జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
సాక్షి, కర్నూలు(సెంట్రల్) : కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో డాక్యుమెంట్ రైటర్ల సమ్మెతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ కార్యాలయాల పరిధిలో రోజుకు ఒక్కో దానిలో 50కి పైగా రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ప్రభుత్వానికి ఒక్కో కార్యాలయం నుంచి రూ.5 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే డాక్యుమెంట్ రైటర్లపై సోమవారం ఏసీబీ దాడి చేసి 14 మంది నుంచి రూ.1.54 లక్షలు స్వాధీనం చేసుకోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. ఏదో బతుకుదెరువు కోసం రైటర్లుగా స్థిరపడిన తమపై ఏసీబీ దాడి చేశారని, బలవంతంగా జేబుల్లో ఉన్న డబ్బులను తీసుకెళ్లారని ఈనెల 14 నుంచి సమ్మెలోకి వెళ్లిపోయారు. దీంతో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను తయారు చేసేవారు లేకపోవడంతో సేవలు స్తంభించిపోయాయి. ఏదో బ్యాంకు మార్టిగేజ్‌కు సంబంధించిన సేవలు మాత్రం అందుబాటులో ఉండడం..అవి కూడా సింగిల్ డిజిట్ దాటడడం లేదు.
దీంతో ఒకప్పుడూ వందలాది మంది క్రయ, విక్రయదారులతో కళకళలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జనాలు లేక బోసిపోతున్నాయి. రెండు కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి రోజులో దాదాపు రూ. 10 లక్షల ఆదాయం వచ్చేది. అయితే రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో ఒక్కో దాని నుంచి రోజుకు రూ.10 వేలు దాటడడం లేదు. ఈ నెల 14 నుంచి నేటి వరకు అంటే 4 రోజుల్లో రూ.40 లక్షల ఆదాయం ఉండాల్సి ఉండగా 80 వేల రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. డాక్యుమెంట్ రైటర్లపై ఏసీబీ దాడులను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు డాక్యుమెంట్ రైటర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీం సాహెబ్ తెలిపారు. సమ్మెను ఈనెల 21వ తేదీ వరకు కొనసాగిస్తామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment