికంగా మూత పడ్డాయి. 36 ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుమారు 440 సేవలు అందించే ఈ కేంద్రాలు జిల్లాలో మూతపడడంతో తొలి రోజే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రెండు వేల కేంద్రాలకు చెందిన సుమారు ఆరు వేల మంది సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. జిల్లాలో అర్బన్, రూరల్‌ ప్రాంతాల పేరిట రెండు కేటగిరీల్లో కేంద్రాలు పనిచేస్తున్నాయి.

ఏపీ ఆన్‌లైన్, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎంసీ) ఈ రెండు సంస్థలు జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాలు కమీషన్‌ పద్ధతిలో...అర్బన్‌ ప్రాంతాల కేంద్రాలు శాలరీ పద్ధతిలో పని చేస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల కేంద్రాల ఆపరేటర్లు, సిబ్బంది ప్రధానంగా తమ కమీషన్ల పెంపు కోసం...బకాయి కమీషన్లు ఏ నెలకానెల ఇవ్వాలన్న డిమాండ్లతో సమ్మెకు దిగారు. మొత్తం 18 డిమాండ్లపై  ప్రభుత్వానికి సమ్మె అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో ఈ నెల 17వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గం ముందే ప్రకటించి గురువారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. గ్రామీణ సమ్మెకు కొన్నిచోట్ల అర్బన్‌ సిబ్బంది మద్దతు తెలిపితే... మరికొన్నిచోట్ల తమకు మద్దతు ఇచ్చేలా చేసుకుని అర్బన్‌ ప్రాంతాల్లో కేంద్రాలను కూడా మూయించే ఏర్పాట్లు  చేశారు. తొలిరోజు జిల్లాలో మీ సేవా కేంద్రాల వద్ద సిబ్బంది ధర్నాలు చేసి నిరసనలు వ్యక్తం చేశారు.

స్తంభించిన సేవలు ఇలా...
జిల్లాలోని ‘మీ సేవా’ కేంద్రాల ద్వారా ప్రజలు ఇంటి పన్నులు, కరెంటె బిల్లులు, టెలిఫోన్, సెల్‌ఫోన్‌ బిల్లులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని సేవలను పొందుతున్నారు. ‘మీ సేవ’ అంటే నేడు ప్రజా జీవితంలో ఓ భాగమైపోయింది. సమ్మె సమాచారం తెలియని ప్రజలు  ఉదయం వచ్చి పడిగాపులు కాయడం కనిపించింది. చివరకు విషయం తెలిసి తిరుగు ముఖం పట్టారు. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతోపాటు ఇతర మున్సిపాటీలు, మండల కేంద్రాల్లో ఉన్న దాదాపు 750 మీ సేవా కేంద్రాల్లో నిత్యం వేలాది సేవలను ప్రజలు పొందుతున్నారు.

కమీషన్‌ పెంపే ప్రధాన డిమాండ్‌
మీ సేవా కేంద్రాల్లో ఆపరేటర్లు, ఇతర సిబ్బంది ప్రధానంగా చేసిన సేవలకు కమీషన్‌ పెంపు కోసం పోరాడుతున్నారు. గత ఏడాది మార్చిలో వీరి ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చి కమీషన్‌ పెంచినప్పటికీ అది 50 నుంచి 60 శాతం మాత్రమే పెంపు అమలవుతోంది. అయినప్పటికీ కమీషన్లు సరిపోక... ప్రజల నుంచి సేవలపరంగా ఒత్తిడి రెట్టింపు అవడంతో ఆ కేంద్రాల ఆపరేటర్లు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు అరకొర పెంపుతో ఇచ్చే కమీషన్లు కూడా ఏ నెలాకానెల కాకుండా మూడు నెలల బకాయిలు పేరుకుపోయిన తర్వాత ఇస్తున్నారు. దీంతో నిర్వహణా భారం మరీ పెరిగిపోయి కమీషన్‌ను తక్షణమే పెంచడంతోపాటు బకాయిలు లేకుండా రెగ్యులర్‌గా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు సమర శంఖం పూరించారు. ముఖ్యంగా ఆపరేటర్లకు నెలకు కనీస వేతనం రూ.15 వేలుండేలా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సేవలకు సంబంధించి ఏ కేటగిరీకి రూ.25, బీ కేటగిరీకి రూ.30 కమీషన్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మీ సేవకు మొత్తం జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement