అక్రమంగా తరలిస్తున్న రూ.43 లక్షలు స్వాధీనం
ఒంగోలు టౌన్ : రైలులో అక్రమంగా తరలిస్తున్న 43లక్షల రూపాయల నగదును ఒంగోలు టూటౌన్ పోలీసులు మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్‌లో స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరిజిల్లా ఏలూరుకు చెందిన సక్రు నరేష్ దిబ్రూఘడ్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో 43 లక్షల రూపాయలున్న బ్యాగుతో ప్రయాణిస్తున్నాడు. అయితే, అతను మిలిటరీ కోచ్‌లో ఎక్కడంతో అతని వద్ద భారీగా నగదు ఉండటాన్ని ఆ కోచ్‌లో ప్రయాణిస్తున్న కొంతమంది ఆర్మీ సిబ్బంది గమనించారు.
అతని వాలకంపై ఆర్మీ సిబ్బందికి అనుమానం వచ్చి రైలు ఒంగోలు చేరే ముందుగా జిల్లా ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ సిబ్బందితో కలిసి దాడిచేసి నరేష్‌ను పట్టుకున్నారు. అతని తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అరెస్టు చేయడంతో పాటు నగదును స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
పొంతనలేని సమాధానాలు చెప్పిన నిందితుడు...
పోలీసు విచారణలో నిందితుడు నరేష్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. తనది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరని, అక్కడ కోటేశ్వరరావుకు చెందిన కుందన్ జ్యువెలరీస్‌లో తాను గుమస్తాగా పనిచేస్తున్నానని పేర్కొన్నాడు. ఏలూరులోని వెంకన్నచెరువు వద్ద ఉన్న దక్షిణపు వీధిలో నివాసం ఉంటున్నట్లు తెలిపాడు.
తాను విజయవాడలో దిగాల్సి ఉందని పోలీసులతో చెబుతున్నప్పటికీ అతని వద్ద ఏలూరు నుంచి నెల్లూరు వరకు ప్రయాణించేందుకు తీసుకున్న రైలు టికెట్ ఉంది. నగదు గురించి అడిగితే సమాధానం దాటవేస్తుండటంతో అతను వాస్తవాలు దాచిపెడుతున్నట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వాస్తవాలు రాబట్టేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అతని వెనుక ఎవరో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ వెంట కొత్తపట్నం ఎస్సై బత్తుల నరసింహారావు, సిబ్బంది ఎం.రామకృష్ణ ఉన్నారు.