- ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు
- నియంత్రణకు ఆంక్షల కొరడా తీస్తున్న పోలీసులు
విజయవాడ సిటీ : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కసరత్తుచేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను కఠిన తరం చేయడంతోపాటు ప్రమాదాలకు కారణమైన వారిని జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఇక నుంచి ప్రమాదానికి కారణమైన వారి డ్రైవింగ్ లెసైన్సును సస్పెండ్ చేయించేందుకు సిఫార్సుచేయనున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రహదారులు రక్తమోడుతున్నాయి. నెలకు సగటున 27 మంది వరకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతున్నారు. అంతే సంఖ్యలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రులపాలవుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనచోదకులే కావడం గమనార్హం. అస్తవ్యస్త రహదారులు, నైపుణ్యం లేని డ్రైవింగ్, వాహన చోదకుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు జరిగి, అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. తగిన నైపుణ్యం లేకుండా డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు మరో కారణం. ఇవేకాక మృత్యువాత పడిన వారిలో అధిక శాతం మంది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా ఆంక్షల కొరడా ఝళిపించేందుకు కమిషనరేట్ అధికారులు సిద్ధమవుతున్నారు.
డ్రైవింగ్ లెసైన్స్ సస్పెన్షన్
నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి లెసైన్స్ సస్పెన్షన్‌కు సిఫారసు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రవాణాశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే సమయంలో జరిమానాలకు బదులు జైలుశిక్ష విధించేలా న్యాయస్థానాలతో సంప్రదింపులకు చర్యలు చేపడుతున్నారు. గతంలో మాదిరి రోడ్డు ప్రమాదాల్లో పెద్ద వాహనాల డ్రైవర్లపై కేసులు నమోదు చేయకుండా తప్పు చేసిన వారిపైనే కేసులు నమోదు చేయనున్నారు. మానవతా దృక్పథంతో కేసులు నమోదు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికి పెరుగుతుందనేది పోలీసు అధికారుల అభిప్రాయం. నడిచి వెళ్లేవారు నిబంధనలు పాటించకున్నా కేసులు నమోదు చేయడంతో పాటు విచారణలో మృతులు, క్షతగాత్రులు తప్పు చేసినట్టు రుజువైతే వారిపైనే కేసులు నమోదు చేస్తారు.
ఇక విచారణ బాధ్యత ఎస్‌హెచ్‌వోదే..
రోడ్డు ప్రమాదాలు జరిగిప్పుడు ఇక నుంచి పోలస్ స్టేషన్ అధికారి(ఎస్‌హెచ్‌వో) క్షేత్రస్థాయి విచారణ జరపాలని కమిషనరేట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాద మృతి కేసులే కాకుండా తీవ్రంగా గాయపడిన సందర్భాల్లో ఎస్‌హెచ్‌వో వెళ్లి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిగా విచారణ చేయాలి. ప్రమాదం జరిగిన తీరు, ప్రమాద కారణాలు, తప్పు చేసిన వారెవనే విషయాలపై పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతనే కేసులు నమోదు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోను దిగువస్థాయి అధికారులతో కాకుండా స్టేషన్ ఉన్నతాధికారులు మాత్రమే విచారణ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
లెసైన్స్‌కు ప్రమాదం
Published Thu, May 21 2015 3:35 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement