ఏజెన్సీ గ్రామాల్లో నిఘా పెంచిన పోలీసు బలగాలు
Published Thu, Aug 29 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
మక్కువ/కొమరాడ/గుమ్మలక్ష్మీపురం, సాలూరు రూరల్ న్యూస్‌లైన్: ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ అలజడి నెలకొంది. ఏజెన్సీ గ్రామాలు భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొంతకాలంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఏఓబీ మళ్లీ పోలీస్ బలగాల బూట్ల చప్పుళ్లు తుపాకీ శబ్దాలతో మారుమోగుతోంది. సాలూరు మండలం పాచిపెంట సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు మంగళవారం పంజా విసిరి నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లను బలితీసుకోవడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టులు సంఘటన స్థలం నుంచి ఒడిశాలోని నారాయణపట్న ప్రాంతం వైపు వెళ్లే అవకాశముండండంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు గాలింపు ముమ్మరం చేశారు. మక్కువ మండల కేంద్రంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలు బుధవారం ఆర్‌వోపీ(రోడ్ ఓపెనింగ్ పార్టీ) ముమ్మరంగా నిర్వహించారు.
మక్కువ మండలం ఒడిశాకు సమీపంలో ఉన్నందున, గతంలో పలుమార్లు మావోయిస్టులు ఈ ప్రాం తంలో తమ ఉనికిని చాటుకోవడంతో పోలీసులు గట్టి నిఘా వేశారు. అలాగే కొమరాడ మండలం ఏఓబీని ఆనుకుని ఉండడంతో పెద్ద ఎత్తున బల గాలు మోహరించి ప్రత్యేక బలగాలతో ఉద్ధృతంగా గాలింపుచర్యలు చేపడుతున్నారు. ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివర కు ప్రశాంతంగా కొండశిఖరాల్లో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుమ్మలక్ష్మీపురం ఏజె న్సీలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గుమ్మలక్ష్మీపురం,ఎల్విన్‌పేట గ్రామాల్లో బుధవారం జరిగి న సమైక్యాంధ్ర శంఖారావం కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహించారు.
అనంతరం ఎల్విన్‌పేట,తదితర ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టారు. వచ్చిపోయే వాహనాలను పోలీ సులు క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లానుంచి ఒడిశాకు, ఒడిశా నుంచి జిల్లాకు వస్తున్న ప్రతి వాహనాన్ని సాలూరులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాలూరు మండలంలో కొదమ, గంజాయిభద్ర, సంపంగిపాడు, డెన్సరాయి, జిల్లేడువలస, కరడువలస, పట్టుచెన్నారు,పగులుచెన్నారు. పంచాయతీల్లో ఉన్న అనేక గ్రామాలు ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాయి. పాచిపెంట మండలంలో అజూరు ఒడిశా రాష్ట్రానికి అతి సమీపంలో ఉంది. దీంతో ఈ గ్రామాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఒక పక్క జిల్లాలో మావోయిస్టుల అలజడి లేదని పోలీసులు చెబుతుంటే, మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నారు.
Advertisement
Advertisement