తాండూరు, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రెండు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఒకటి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌లపై ఇస్తున్న వడ్డీని మించి అధిక వడ్డీ చెల్లించే పథకం. రెండోది హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలో వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో గృహనిర్మాణాలకు రుణాల మంజూరు స్కీం. ఈ రెండు పథకాలు కేవలం రైతులకే కాదు.. ఉద్యోగులు, వ్యాపారులు ఎవరికైనా వర్తిస్తాయి. ఆదివారం తాండూరులో డీసీఎంఎస్ దాల్‌మిల్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ పి.లక్ష్మారెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో కొత్తగా ప్రారంభించనున్న ఈ రెండు పథకాల వివరాలను వెల్లడించారు.
19న పాలకమండలి సమావేశంలో నిర్ణయం
వికారాబాద్‌లోని శ్రీ అనంతపద్మనాభస్వామి వారి పేరిట డీసీసీబీలో త్వరలో డిపాజిట్‌లపై అధిక వడ్డీ పథకం ప్రారంభించనున్నట్టు చైర్మన్ లకా్ష్మరెడ్డి తెలిపారు. డీసీసీబీలో డిపాజిట్‌చేసే మొత్తాలపై జాతీయ బ్యాంకుల కన్నా అధిక వడ్డీ చెల్లిస్తామన్నారు. రైతులతో పాటు వ్యాపారులు ఎవరైనా ఈ పథకం కింద డిపాజిట్ చేసుకోవచ్చన్నారు.
డిపాజిట్‌లపై 10శాతానికి పైగా వడ్డీ చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెప్పారు. ఈ అధిక వడ్డీ పథకంపై నాబార్డుతో పాటు రిజర్వు బ్యాంకులకు లేఖ రాశామన్నారు. ఈ పథకం కాలపరిమితి తదితర పూర్తి అంశాలపై ఈ నెల 19వ తేదీన పాలకమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ పథకంలో నిర్దేశించిన సమయం మేరకు చేసిన డిపాజిట్‌లకే అధిక వడ్డీ వర్తిస్తుందన్నారు. సేకరించిన డిపాజిట్‌లపై మాత్రం 10శాతం వడ్డీ చెల్లిస్తామన్నారు. సంస్థ లాభాల, నష్టాలతో సంబంధం లేకుండా కాలపరిమితి ముగిసిన డిపాజిట్‌లపై వడ్డీ చెల్లించడం జరుగుతుందన్నారు. డీసీసీబీ నుంచి తీసుకున్న రుణాలకు 13శాతం వడ్డీ వసూలు చేస్తామని ఆయన వివరించారు. వడ్డీ రూపంలో వచ్చే లాభాలతో రైతుల వాటాధనం రాయితీ శాతాన్ని అధికం చేస్తామన్నారు.
మున్సిపాలిటీల్లో గృహరుణాలు
హైదరాబాద్ సిటీ, వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో నివసించే వారికి సహకార బ్యాంకు ద్వారా గృహ రుణాలను అందించాలని యోచిస్తున్నట్టు లకా్ష్మరెడ్డి చెప్పారు. స్థలం విలువ, ఇంటి నిర్మాణ అంచనా వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని గృహ రుణాలను అందిస్తామన్నారు. ఈ నెల 13వ తేదీన పాలకమండలి సమావేశంలో గృహ రుణాల మంజూరుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వ్యాపారులు, ఉద్యోగులు అన్ని వర్గాలకూ గృహరుణాలు ఇస్తామన్నారు. రూ.10కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలనుకుంటున్నామని, ప్రాధాన్యం హైదరాబాద్ సిటీవాసులకే ఇస్తామన్నారు.
అసైన్డ్‌దారులకూ...
అసైన్డ్‌దారులకూ దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయనున్నామని డీసీసీబీ చైర్మన్ చెప్పారు. ఇతర బ్యాంకుల్లో రుణ బకాయిలు లేవని అసైన్డ్‌దారులు ధ్రువీకరణ పత్రాలు చూపితే వారికి రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఖరీఫ్‌లో రూ.150కోట్లు పంటరుణాలు ఇవ్వాలని లక్ష ్యంగా పెట్టుకున్నామన్నారు. గడిచిన రబీలో సుమారు రూ.97కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. వచ్చే మే చివరినాటికి బకాయిలు వసూలు చేసి, ఖరీఫ్ రుణాలు మంజూరు చేస్తామన్నారు.
రూ.కోటి వసూలు...
గతంలో రుణ బకాయిలు చెల్లించని 265మంది రైతులకు ఆస్తులు వేలం వేస్తామని డీసీసీబీ నోటీసులు జారీ చేయగా, వారిలో 75శాతం మంది స్పందించి రూ.కోటి మేర బకాయిలు చెల్లించారని చైర్మన్ లకా్ష్మరెడ్డి తెలిపారు. డీసీసీబీలో రూ.360కోట్ల డిపాజిట్‌లు ఉన్నాయని, గత ఏడాది రూ.1.64కోట్ల లాభాలు వచ్చాయని, ఈ సారి రెట్టింపు లాభాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
డీసీసీబీలో లావాదేవీలు చేస్తేనే రుణాలు
ఇస్తున్న రుణాలు డీసీసీబీవి కావని..రైతుల డబ్బులని ఆయన గుర్తు చేశారు. బ్యాంకుకు లాభాలు రాకపోతే రైతులకు ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) తమ బ్యాంకు ఖాతాలు, డిపాజిట్‌లు ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ డీసీసీబీలోనే నిర్వహిస్తూ సహకరిస్తేనే డీసీఎంఎస్‌కు రుణాలు మంజూరు చేస్తూ డీసీసీబీ సహకరిస్తుందని లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. సహకార బ్యాంకులకు లాభాలు వస్తేనే..రైతులకూ లాభాలు వస్తాయని అన్నారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే డీసీఎంఎస్‌కు ఎంత రుణమైనా ఇస్తామన్నారు.
కందుల కొనుగోలుకు రూ.50లక్షలు
డీసీఎంఎస్‌కు కందుల కొనుగోలుకు రూ.50లక్షల రుణం ఇస్తున్నట్టు డీసీసీబీ చైర్మన్ లకా్ష్మరెడ్డి చెప్పారు. అత్తాపూర్‌లో డీసీఎంఎస్‌కు మాదిరిగానే డీసీసీబీకి 400గజాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.