డిమాండ్‌లతో కూడిన పత్రాలు చూపుతున్న మీసేవ నిర్వాహకులు
కర్నూలు(అగ్రికల్చర్)/ఆళ్లగడ్డ: మీసేవ కేంద్రాల నిర్వాహకులు సమ్మె బాట పట్టడంతో జిల్లా వ్యాప్తంగా కేంద్రాలు బంద్ అయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు గురువారం కేంద్రాలను మూసి నిర్వాహకులు ఆందోళనకు దిగారు. డిమాండ్‌లు, సమస్యల పరిష్కారంపై పలుసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో 867 కేంద్రాలున్నాయి. కర్నూలులో 4, నంద్యాల 3, ఆదోని 3, ఎమ్మిగనూరులో రెండు కేంద్రాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీ టిని అర్బన్ మీసేవ కేంద్రాలుగా వ్యవహరిస్తారు. వీటితోపాటు డీఆర్‌డీఏ–వెలుగు ఆధ్వర్యంలో గ్రామీ ణ ప్రాంతాల్లోని నడస్తున్న 8 వన్‌స్టాప్ సెంటర్లు పని చేస్తుండగా మిగతా 847 కేంద్రాలు మూతపడ్డాయి. మీసేవ కేంద్రాల ద్వారా 35 ప్రభుత్వ శాఖలకు చెందిన 350 వరకు సేవలందుతున్నాయి. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబందించి 53 సేవలు అందుతున్నాయి.
నష్టాల్లో మీసేవ కేంద్రాలు...
మీసేవ కేంద్రాల ద్వారా రైతులు, విద్యార్థులు ఇతర అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికి కమీషన్ అంతంతమాత్రం ఇస్తుండటం, పలు సేవలు తప్పించడం వల్ల అనేక కేంద్రాలు నష్టాల్లో నడుస్తున్నాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీసేవ ఆపరేటర్ల కమీషన్ పెంచాల్సి ఉండగా తగ్గించడంపై వీరు భగ్గుమంటున్నారు. మీసేవ కేంద్రాల నుంచి ఆధార్ నమోదును తప్పించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రూ.15వేల గౌరవవేతనం సహా 15 డిమాండ్‌లను మీసేవ కేంద్రాల డైరెక్టర్ ముందుంచినట్లు మీసేవ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు నాగరాజు, లోకేష్ షేక్షావలీ తదితరులు తెలిపారు. అవసరానికి మించి కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో పలు కేంద్రాలకు బాడుగులు, విద్యుత్, నెట్ బిల్లులు కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిపోయిన దరఖాస్తులు
2015లో ఒక్కో మీసేవ కేంద్రం ద్వారా సగటున రోజుకు 500 వరకు అప్లికేషన్‌లు అందేవి. కేంద్రాల ఏర్పాటు పెరిగిపోవడంతో ప్రస్తుతం రోజుకు 50కి మించడం లేదు. కేంద్రం నిర్వహణ కోసం నెలకు రూ.20 వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చవుతోంది. ఇందులో సగం మొత్తం కూడా ఆర్జించని కేంద్రాలున్నాయి. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా స్పందన లేకపోవడంతో సమ్మె బాట పట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మొదటి రోజు తహసీల్దారు కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అందించారు.
ప్రధాన డిమాండ్లు..
♦ జీఎస్టీ నుంచి మినహాయించాలి. లేదంటే ఆ మేరకు సొమ్మునుప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలి.
♦ గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు కొన్ని మినహాయింపులుండాలి.ఆపరేటర్లకు భృతి చెల్లించాలి.
♦ కేంద్రాల ప్రారంభ సమయంలో డిపాజిట్ రూపంలో వసూలు చేసిన రూ.లక్ష మొత్తాన్ని తిరిగివ్వాలి.
♦ పెండింగ్ ఉన్న కమీషన్‌వెంటనే చెల్లించాలి.
♦ నిర్వాహకులందరికీ ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
♦ స్టేషనరీ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి
Comments
Please login to add a commentAdd a comment