పలమనేరు, న్యూస్‌లైన్: పలమనేరు వద్ద అటవీప్రాంతంలో జరిగిన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్య పోలీసులకే సవాలుగా మారింది. ఇంకా మిస్టరీ వీడని ఈ కేసును ఛేదించడానికి ఆటోకు సంబంధించిన సమాచారమిచ్చిన వ్యక్తే కీలకమవుతాడని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశలోనే అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అతడు సంఘటన స్థలంలో నిందితులను చూసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిముషాల వ్యవధిలో హత్యలు....
ఈ నెల 1న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాల వినాయగర్ అనే వ్యక్తి మహేష్ అనే కానిస్టేబుల్‌కు అటవీ ప్రాంతంలో ఓ యువతితో పాటు ఆటోలో మరో వ్యక్తి వె ళ్తున్నట్లు సమాచారమిచ్చాడు. 5.08 నిముషాలకు మహేష్ ఈ విషయాన్ని బ్లూకోట్స్ సిబ్బంది జవహర్‌లాల్ నాయక్‌కు ఫోన్‌లో చెప్పాడు. నాయక్‌తో పాటు హోమ్‌గార్డు దేవేంద్రకుమార్ బైక్‌లో గాంధీనగర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. 5.15 నిముషాలకు ఇక్కడెవరూ లేరని మహేష్‌కు నాయక్ ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో మళ్లీ బాల వినాయగర్‌కు మహేష్ ఫోన్ చేయగా, ఇంకొంచెం ముందుకెళ్లాలని సూచించాడు. ఈ విషయూన్ని మహేష్ మళ్లీ ఫోన్ ద్వారా నాయక్‌కు చెప్పాడు. ఆ తర్వాత 5.21 నిముషాలకు మరోసారి నాయక్ మహేష్ ఫోన్‌కు రింగ్ చేయగా అతను తీయలేదు. ఆపై 5.27 నిముషాలకు మహేష్ మరోమారు నాయక్ ఫోన్‌కు, దేవేంద్ర సెల్‌కు ఫోన్ చేస్తే తీయలేదు. దీన్నిబట్టి చూస్తే 5.21 నుంచి 5.27లోపే ఏడు నిముషాల వ్యవధిలో హోమ్‌గార్డు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మాధవిది హత్యా? లేక ఆత్మహత్యా?........
గంగవరం మండలం మారేడుపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థిని మాధవి ఈ నెల 2న సాయంత్రం 6 గంటలకు అపస్మారక స్థితిలో ఉందని కుటుంబీకులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె శరీరంపై గాయాలున్నట్లు చికిత్సలందించిన వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రాత్రి 8 గంటలకు ఆమెను మదనపల్లె ఆస్పత్రికి రెఫర్ చేశారు. మార్గమధ్యంలో ఆమె మృతిచెందింది. మరుసటి రోజు 3న ఉదయం హుటాహుటిన మాధవి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు సిద్ధం కావడంతో పోలీసులకు అనుమానాలొచ్చాయి. దీంతో వారు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు. పీఎం నివేదికలో ఇది హత్యా లేక ఆత్మహ త్యా అనే విషయం తేలాల్సి ఉంది.
అతడే కీలక సాక్ష్యమా ?
ఈ కేసుకు సంబంధించి పశువుల కాపరి బాల వినాయగర్ కీలకంగా మారాడు. ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత తనకేమీ తెలియదని ఇతను బుకాయించినా పోలీసులు సేకరించిన కాల్‌లిస్ట్ వివరాలతో ఆపై కొంతవరకు నిజాలను బయటపెట్టినట్లు సమాచారం. ఇతని సెల్‌ఫోన్‌లో డైల్డ్, రిసీవ్డ్ కాల్ లిస్ట్‌ను డెలిట్ చేసి ఉండడంతో పోలీసులకు మరింత అనుమానం పెరిగింది. కచ్చితంగా సంఘటనా స్థలం వద్ద ఇతను ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
మాధవి మృతికి, ఈ కేసుకు సంబంధం ఉందా?
దేవేంద్రకుమార్‌కు మాధవి స్నేహితురాలు. దాంతో ఆమె మృతికి కానిస్టేబుళ్ల హత్యకేసులకు ఏదైనా సంబంధం ఉందా ? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. పలమనేరులో మాధవి చదువుతున్న డిగ్రీ కళాశాల వద్దకు హత్యకు గురికాకముందు దేవేంద్ర బైక్‌లో నాయక్‌తో కలసి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే గాంధీనగర్ అటవీ ప్రాంతానికి వీరు వెళ్లారు. వీరి హత్యలు జరిగిన మరుసటి రోజే మాధవి అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. తన స్నేహితుని మృతిని జీర్ణించుకోలేక ఆమె ఆ రోజంతా ఏడుస్తూనే గడిపినట్టు స్నేహితులు చెబుతున్నారు. దీంతో ఆమె కుటుంబీకులను సైతం విచారించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు పోలీసులను ఊపిరాడనీయకుండా చేస్తోంది.