వాహనంలో శ్రీనివాసరావుని జైల్‌కు తరలిస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, విశాఖపట్నం: ఊహించిందే జరిగింది. జాతీయ స్థాయిలో కలకలం రేపిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయట పడకుండానే విచారణ ముగిసింది. కుట్రదారుల ప్రస్తావన లేకుండానే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారుచేశారు. ఆరు రోజులు పోలీసు కస్టడీకి తీసుకుని ఏమీ రాబట్టలేకపోయారు. అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి ఒడిగట్టిన వ్యక్తినుంచి కుట్ర సమాచారాన్ని రాబట్టలేక పోవడం పోలీసుల వైఫల్యాన్ని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎత్తి చూపుతోందని జనం కోడై కూస్తున్నా పోలీసులు మాత్రం ప్రభుత్వ పెద్దల స్క్రిప్ట్ మేరకే విచారణ జరిపారు.
హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ ఠాకూర్ చేసిన ప్రకటనలకు ఊతమిచ్చే విధంగా ఆరు రోజుల విచారణ డ్రామాను సిట్ బృందం రక్తి కట్టించింది. ఫోన్‌కాల్స్ ఆధారంగా శ్రీనివాసరావు స్నేహితులు, అతను పని చేస్తున్న ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ సిబ్బంది, యజమాని విచారణతోనే కాలయాపన చేసి సూత్రధారులు, పాత్రదారులుల ప్రస్తావన లేకుండానే విచారణ డ్రామాకు తెరవేశారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25వతేదీ మధ్యాహ్నం వీవీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కనీసం ప్రాధమిక విచారణ చేపట్టకముందే డీజీపీ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. జగన్‌పై దాడి చేసింది ఆయన అభిమానే... ఓ చిన్నపాటి ఘటనే.. అని ప్రకటించేశారు. డీజీపీ ప్రకటన అందిపుచ్చుకుని సీఎం చంద్రబాబు మొదలు రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు నోటికొచ్చిన రీతిలో మాట్లాడారు. ఇక సిట్ అంటే సిట్..స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు గానే ఆరురోజుల కస్టడీ నాటకాన్ని విశాఖపట్నంలో సిట్ బృందం రక్తికట్టించింది.
చివరి రోజు రికార్డువర్కుకే పరిమితం
చివరి రోజైన శుక్రవారం విచారణ జోలికి వెళ్లని సిట్ అధికారులు పూర్తిగా రికార్డు వర్కుకే పరిమితమయ్యారు. దర్యాప్తు వివరాలను క్రోడీకరిస్తూ రిపోర్టు తయారు చేయడానికే గడిపేశారు. నిందితుడ్ని కేజీహెచ్ నుంచి రప్పించిన వైద్యులతో పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం 3.20 గంటలసమయంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావును మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ మళ్లీ జ్యూడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించారు. కస్టడీ సమయంలో నిందితుడు పూర్తి స్థాయిలో సహకరించలేదంటూనే మరో ఆరురోజుల కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను పద్ధతి ప్రకారం ఫైల్ చేయలేదంటూ మేజిస్ట్రేట్ డిస్మిస్ చేశారు. కస్టడీలో నిందితుణ్ని న్యాయవాది సమక్షంలోవిచారించలేదని, పోలీసులే సొంతంగా చేసుకున్నారని, ఇది చట్టవిరుద్దమంటూ మరో వైపు అబ్దుల్ సలీమ్ అనే న్యాయవాది నిందితుడి తరపున 41డీ, సీఆర్ సీపీ కింద మెమో ఫైల్ చేశారు. కానీ ఈ మెమోలో నిందితుడి సంతకం లేకపోవడంతో దాన్ని కూడా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. మరోవైపు కోర్టులో నిందితుడు శ్రీనివాసరావు మెజిస్ట్రేట్ ముందు హిందీ, ఉర్ధూ భాషల్లో ఏదో మాట్లాడేందుకు యత్నించినా పోలీసులు నిలువరించారు.
నివేదిక సమర్పించని సిట్
ఘటన జరిగినప్పటి నుంచి నేటి వరకు సాగిన దర్యాప్తు నివేదికతో పాటు కస్టడీ సమయంలో నిందితుడ్ని విచారించిన తీరుపై వేర్వేరుగా రిపోర్టులు కోర్టుకు సమర్పించాల్సి ఉంది. కానీ వాటిలో ఏ ఒక్కటి సమర్పించ కుండానే నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపర్చారు.
హర్షవర్ధన్‌ను కనీసంగా విచారించని పోలీసులు
పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా సునిశిత సమస్యగా మారే కేంద్ర బలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానికి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతని ప్రేరేపించి, ఏం జరిగినా మేం చూసుకుంటాం... అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి ఉసిగొల్పిందెవరు.. అనే కీలక విషయాలను కనీసంగా రాబట్టలేకపోయారు. ఇక కుట్రకు కేంద్రంగా భావిస్తున్న శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరిని వరుసగా మూడు రోజుల పాటు చుట్టపుచూపుగా పిలిపించడం, పంపించడం తప్ప అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించిన పాపాన పోలేదు.
ఆరురోజులూ హైడ్రామానే..
మొదటిరోజు సీఐఎస్‌ఎఫ్ అధికారులనుంచి స్థానిక పోలీసులు నిందితుడిని స్వాధీనం చేసుకునే ముందు 11 పేజీల లేఖ పేరుతో నాటకం మొదలు.. కస్టడీలో మూడోరోజు డాక్టర్లు ఆరోగ్యంగానే ఉన్నాడని ధ్రువీకరించినా..మీడియాతో మాట్లాడించేందుకు ఉద్దేశ్యపూర్వకంగా వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నేను జగన్ అభిమానినే.. ఇదంతా ప్రజల కోసమే చేశా.. నా వెనుక ఎవరూ లేరు.. నన్ను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారు.. ఒకవేళ నేను చనిపోతే నా అవయవాలు దానం చేయండని నిందితుడితో చెప్పించారు.
కేసు పురోగతి పట్టని సీపీ
కేసు ఫైల్ చేసిన వెంటనే హడావుడి చేసిన విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా కస్టడీ మూడో రోజు నుంచే విచారణ వైపుకన్నెత్తి చూడలేదు. కాల్‌డేటా విశ్లేషణలో విశేష అనుభవం ఉందంటూ విచారణ బాధ్యతలను అప్పగించిన ఫకీరప్పను ఉన్నట్టుండి తప్పించి.. బదలీపై కొత్తగా వచ్చిన డీసీపీ నయీమ్‌కు అప్పగించారు. తల్లిదండ్రులు, స్నేహితులు, సహచర ఉద్యోగులు, కాల్‌డేటా ఆధారంగా 52 మందిని విచారించి స్టేట్‌మెంట్స్ రికార్డు చేయడం మినహా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సీసీ ఫుటేజ్ విశ్లేషణలో ఏం తేలిందో తెలియదు.
హై సెక్యూరిటీ బ్లాక్‌లో నిందితుడు
ఆరిలోవ (విశాఖ తూర్పు): పోలీసు కస్టడీ ముగిసిన నిందితుడు శ్రీనివాసరావును విశాఖ కేంద్రకారాగారంలో అధికారులు హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచారు. శ్రీనివాసరావు ప్రత్యేక ఖైదీ కావడంతో హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచామని, అతనితో ఇతర ఖైదీలు మాట్లాడే అవకాశం కూడా ఉండకుండా వార్డర్లను సెక్యూరిటీ ఉంచినట్లు జైల్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment