హైదరాబాద్: డ్రైవర్‌ను గాయపరిచి లారీని తీసుకెళ్లిన మహ్మద్ అలీఖాన్ అనే వ్యక్తిని గురువారం పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇవి... ఫిబ్రవరి 1న విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్‌కు స్క్రాప్ తరలిస్తున్న లారీ అనకాపల్లి చేరుకున్నప్పుడు మహ్మద్ అలీ ఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్లేందుకు ఎక్కాడు. లారీ సూర్యాపేట చేరుకున్న తర్వాత డ్రైవర్, క్లీనర్‌లకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు.
డ్రింక్ తాగిన డ్రైవర్‌కు నిద్ర రావడంతో లారీని రోడ్దు పక్కన ఆపేశాడు. లారీ దొంగిలించేందుకు ఇదే అదునుగా భావించిన అలీఖాన్, తాను కూడా లారీ డ్రైవర్‌ను అయినందున హైదరాబాద్‌కు వరకు డ్రైవ్ చేస్తానని చెప్పాడు. లారీని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. తుకారం గేట్ సమీపంలోకి వచ్చిన తర్వాత టైర్ పంక్చర్ అయిందని చెప్పి క్లీనర్‌ను దింపేశాడు. తర్వాత లారీతో ఉడాయించాడు. మత్తులో ఉన్న డ్రైవర్‌ను బండరాయితో మోది గాయపరిచి రోడ్డు పక్కన పడేసి వెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. 2014లో ఇదే తరహా దొంగతనానికి పాల్పడిన కేసులో నిందితుడి నుంచి రూ. 2.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.