అమరుడా.. జన పోలీసు వీరుడా
‘జనమంతా గాఢ నిద్రలో ఉంటే.. నువ్వు మాత్రం మేల్కొనే ఉన్నావు.ఎండనక.. వాననక.. రాత్రనక.. పగలనక.. పండగల్ని కూడా త్యాగం చేసి ప్రజల కోసమే పని చేశావు. వారి కోసమే ప్రాణమిచ్చావు. ఖాకీ బట్టను త్యాగానికి గుర్తుగా మలచావు. అమరుడా.. జన పోలీసు వీరుడా.. నీకివే మా జ్యోతలు’ అంటూ పోలీసులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పిం చిన పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌం డ్స్‌లో మంగళవారం నిర్వహించిన పోలీస్ అమర వీరుల సంస్మరణ సభలో ఆమె మాట్లాడారు. ప్రజలు సురక్షితమైన జీవనం సాగించడానికి పోలీసులు అందిస్తున్న సేవలే కారణమన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, పోలీసు వ్యవస్థను పటిష్టపర్చడానికి చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 642 మంది విధి నిర్వహణలో ప్రాణ కోల్పోయూరని వివరిం చారు.
పోలీసు అమర వీరుల కుటుంబాలకు పోలీసు సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు. అనంతరం పోలీసులు కవాతు నిర్వహించి, అమర వీరులకు నివాళులర్పించారు. ముగ్గురు పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులకు మంత్రి, ఎస్పీ జ్ఞాపికలు అందించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలైన 18 మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సభానంతరం సురేష్ బహుగుణ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు. ఏఎస్పీ ఎన్.చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజు వర్మ, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత, ఏఆర్ డీఎస్పీ కె.కోటేశ్వరరావు, ఎస్‌బీ సీఐలు విల్సన్‌బాబు, ఎం.సుబ్బారావు, డీసీఆర్‌బీ సీఐ కె.రజనీకుమార్, టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్, ఏఆర్ ఆర్‌ఐ శ్రీనివాస్, సీఐలు కిషోర్‌బాబు, నాగేంద్ర ప్రసాద్, ఫణీంద్ర పాల్గొన్నారు.