
తిరుపతిలో డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహన చోదకులకు జరిమానా విధిస్తున్న పోలీసులు
జిల్లా వ్యాప్తంగా ఉన్న వాహనాలకంటే డ్రైవింగ్ లైసెన్స్‌లు తక్కువగా ఉండడంఆశ్చర్యం కలిగిస్తోంది. వాహనచోదకులు చాలావరకు లైసెన్స్‌లు లేకుండా వాహనాలను నడపడం, తరచూ పోలీసుల తనిఖీలలో పట్టుబడి జరిమానా కట్టడం షరా మామూలుగా మారింది. మరికొందరు లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకోవడంలోను అలసత్వం వహిస్తూ జరిమానాలు చెల్లిస్తున్నారు. రవాణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అవగాహనా శిబిరాలు, ఎల్‌ఎల్‌ఆర్ మేళాలు నిర్వహించినా వాహనదారుల్లో చలనం రావడం లేదు.
తిరుపతి అన్నమయ్యసర్కిల్: నిత్యం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, రవాణా అధికారులు తనిఖీలు చేపట్టి జరిమానాలు విధిస్తున్నా వాహనచోదకులలో మార్పు కనిపించడం లేదు. ఒక తిరుపతి పరిధిలోనే వేలసంఖ్యలో వాహనచోదకులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకపోవడం దారుణం. వాహనదారులు జరిమానాలను సైతం లెక్కచేయకుండా చెల్లించడం మళ్లీ షరామామూలుగా డీఎల్ లేకుండా తిరుగుతున్నారు. ద్విచక్రవాహన చోదకునికి డీఎల్ లేకపోతే రూ.1500, లైట్ మోటార్ వెహికల్ చోదకులకు రు.2000, హెవీ మోటార్ వెహికల్ చోదకులకు రూ.5000 వరకు ప్రస్తుతం జరిమానా విధిస్తున్నారు.
స్పందించని వాహనదారులు..
వాహన చోదకుల్లో మార్పు తీసుకురావడానికి రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పలు రకాలుగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. వీటికి మంచి స్పందన కనిపిస్తున్నా వాహనచోదకులలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రమాదాలను అరికట్టే ఉద్దేశంలో ఎన్నివిధాలుగా అధికారులు వారించినా ఫలితం ఉండడం లేదు. జిల్లాలో ఎక్కువ శాతం ప్రమాదాలు డ్రైవింగ్ లైసెన్స్‌లేని వాహనచోదకుల కారణంగానే జరుగుతుండటం గమనార్హం.
కఠినతరం చేయాల్సిందే..
డీఎల్ లేని వాహనచోదకులకు జరిమానా విషయంలో భారీగా విధించి, శిక్షను సైతం కఠినంగా విధించేలా చట్టాలలో మార్పు తీసుకురావాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చనేది వారి అభిప్రాయం. ప్రజలలో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై అనేక కేసులలో న్యాయస్థానాలు సైతం కఠినంగా వ్యవహరించాయి. డీఎల్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రమాదం సంభవిస్తే ఎటువంటి బీమా వాహనచోదకుడికి లభించదు. అంతేకాకుండా ప్రమాదానికి కారణమైన సదరు వ్యక్తి నుంచి అపరాధరుసుంను సైతం వసూలుచేసి ప్రమాదానికి గురైన వ్యక్తికి చెల్లించడం జరుగుతుంది.
కఠినంగా వ్యవహరిస్తున్నాం
ప్రమాదాలను అరికట్టేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. జరిమానాలతో పాటు, కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేస్తున్నాం. డీఎల్ ప్రక్రియను సైతం రవాణా శాఖ సులభతరం చేసింది. ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షకోసం ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఆర్ యాప్ అందుబాటులో ఉంది. పరీక్షలో సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చు. డీఎల్ కాలపరిమితి ముగిసిన వాహనచోదకులు ఆన్‌లైన్ ద్వారా రెన్యూవల్ చేయించుకోవాలి.–జి. వివేకానందరెడ్డి, తిరుపతి ఆర్టీఓ
ద్విచక్ర వాహనాలే ఎక్కువ
ప్రతిరోజు తిరుపతి పరిసర ప్రాంతాలలో 250 నుంచి 350 కేసులు అన్ని రకాల వాహనాలపై నమోదు అవుతున్నాయి. వీటిలో రోజుకు 50 నుంచి 80 కేసులు లైసెన్స్‌లేని ద్విచక్ర వాహన చోదకులపైనే. జరిమానాలతో ప్రభుత్వానికి రోజుకు రూ.80 నుంచి ఒకలక్ష వరకు చెల్లిస్తున్నారు. తర్వాత స్థానంలో ఆటోలు, కార్లపై కేసులు నమోదవుతున్నాయి. వాహన చోదకులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి
– తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ సుకుమారి
Comments
Please login to add a commentAdd a comment