మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ నాగభూషణం
సాక్షి, కర్నూలు: కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. దళారుల ప్రమేయంతో అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు కూడా ముడుపులు ముట్టజెబుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఏసీబీ డీఎస్పీ నాగభూషణ్ నేతృత్వంలో సీఐలు గౌతమి, ఖాదర్‌బాషా తదితరులు పాలుపంచుకున్నారు. జిల్లా పరిషత్‌లో జరిగిన స్వయం దస్తావేజుల తయారీ అవగాహన సదస్సుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులందరూ హాజరు కావడంతో కార్యాలయంలో ఎవరూ ఏసీబీ అధికారులకు దొరకలేదు. కార్యాలయంతో పాటు ఆవరణలో 14 మంది డాక్యుమెంట్ రైటర్లు లావాదేవీలు నిర్వహిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద ఉన్న రూ.1.57 లక్షల అనధికారిక నగదును సీజ్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయం వద్దకు చేరుకున్న ఏసీబీ అధికారులు .. సుమారు గంట సేపు తనిఖీలు నిర్వహించారు. కొన్ని రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు క్రయవిక్రయదారుల నుంచి అధికంగా వసూలు చేసిన నగదును సీజ్ చేశారు. అవినీతి రహిత, పారదర్శక పాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది మాత్రం డాక్యుమెంట్ రైటర్ల ద్వారా దందాను నడిపిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక దాడి చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నివేదికను తయారు చేసి.. తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment