తుపాకీ పేలి జవాను దుర్మరణం | police died by misfiring of GUN fire | Sakshi
Sakshi News home page

తుపాకీ పేలి జవాను దుర్మరణం

Published Fri, May 9 2014 1:51 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

police died by misfiring of GUN fire

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఎన్నికల బందోబస్తుకు వచ్చిన సెంట్రల్ ఫోర్స్ జవాను.. తోటి జవాను చేతిలోని తుపాకీ పేలి తలలోకి బుల్లెట్ దూసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులిచ్చిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సాహుపురా గ్రామానికి చెందిన దినేష్‌కుమార్ ధ్రువ (21) ఎన్నికల బందోబస్తు నిమిత్తం తోటి జవాన్లతో కలిసి శ్రీకాకుళం జిల్లాకు వచ్చాడు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. ఎన్నికలు పూర్తవడంతో చాలా మంది జవాన్లు గురువారం ఉదయమే తిరుగు ప్రయాణమయ్యారు. కాని వీరి బ్యాచ్ వెళ్లేందుకు రైలు రాత్రి రెండు గంటలకు ఉండటంతో బస చేసిన గదిలోనే ఉండిపోయారు.
 
 ఈలోగా అదే బ్యాచ్‌లో ఉంటున్న గోవింద్‌సింగ్ అమర్‌ఖాన్ తన తుపాకీ (మోడల్ 303)ని పట్టుకుని పరిశీలిస్తుండగా ఉన్నట్టుండి లాక్ ఓపెనవ్వడంతో బులెట్ రిలీజై ఎదురుగా తలుపు వద్ద ఉన్న దినేష్‌కుమార్ ధ్రువ తలలోకి దూసుకుపోయింది. దీంతో కుప్పకూలిన అతడిని తోటి జవాన్లు 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ధ్రువ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గోవింద్‌సింగ్ ఉద్దేశ పూర్వకంగానే కాల్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మధ్య వివాదం జరిగిన నేపథ్యంలో కావాలనే కాల్చినట్లు తెలిసింది. గోవింద్‌సింగ్ అమర్‌ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సెంట్రల్ ఫోర్స్ కమాండెంట్ అచల్ సంఘటన స్థలాన్ని, జవాను మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ జరుపుతామని విలేకరులకు చెప్పారు. ఎస్పీ నవీన్ గులాఠీ కూడా రిమ్స్‌కు వెళ్లి జవాను మృతదేహాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement