
ఓయూలో శాంతిర్యాలీని అడ్డుకున్న పోలీసులు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : ఓయూ క్యాంపస్‌లో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. సోమవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ, టీజీవీఎస్, టీపీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పా టు చేయాలని డిమాండ్‌తో ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పార్క్ వరకు చేపట్టిన శాంతి ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి రామచంద్రుడు నాయక్ జెండాఊపి ప్రారంభిం చారు. క్యాంపస్ ప్రవేశ ద్వారం ఎన్‌సీసీ గేటు వద్ద మోహరించిన పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో విద్యార్థులు సీమాంధ్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి కరాటే రాజు మాట్లాడుతూ వచ్చే నెల 7న నిర్వహించతలపెట్టిన సీమాంధ్రుల సభను రద్దు చేసుకోకపోతే అదేరోజు సీమాంధ్ర ఉద్యోగులే లక్ష్యంగా ఎల్బీ స్టేడియం వరకు మిలీనియం మార్చ్ చేపడతామని, దాడులు చేయడానికీ వెనుకాడబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు శాంతియుత, సాయుధ ఉద్యమం సాగించిన చరిత్ర ఉందన్న విషయాన్ని సీమాంధ్ర ఉద్యమ నాయకులు గుర్తించుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ సంక్షేమ భవన్ వద్ద నిర్వహించిన శాంతి సద్భావన దీక్షలో ఆయన టీఎన్జీవో నేత దేవీప్రసాద్, తదితరులతో కలిసి పాల్గొన్నారు.
శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలి: ఈటెల
సెప్టెంబర్ 7న నిర్వహించే శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరు తూ సోమవారం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిజాం కళాశాల నుంచి ర్యాలీని తలపెట్టారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ మాట్లాడుతూ నగరంలో సీమాం ధ్రుల బహిరంగ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు తెలంగాణవాదులు తలపెట్టిన శాంతి ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే శాంతిర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు టీఆర్‌ఎస్ నాయకులను అరెస్టుచేశారు.
నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో ‘హైదరాబాద్ హమారా’ పేరిట శాంతిర్యాలీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో సోమవారం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సద్భావన ర్యాలీ జరిగింది. విద్యార్థులు భారీ సంఖ్య లో పాల్గొని, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. టీవీవీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఎన్జీవోలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రెబ్బెన, ఖానాపూర్ మండల కేంద్రాల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ నెల 30న మంచిర్యాలలో భారీ శాంతిర్యాలీకి సన్నాహకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవిందరెడ్డి, సీపీఐ, బీజేపీ, న్యూడెమెక్రసీ, టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. హమారా హైదరాబాద్ నినాదంతో టీఆర్‌ఎస్వీ, టీఎస్‌జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నాయకులు మాట్లాడారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, అది ఎన్నటికీ తెలంగాణకే సొంతమని పేర్కొన్నారు.
న్యాయవాదులపై దాడులు, అరెస్టులకు నిరసన
న్యాయవాదులపై దాడులు, ఎమ్మెల్యేల అరెస్టులకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలో సోమవారం న్యాయవాదులు, టీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాస్తారోకో చేపట్టారు. దీంతో వరంగల్, హైదరాబాద్ ప్రధానరహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు. అరెస్టులను నిరసిస్తూ హన్మకొండ చౌరస్తా, మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకుర్తిలో తెలంగాణవాదులు ధూంధాం నిర్వహించారు. న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ వరంగల్‌లో కోర్టులో విధులు బహిష్కరించి అదాలత్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనగామలో న్యాయవాదులు స్థానిక కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ములుగురోడ్డులో విద్యుత్ కార్మికులు సమైక్యవాదుల దిష్టిబొమ్మను దహ నం చేసి నిరసన వ్యక్తం చేశారు. డీజీపీ దినేష్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యమానికి అండగా నిలుస్తున్నారని పేర్కొంటూ టీజేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. న్యాయవాదులను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొంటూ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు డీజీపీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా నగరంలోని నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నగరంలో పొట్టిశ్రీరాములు విగ్రహం ముందు రోడ్డుపైనే న్యాయవాదులు మానవహారం నిర్మించారు. కొన్ని పత్రికల ప్రతుల ను దహనం చేశారు. రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో న్యాయవాది జేఏసీ నాయకులు పి.పి.రాజేందర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి దేవిదాస్, ఉపాధ్యక్షులు రవీందర్, కోశాధికారి వెంకట్మ్రణగౌడ్, కల్పన, కవితరెడ్డి, టిఆర్‌ఎస్ మధు, ఈగ గంగారెడ్డి, దయాకర్‌గౌడ్, న్యాయవాదులు పాల్గొన్నారు.