జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఏది ఏమైనా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని సుప్రీం కోర్టు...
సాక్షి, చిత్తూరు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఏది ఏమైనా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారుల్లో కదలిక మొదలైంది. ఏ క్షణంలో నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు నిర్వహిం చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా మున్సిపల్ కమిషనర్లు చెబుతున్నారు.
జిల్లాలో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు, శ్రీకాళహస్తి, మదనపల్లె,పుంగనూరు, నగరి, పలమనేరు, పుత్తూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో తిరుపతి కార్పొరేషన్‌కు మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయి. మిగిలిన మున్సిపాలిటీలు, చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఆటంకం లేదని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి.
తిరుపతి కార్పొరేషన్‌కు సమస్యే
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఆరు నెలలు క్రితం ప్రభుత్వం తిమ్మినాయుడు పాళ్యం, రాజీవ్‌నగర్, ఎం.ఆర్.పల్లె పంచాయతీలను విలీనం చేసింది. వీటిని డివిజన్లుగా చేయాలంటే ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లలోనే కలపాలి. కొత్తగా డివిజన్ల ఏర్పాటుకు అవకాశం లేదు. దీంతో తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలంటే సమస్యలు ఉన్నాయని అధికారులకు తెలియజేసినట్టు సమాచారం.
మిగిలిన మున్సిపాలిటీలకు ఓకే
చిత్తూరు కార్పొరేషన్‌లో డివిజన్ల విభజన ఏర్పాటు సమయంలోనే పూర్తి చేయడంతో ఇక్కడ ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. పుంగనూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేసుకున్నారు.