పట్టుబడిన నగదును చూపుతున్న సీఐ
అనంతపురం సెంట్రల్: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికారపార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులను ఓటర్లకు ఎరగా వేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డబ్బులను ఇప్పటి నుంచే సర్దుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు రాప్తాడు నియోజవకవర్గం చెన్నేకొత్తపల్లిలో పోలీసుల తనిఖీల్లో రూ.1.27 కోట్లు పట్టుబడడం అద్దం పడుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టడడం కలకలం సృష్టించింది.
పరిటాల శ్రీరామ్ సన్నిహితులే..
శుక్రవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేస్తుండగా తెలంగాణా రిజిస్ట్రేషన్‌తో వచ్చిన కారులో రూ. 1.27 కోట్లు పట్టుబడ్డాయి. అయితే ఈ డబ్బు ఎక్కడికి తీసుకెళుతున్నారు. ఎందుకు తీసుకెళుతున్నారనే పోలీసుల ప్రశ్నలకు కారులో ఉండే వ్యక్తులు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో పోలీసులు కారును, అందులోని వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. అయితే ఆ కారులో రాప్తాడు నియోజకవర్గంలోని ఓ మండలంలో పనిచేస్తున్న వీఆర్వో ఉండడం గమనార్హం. తెలంగాణ వాసులతో పాటు రాప్తాడుకు చెందిన ఐదారుగురు ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. వీరంతా మంత్రి పరిటాల నునీత కుమారుడు శ్రీరామ్‌కు అత్యంత సన్నిహితులుగా తెలుస్తోంది.
పోలీసులపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు
ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత డబ్బు సర్దుబాటు వ్యవహారం కొత్త తలనొప్పులకు కారణమవుతుందని భావించిన అధికార టీడీపీ నాయకులు ఆ మేరకు ఇప్పటి నుంచే అక్రమాలకు తెరలేపారు. నగదు సర్దుబాటులో భాగంగానే రాప్తాడు నియోజకవర్గంలోని ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రూ.1.27 కోట్లు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును అత్యంత గోప్యంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయంగా ఇప్పటికే సదరు పోలీసులపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం. పట్టుబడిన సొమ్మును రియల్‌వ్యాపారానికి ముడిపెట్టి కేసును మూతవేయించే దిశగా పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ కారులో లేవు.
రామగిరి: చెన్నేకొత్తపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి పోలీసుల తనిఖీలో పట్టుబడిన రూ.1.27 కోట్లను ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నట్లు రామగిరి సీఐ తేజోమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన చెన్నేకొత్తపల్లి సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భూమి కొనుగోలు విషయమై బెంగుళూరుకి తరలిస్తున్న రూ.1.27 కోట్లు తమ తనిఖీలో పట్టు పడినట్లు పేర్కొన్నారు. అయితే ఇందుకు సరైన ఆధారాలు, పత్రాలు చూపకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రవివర్మ, అతని స్నేహితుడు రామకృష్ణరాజు, డ్రైవర్ భాస్కర్‌కుమార్, చెన్నేకొత్తపల్లి వీఆర్వో నజీర్ అహమ్మద్, రామగిరి మండలం కుంటిమద్ది నివాసి సానిపల్లి అక్కులప్పను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన నగదు, సంబంధిత వ్యక్తులు ఉపయోగించిన వాహనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment