the municipality
-
భవిష్యత్ బాధలు
జిల్లాలోని పంచాయతీ కార్మికులకు కష్టం వచ్చింది. రెండు సంవత్సరాలు అధికారులు పంచాయతీ పీఎఫ్(భవిష్య నిధి) లావాదేవీలు నిలిపివేశారు. దీంతో ఉద్యోగ భద్రతపై 1,202 మంది ఆందోళన చెందుతున్నారు. 2012 నుంచి పంచాయతీ అధికారులు కార్మికులతో 12 శాతం పీఎఫ్ వాటా కట్టించుకున్నారు. 1,202 మంది కార్మికులు రెండు సంవత్సరాలపాటు వాటా చెల్లించారు. 2014 నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. జీవో 505 ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పంచాయతీల పరిధిలో కాకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. దీంతో కార్మికులు కోర్టును ఆశ్రయించారు. తిరిగి పంచాయతీ పరిధిలోనే కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ తరువాత పంచాయతీ అధికారులు కార్మికుల పీఎఫ్ లావాదేవీలను నిలిపివేశారు. కార్మికులు పీఎఫ్ వాటాను ఇచ్చే ప్రయత్నం చేసినా అధికారులు తీసుకోవడం లేదు. రెండు సంవత్సరాలు పీఎఫ్ కట్టించుకుని ఇప్పుడు ఎందుకు నిలిపివేస్తున్నారంటూ కార్మికులు అడిగినా అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఈ సమస్యపై జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు. దీంతో వారు ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 1,363 పంచాయతీలు ఉన్నాయి. 98 పంచాయతీల పరిధిలో 834 పారిశుధ్య కార్మికులు, 300 మంది పంపు ఆపరేటర్లు, 36 గురు ఎలక్ట్రీషియన్లు, 30 మంది డ్రైవర్లు మొత్తం 1202 మంది ఉన్నారు. వీరంతా 1984 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. 2012లో వచ్చిన జీవో నంబర్ 11 ప్రకారం వీరికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు స్కిల్డ్ లేబ ర్కు రూ.10,079, అన్‌స్కిల్డ్‌కు రూ.8,079, సెమీస్కిల్డ్ వారికి రూ.5,579 ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని 14 మేజర్ గ్రామపంచాయతీల పరిధిలో మాత్ర మే జీవో నంబర్ 11 అమలుచేస్తామని, 19 పంచాయతీల్లో రూ.5,050 ఇస్తామని మరికొన్ని పంచాయతీల్లో రూ4,600 ప్రకా రం జీతాలు చెల్లిస్తామని 2013లో జిల్లా పంచాయతీ అధికారులు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కరువు భత్యం ఇస్తామని చెప్పారు. ప్రధానంగా పీఎఫ్, ఈఎస్ఐ అమలుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు. పలుమార్లు కార్మికుల వినతి మేరకు పీఎఫ్ వాటా తీసుకునేలా అన్ని పంచాయతీలకు తిరిగి ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల డీపీవో వారికి హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకూ ఆ హామీ అమలు కాలేదని గ్రామ పంచాయతీ కార్మిక యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి వెంకట్రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం పీఎఫ్‌తో పాటు ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీంతో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే పీలేరు, రేణిగుంట, బీ.కొత్తకోట పంచాయతీలు త్వరలోనే మున్సిపాలిటీలుగా మారే అవకాశం ఉన్నందున 175 మంది పంచాయతీ కార్మికులు వీధిన పడుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనకు దిగుతామన్నారు -
అంతా ఆన్లైన్
10 అంశాలపై వివరాలు సేకరిస్తున్న మున్సిపాలిటీలు జన్మభూమిలో వచ్చిన వినతులూ నమోదు ఏ శాఖకు ఆ శాఖే క్రోడీకరణ అబద్వేలు : మున్సిపాలిటీలకు సంబంధించి ఏ సమాచారమైనా ఇక నుంచి ఆన్లైన్లోనే లభించనుంది. సూక్ష్మ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల సమాచారాన్ని వార్డుల వారీగా సేకరించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. పది అంశాలతో కూడిన సంక్షిప్త సమాచారాన్ని అన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ సమాచారంపై నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలోని ఏ శాఖకు సంబంధించి వివరాలు ఆ శాఖే సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలి. జన్మభూమిలో ఈ వివరాలను సేకరించేందుకు నమూనాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. అన్ని శాఖల అధికారులు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి వాటిని అన్లైన్లో నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయా శాఖలు చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి సూక్ష్మ ప్రణాళిక తయారు చేసేందుకు ఈ సమాచారం కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. నమోదు చేస్తున్న అంశాలివే పురపాలక సంఘాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ప్రజలు నుంచి వచ్చిన వినతులు, రేషన్‌కార్డులు, వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు, పింఛన్ల విన్నపాలు తదితర వివరాలు. మెప్మా ప్రాజెక్టు కింద ఉండే స్వయం సహాయక సంఘాలు, సంఘాల్లోని మహిళలు నిర్వహించే వ్యాపారాలు, కార్యకలాపాలు, మా ఇంటి మహలక్ష్మి లబ్ధిదారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలు, వాటి వినియోగం. నీటి కుళాయిలు, నీటి సరఫరా, పైపులైన్ లీకేజీలు, సిమెంట్ రోడ్లు, కాలువలు, కల్వర్టులు, వీధి దీపాలు తదితర వివరాలు. మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధులు, కాలువల పరిశుభ్రత, పారిశుద్ధ్య మెరుగునకు తీసుకుంటున్న చర్యలు. పట్టణ ప్రణాళిక విభాగం కింద మున్సిపాలిటీ పరిధిలోని వృక్షాల వివరాలు, ఇటీవల నాటిన మొక్కల వివరాలు, వాటి రక్షణ చర్యలు. వార్డుల్లోని పాఠశాలలు, వాటిలో ఉండే వసతులు, విద్యార్థుల సంఖ్య, బడి బయట ఉన్న పిల్లల వివరాలు, పట్టణంలోని విద్యావంతులు, ఐఐటీ, డిప్లమో చేసిన వారి సంఖ్య, వృత్తి విద్యా నిపుణులు, ఇతర దేశాల్లో ఉంటున్న వారు, ఉద్యోగులు, నిరుద్యోగులు వారి నివాసం వివరాలు. అంగన్వాడీ కేంద్రాలు, వాటిల్లోని పిల్లల వివరాలు, గర్భిణులు, వారి ఆరోగ్య స్థితిగతులు.. బలహీనంగా ఉన్న చిన్నారుల సంఖ్య, ఇతర జబ్బులతో బాధ పడుతున్న వారి సంఖ్య . పశుసంవర్ధక శాఖ పరిధికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని ఆవులు, గేదెలు, గొర్రెలు, పొట్టేళ్లు, కోళ్ల వివరాలు. రోజు జరిగే పాల ఉత్పత్తి, వాటిని ఏయే పాలకేంద్రాలకు తరలిస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. -
జన్మభూమిలో కమిటీలకు ప్రాతినిథ్యం
పలమనేరు: ఇన్నాళ్లు పింఛన్ల కమిటి, ఇప్పుడేమో జన్మభూమి కమిటి ఇది అధికార పార్టీ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు. జిల్లా స్థాయిలో జన్మభూమిలో ప్రాతినిథ్యం ఉండే లా ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలందా యి. జిల్లా కమిటీలతో పాటు మున్సిపల్, మండలాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. వీరు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేలా రాష్ట్ర ప్రణాళికా విభాగం నుంచి జీవో నెంబర్ 22 పేరిట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి సంబంధించి సూక్ష్మప్రణాళికల తయా రీ, స్వర్ణ గ్రామ పంచసూత్రాలు (ఎస్జీపీఎస్), పట్టణ స్థాయిలో స్వర్ణ పురపాలక పంచసూత్రాలు (ఎస్పిపిఎస్) తదితర కార్యక్రమాల రూపకల్పనకు కమిటీలు దోహదం చేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా మంత్రి చైర్‌పర్సన్‌గానూ, కలెక్టర్, సీఈవో జెడ్పీ, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, డీపీవో, మెప్మా పీడీ, సీఈవో, డీఎంఅండ్‌హెచ్‌వో, అనిమల్ హస్బెండరీ జేడీతో పాటు స్పెషల్ ఇన్వైటీలుగా కలెక్టర్ సూచించిన వ్యక్తులతో ఈ కమిటీని రూపొందించనున్నారు. జీపీ, మండలం, మున్సిపాలిటీల్లోనూ.. గ్రామ పంచాయతీ కమిటీలో సర్పంచ్ అధ్యక్షులుగా, ఎంపీటీసీ, ఇద్దరు గ్రూపు సభ్యులు, ఇద్దరు సోషియల్ యాక్టివిస్ట్‌లు మెంబర్లుగా ఉంటారు. మున్సిపాలిటీ వార్డు లో కౌన్సిలర్ అధ్యక్షులుగా, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సోషియల్ యాక్టివిస్ట్‌లు, ఓ బిల్ కలెక్టర్ మెంబర్లుగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్లలో కార్పొరేటర్ అధ్యక్షులుగా, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సోషియల్ యాక్టివిస్ట్‌లు, ఓ బిల్ కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో ఎంపీపీ అధ్యక్షులుగా జెడ్పిటీసీతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లు, ఓ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, ఇద్దరు సోషియల్ యాక్టివిస్ట్‌లు సభ్యులుగా ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలో చైర్పర్సన్ అధ్యక్షులుగా, ఓ కౌన్సిలర్, ముగ్గురు సోషియల్ యాక్టవిస్ట్లు సభ్యులుగా, మున్సిపల్ కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారు. మరింత అధికార జోక్యం.. ఇప్పటికే పింఛన్ల కమిటీల కారణంగా జన్మభూమి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక జన్మభూమి కమిటీల పేరిట సోషియల్ యాక్టివిస్ట్‌ల నెపంతో అధికార టీడీపీ నాయకులు అడ్డదారిన అధికారాన్ని చెలాయిం చేందుకు మార్గం సుగమమైనట్టే. ఫలితంగా అధికారుల ప్రమేయం తగ్గి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే జన్మభూమి పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా మారడం ఖాయమని తెలుస్తోంది. -
విధులకు హాజరై మూడేళ్లు...
గుడివాడ మున్సిపాలిటీ నిర్వాకం గుడివాడ : ఆయన గుడివాడ మున్సిపల్ హెడ్‌వాటర్ వర్క్స్‌లో ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్.. విధులకు హాజరై మూడేళ్లు దాటింది. ఆయనకు వాటర్ వర్క్స్ ఏఈ, డిఈల అండదండలు ఉన్నాయనే విమర్శలున్నాయి. ఓ బినామీ వ్యక్తితో తన విధులను చేయించి నెలనెలా జీతం తీసుకుంటాడు. గుడివాడ మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ తంతు గురించి తెలిసినా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి. విధులకు హాజరై మూడేళ్లు ... గుడివాడ మున్సిపల్ హెడ్ వాటర్ వర్స్క్లో ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్‌గా మున్సిపల్ పర్మినెంట్ ఉద్యోగి తలపంటి వెంకటేశ్వరరావు విధులు నిర్వర్తిస్తున్నాడు. హెడ్ వాటర్ వర్క్స్‌లో మూడు షిప్టుల్లో ముగ్గురు ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్లు పనిచేయాల్సి ఉంది. ఇందులో ఇద్దరు మాత్రం సాంకేతిక అర్హత కలిగిన కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తారు. మూడో వ్యక్తిగా మున్సిపల్ పర్మినెంట్ ఉద్యోగి తలపంటి వెంకటేశ్వరరావు పనిచేయాల్సి ఉంది. అయితే మూడేళ్ల క్రితం ఇక్కడ ఒక యువకుడికి నెలకు రూ.5వేలు ఇచ్చి తన డ్యూటీ చేయడానికి అనధికారికంగా నియమించుకున్నాడు. హాజరు పట్టీలో కూడా ఆ యువకుడే తలపంటి వెంకటేశ్వరరావు సంతకాన్ని పెడతాడని తెలిసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్ అంటే గుడివాడ పట్టణంలో లక్షా30వేల మంది తాగే మంచినీటిని శుద్ధిపరచి అందించే వ్యక్తి. ఇంతటి బాధ్యతాయుతమైన ఉద్యోగాన్ని అవగాహన లేని ఓ బినామీ యువకుడి చేత చేయిస్తుండడంతో పలుమార్లు తమకు మురికినీరు వస్తుందని ప్రజలు ఫిర్యాదు చేశారు. కనీస అర్హత లేని వారు విధులు నిర్వహించడంతో నీరు సరిగా శుద్ధిగాక రోగాల బారిన పడుతున్నామని చెప్పినా అధికారులకు చీమకుట్టినట్లయినా లేదని చెబుతున్నారు. చిరుతాయిలాల కక్కుర్తే కారణమా... హెడ్ వాటర్ వర్క్స్‌లో పనిచేసే సిబ్బంది విధులు సరిగా నిర్వర్తిస్తుంది లేనిదీ ఎప్పటి కప్పుడు పర్యవేక్షించే వాటర్ వర్క్స్ ఏఈ, డీఈలకు ఈ బినామీ వ్యవహారం తెలుసని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈఏడాది మార్చిలో మున్సిపల్ డిఈ ఫిల్టర్బెడ్లను పరిశీలించటానికి వచ్చి ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్ తలపంటి వెంకటేశ్వరరావు స్థానంలో మరో యువకుడు పనిచేస్తున్నాడని మూవ్మెంటు రిజిష్టర్‌లో నమోదు చేశాడు. అయినా ఇంతవరకు చర్య లు లేవని చెబుతున్నారు. నాదృష్టికి రాలేదు.. ఈవిషయమై మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈవిషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాతు
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : పురపాలక సంఘ ఎన్నికల్లో నిర్వహిస్తున్న బందోబస్తులో భాగంగా పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ కవాతు నిరహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు రాందాస్ చౌరస్తా, పాత బస్టాండ్, పిల్లిడి, మార్కెట్, పెద్ద బజార్, పిట్లం బెస్ మీదుగా చమన్ చౌరస్తా, భారత్ గ్యాస్ రోడ్, హెడ్ పోస్టాఫీస్, బస్ డిపో వరకు సాగింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని 16 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించినందున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కవాతులో పట్టణ ఎస్ఐ హన్మంతు, ఏఎస్ఐ రాజశేఖర్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
పోటాపోటీగా నామినేషన్లు
నేడు పరిశీలనఆరు మున్సిపాలిటీల్లో 169 వార్డులకు 1322 నామినేషన్లు శ్రీకాళహస్తి నామినేషన్లలో గందరగోళం వైఎస్సార్సీపీ ధర్నా సాక్షి, చిత్తూరు : జిల్లాలో ఆరు మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. గడువు సమయం ముగిశాక శ్రీకాళ హస్తిలో కాంగ్రెస్ పార్టీ వారు నామినేషన్ దాఖలు చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ ధర్నా చేసి నిరసన తెలియజేసింది. ఈ సంఘటన మినహా నామినేషన్ల ఘట్టం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నగరి, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె మున్సిపాలిటీల్లో 169 వార్డులకు ఐదురోజుల్లో (10 నుంచి 14వ తేదీ వరకు) 1322 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిల్లో రెండు సెట్లు, మూడు సెట్లు వేసినవారూ ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు 446 మంది, టీడీపీ అభ్యర్థులు 496 మంది, స్వతంత్రులు 253 మంది పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు డబుల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ 70, బీజేపీ 25 వార్డులకు మాత్రమే అభ్యర్థులను నిలిపాయి. వామపక్షపార్టీల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. సీపీఎం 12, సీపీఐ 13 వార్డులకు అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ 4, ఎంఐఎం 3 స్థానాలకు నామినేషన్లు వేశాయి. కాంగ్రెస్‌కు ఘోర పరాభవం.. రాష్ర్ట విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వార్డు కౌన్సిలర్లుగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగేందుకు నేతలు సాహసించలేదు. అవసరమనుకుంటే పార్టీలు మారి నిలబడ్డారు. ఇంకొందరు స్వతంత్రంగా నామినేషన్ వేశారు. అక్కడక్కడా నిలబడిన కాంగ్రెస్ వారి సంఖ్య ఆరు మున్సిపాలిటీల్లోనూ 25 మాత్రమే. తొలిసారి బరిలో ఎంఐఎం రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లా స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయలేదు. అయితే తొలిసారిగా పార్టీని విస్తరించేందుకు మైనార్టీలకు పట్టున్న మదనపల్లె నుంచి ఇద్దరు అభ్యర్థులను కౌన్సిలర్లుగా బరిలోకి దింపింది. నేడు నామినేషన్లు పరిశీలన.. ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు. ఈ నెల 18న నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రదర్శిస్తారు. పుత్తూరు మున్సిపాల్టీలో పుత్తూరు మున్సిపాలిటీలోని 24 వార్డులకు 196 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవారం 115 నామినేషన్లు వేశారు. ఐదు రోజుల్లో వైఎస్ఆర్సీపీ 86, టీడీపీ 78, స్వతంత్రులు 22, సీపీఎం 4, సీపీఐ 2, బీజేపీ 2 నామినేషన్లు తమ అభ్యర్థులతో వేయించాయి. నగరి మున్సిపాలిటీలో.. మొత్తం 27 వార్డులకు 186 నామినేషన్లు వచ్చాయి. చివరిరోజు శుక్రవారం అత్యధికంగా 107 నామినేషన్లు వేశారు. వైఎస్ఆర్సీపీ 70, టీడీపీ 75, స్వతంత్రులు 24, సీపీఐ 3, బిజేపీ 2, బీఎస్పీ 2 నామినేషన్లు తమ అభ్యర్థులతో వేయించాయి. మదనపల్లెలో మదనపల్లెలోని 35 వార్డులకు 373 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు 194 వచ్చాయి. వైఎస్ఆర్సీపీ 115, టీడీపీ 135, స్వతంత్రులు 103, బీజేపీ 12, ఎంఐఎం 2, బీఎస్పీ 1, సీపీఐ 3, కాంగ్రెస్ 1 నామినేషన్లు వేయించాయి. పలమనేరులో పలమనేరులోని 24 వార్డులకు 171 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు శుక్రవారం 87 వేశారు. వైఎస్ఆర్సీపీ 56, టీడీపీ 61, కాంగ్రెస్ 9, స్వతంత్రులు 37, బీజేపీ 2, సీపీఎం 1, సీపీఐ 2 నామినేషన్లు వేయించాయి. పుంగనూరులో పుంగనూరులోని 24 వార్డులకు 163 నామినేషన్లు వచ్చాయి. చివరిరోజు అత్యధికంగా 105 నామినేషన్లు వేశారు. ఐదు రోజుల్లో వైఎస్ఆర్సీపీ 65, టీడీపీ 64, స్వతంత్రులు 30, కాంగ్రెస్ 2, బీజేపీ 1, బీఎస్పీ 1, సీపీఎం 2 నామినేషన్లు వేయించాయి. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తిలోని 35 వార్డులకు 247 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం 154 వుంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైఎస్ఆర్సీపీ 53, టీడీపీ 71, కాంగ్రెస్ 56, స్వతంత్రులు 52, సీపీఐ 3, సీపీఎం 5, ఎంఐఎం1, బీజేపీ 6 నామినేషన్లు వేయించాయి. -
మున్సిపల్ ఎన్నికలకు రెడీ
సాక్షి, చిత్తూరు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఏది ఏమైనా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారుల్లో కదలిక మొదలైంది. ఏ క్షణంలో నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు నిర్వహిం చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా మున్సిపల్ కమిషనర్లు చెబుతున్నారు. జిల్లాలో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు, శ్రీకాళహస్తి, మదనపల్లె,పుంగనూరు, నగరి, పలమనేరు, పుత్తూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో తిరుపతి కార్పొరేషన్‌కు మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయి. మిగిలిన మున్సిపాలిటీలు, చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఆటంకం లేదని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి కార్పొరేషన్‌కు సమస్యే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఆరు నెలలు క్రితం ప్రభుత్వం తిమ్మినాయుడు పాళ్యం, రాజీవ్‌నగర్, ఎం.ఆర్.పల్లె పంచాయతీలను విలీనం చేసింది. వీటిని డివిజన్లుగా చేయాలంటే ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లలోనే కలపాలి. కొత్తగా డివిజన్ల ఏర్పాటుకు అవకాశం లేదు. దీంతో తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలంటే సమస్యలు ఉన్నాయని అధికారులకు తెలియజేసినట్టు సమాచారం. మిగిలిన మున్సిపాలిటీలకు ఓకే చిత్తూరు కార్పొరేషన్లో డివిజన్ల విభజన ఏర్పాటు సమయంలోనే పూర్తి చేయడంతో ఇక్కడ ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. పుంగనూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేసుకున్నారు. -
గల్ల్లీగల్లీలో గలీజే..
నగరంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారమే.. పూర్తిగా స్తంభించిన పారిశుద్ధ్యం పట్టువదలని కార్మికులు.. మెట్టు దిగని ప్రభుత్వం శ్రీనగర్‌కాలనీ,న్యూస్‌లైన్: కనీసవేతనాల పెంపు, మధ్యంతభృతి ఇవ్వాలని, ఆరోగ్యకార్డులు తదితర డిమాండ్లతో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె నగరంలో ఉద్ధృతమైంది. అన్ని కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టడంతో నగర వీధులన్నీ అధ్వానంగా మారాయి. రోడ్లు ఊడ్చేవారు లేరు..చెత్త ఎత్తేవారు కరువయ్యారు..డ్రైనేజీలు పట్టించుకునే పరిస్థితి లేదు. నీళ్లన్నీ రోడ్లపైకొచ్చి గలీజుగా మారుతున్నాయి. గల్లీల్లోనే కాకుండా ప్రధానమార్గాల్లో చెత్తకంపు కొడుతోంది. గుట్టగుట్టలుగా పేరుకుపోతున్న చెత్తతో వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. కార్మికులు సమ్మెకు దిగడంతో చెత్తను తరలించే వాహనాలు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు చెబుతున్నా..అమలులో ఎక్కడా కనిపించ డం లేదు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని కార్మికులు చెబుతుంటే..సమస్యను మంత్రి సమక్షంలో సోమవారం పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మెకు మద్దతుగా ఆదివారం నగరంలోని ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఖైరతాబాద్ చౌరస్తాలో రాస్తారోకో : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం ఖైరతాబాద్ చౌరస్తాలో బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ తదితర 9 సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పెద్దఎత్తున కార్మికులు చేరుకొని ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఎంఎస్ నాయకుడు శంక ర్, సీఐటీ యూ రాష్ట్రకార్యదర్శి పాలడుగు భాస్కర్లు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల మంది కార్మికులు మున్సిపాలిటీ, సంబంధిత శాఖల్లో పనిచేస్తున్నా వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.12,500 కనీస వేతనం పెంచుతామని ప్రభుత్వం హామీఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. పారిశుధ్యంపై మేయర్ సమీక్ష సిటీబ్యూరో: సమ్మె నేపథ్యంలో మేయర్ మాజిద్‌హుస్సేన్ జీహెచ్ఎంసీ అధికారులు, ఆయా పార్టీల ఫోర్ల్లీడర్లతో ఆదివారం సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడం వల్ల నగరవాసుల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పరిస్థితి చేజారకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించాలని మేయర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కాగా పారిశుధ్య పనుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం బల్దియా కమిషనర్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు. నగరంలో పేరుకుపోయిన చెత్త తొలగింపును అధికారులతో కలిసి పరిశీలించారు. విధులకు వెళ్లి విగతజీవిగా.. కూకట్పల్లి: స్థానికులు,అధికారుల ఒత్తిళ్లతో ఓ పారిశుద్ధ్య కార్మికుడు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో దిగి ఊపిరాడక దుర్మరణం పాలయ్యాడు. ఎం.వెంకటయ్య(40) ఫతేనగర్‌లో ఉంటూ కూకట్పల్లి సర్కిల్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సమ్మె జరుగుతుండడంతో రెండురోజులుగా విధులకు దూరంగా ఉన్నాడు. కూకట్పల్లి దేవీనగర్‌లోని రోడ్డునెం.2లోని మ్యాన్‌హోల్ వద్ద మురుగునీరు సాఫీగా పోకపోవడంతో స్థానికులు,అధికారుల ఒత్తిడితో వెంకటయ్య తప్పనిసరి స్థితిలో మ్యాన్హోల్లోకి దిగాడు. శుభ్రం చేస్తుండగా ఊపిరాడక కాసేపటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు, కార్మిక సంఘాల నేతలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. యాక్సిడెంటల్ పాలసీ కింద రూ.4లక్షల మంజూరుతోపాటుఈఎస్ఐ,పీఎఫ్‌ల ద్వారా రూ.2 లక్షలు మంజూరుచేయనున్నట్లు వెస్ట్‌జోన్ కమిషనర్ ప్రకటించారు. మృతుడిది వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పోచంపల్లి. -
డీసీసీబీ నుంచి రెండు కొత్త పథకాలు
తాండూరు, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రెండు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఒకటి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీని మించి అధిక వడ్డీ చెల్లించే పథకం. రెండోది హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలో వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో గృహనిర్మాణాలకు రుణాల మంజూరు స్కీం. ఈ రెండు పథకాలు కేవలం రైతులకే కాదు.. ఉద్యోగులు, వ్యాపారులు ఎవరికైనా వర్తిస్తాయి. ఆదివారం తాండూరులో డీసీఎంఎస్ దాల్మిల్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ పి.లక్ష్మారెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో కొత్తగా ప్రారంభించనున్న ఈ రెండు పథకాల వివరాలను వెల్లడించారు. 19న పాలకమండలి సమావేశంలో నిర్ణయం వికారాబాద్‌లోని శ్రీ అనంతపద్మనాభస్వామి వారి పేరిట డీసీసీబీలో త్వరలో డిపాజిట్లపై అధిక వడ్డీ పథకం ప్రారంభించనున్నట్టు చైర్మన్ లకా్ష్మరెడ్డి తెలిపారు. డీసీసీబీలో డిపాజిట్‌చేసే మొత్తాలపై జాతీయ బ్యాంకుల కన్నా అధిక వడ్డీ చెల్లిస్తామన్నారు. రైతులతో పాటు వ్యాపారులు ఎవరైనా ఈ పథకం కింద డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. డిపాజిట్లపై 10శాతానికి పైగా వడ్డీ చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెప్పారు. ఈ అధిక వడ్డీ పథకంపై నాబార్డుతో పాటు రిజర్వు బ్యాంకులకు లేఖ రాశామన్నారు. ఈ పథకం కాలపరిమితి తదితర పూర్తి అంశాలపై ఈ నెల 19వ తేదీన పాలకమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పథకంలో నిర్దేశించిన సమయం మేరకు చేసిన డిపాజిట్లకే అధిక వడ్డీ వర్తిస్తుందన్నారు. సేకరించిన డిపాజిట్లపై మాత్రం 10శాతం వడ్డీ చెల్లిస్తామన్నారు. సంస్థ లాభాల, నష్టాలతో సంబంధం లేకుండా కాలపరిమితి ముగిసిన డిపాజిట్లపై వడ్డీ చెల్లించడం జరుగుతుందన్నారు. డీసీసీబీ నుంచి తీసుకున్న రుణాలకు 13శాతం వడ్డీ వసూలు చేస్తామని ఆయన వివరించారు. వడ్డీ రూపంలో వచ్చే లాభాలతో రైతుల వాటాధనం రాయితీ శాతాన్ని అధికం చేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో గృహరుణాలు హైదరాబాద్ సిటీ, వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో నివసించే వారికి సహకార బ్యాంకు ద్వారా గృహ రుణాలను అందించాలని యోచిస్తున్నట్టు లకా్ష్మరెడ్డి చెప్పారు. స్థలం విలువ, ఇంటి నిర్మాణ అంచనా వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని గృహ రుణాలను అందిస్తామన్నారు. ఈ నెల 13వ తేదీన పాలకమండలి సమావేశంలో గృహ రుణాల మంజూరుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వ్యాపారులు, ఉద్యోగులు అన్ని వర్గాలకూ గృహరుణాలు ఇస్తామన్నారు. రూ.10కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలనుకుంటున్నామని, ప్రాధాన్యం హైదరాబాద్ సిటీవాసులకే ఇస్తామన్నారు. అసైన్డ్దారులకూ... అసైన్డ్దారులకూ దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయనున్నామని డీసీసీబీ చైర్మన్ చెప్పారు. ఇతర బ్యాంకుల్లో రుణ బకాయిలు లేవని అసైన్డ్‌దారులు ధ్రువీకరణ పత్రాలు చూపితే వారికి రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఖరీఫ్‌లో రూ.150కోట్లు పంటరుణాలు ఇవ్వాలని లక్ష ్యంగా పెట్టుకున్నామన్నారు. గడిచిన రబీలో సుమారు రూ.97కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. వచ్చే మే చివరినాటికి బకాయిలు వసూలు చేసి, ఖరీఫ్ రుణాలు మంజూరు చేస్తామన్నారు. రూ.కోటి వసూలు... గతంలో రుణ బకాయిలు చెల్లించని 265మంది రైతులకు ఆస్తులు వేలం వేస్తామని డీసీసీబీ నోటీసులు జారీ చేయగా, వారిలో 75శాతం మంది స్పందించి రూ.కోటి మేర బకాయిలు చెల్లించారని చైర్మన్ లకా్ష్మరెడ్డి తెలిపారు. డీసీసీబీలో రూ.360కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, గత ఏడాది రూ.1.64కోట్ల లాభాలు వచ్చాయని, ఈ సారి రెట్టింపు లాభాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. డీసీసీబీలో లావాదేవీలు చేస్తేనే రుణాలు ఇస్తున్న రుణాలు డీసీసీబీవి కావని..రైతుల డబ్బులని ఆయన గుర్తు చేశారు. బ్యాంకుకు లాభాలు రాకపోతే రైతులకు ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) తమ బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ డీసీసీబీలోనే నిర్వహిస్తూ సహకరిస్తేనే డీసీఎంఎస్‌కు రుణాలు మంజూరు చేస్తూ డీసీసీబీ సహకరిస్తుందని లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. సహకార బ్యాంకులకు లాభాలు వస్తేనే..రైతులకూ లాభాలు వస్తాయని అన్నారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే డీసీఎంఎస్‌కు ఎంత రుణమైనా ఇస్తామన్నారు. కందుల కొనుగోలుకు రూ.50లక్షలు డీసీఎంఎస్‌కు కందుల కొనుగోలుకు రూ.50లక్షల రుణం ఇస్తున్నట్టు డీసీసీబీ చైర్మన్ లకా్ష్మరెడ్డి చెప్పారు. అత్తాపూర్‌లో డీసీఎంఎస్‌కు మాదిరిగానే డీసీసీబీకి 400గజాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.