- నగరంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారమే..
- పూర్తిగా స్తంభించిన పారిశుద్ధ్యం
- పట్టువదలని కార్మికులు.. మెట్టు దిగని ప్రభుత్వం
శ్రీనగర్‌కాలనీ,న్యూస్‌లైన్: కనీసవేతనాల పెంపు, మధ్యంతభృతి ఇవ్వాలని, ఆరోగ్యకార్డులు తదితర డిమాండ్లతో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె నగరంలో ఉద్ధృతమైంది. అన్ని కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టడంతో నగర వీధులన్నీ అధ్వానంగా మారాయి. రోడ్లు ఊడ్చేవారు లేరు..చెత్త ఎత్తేవారు కరువయ్యారు..డ్రైనేజీలు పట్టించుకునే పరిస్థితి లేదు. నీళ్లన్నీ రోడ్లపైకొచ్చి గలీజుగా మారుతున్నాయి. గల్లీల్లోనే కాకుండా ప్రధానమార్గాల్లో చెత్తకంపు కొడుతోంది. గుట్టగుట్టలుగా పేరుకుపోతున్న చెత్తతో వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి.
కార్మికులు సమ్మెకు దిగడంతో చెత్తను తరలించే వాహనాలు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు చెబుతున్నా..అమలులో ఎక్కడా కనిపించ డం లేదు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని కార్మికులు చెబుతుంటే..సమస్యను మంత్రి సమక్షంలో సోమవారం పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మెకు మద్దతుగా ఆదివారం నగరంలోని ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
ఖైరతాబాద్ చౌరస్తాలో రాస్తారోకో : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం ఖైరతాబాద్ చౌరస్తాలో బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ తదితర 9 సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పెద్దఎత్తున కార్మికులు చేరుకొని ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఎంఎస్ నాయకుడు శంక ర్, సీఐటీ యూ రాష్ట్రకార్యదర్శి పాలడుగు భాస్కర్‌లు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల మంది కార్మికులు మున్సిపాలిటీ, సంబంధిత శాఖల్లో పనిచేస్తున్నా వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.12,500 కనీస వేతనం పెంచుతామని ప్రభుత్వం హామీఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు.
పారిశుధ్యంపై మేయర్ సమీక్ష
సిటీబ్యూరో: సమ్మె నేపథ్యంలో మేయర్ మాజిద్‌హుస్సేన్ జీహెచ్‌ఎంసీ అధికారులు, ఆయా పార్టీల ఫోర్ల్‌లీడర్లతో ఆదివారం సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడం వల్ల నగరవాసుల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పరిస్థితి చేజారకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించాలని మేయర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కాగా పారిశుధ్య పనుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం బల్దియా కమిషనర్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు. నగరంలో పేరుకుపోయిన చెత్త తొలగింపును అధికారులతో కలిసి పరిశీలించారు.
విధులకు వెళ్లి విగతజీవిగా..
కూకట్‌పల్లి: స్థానికులు,అధికారుల ఒత్తిళ్లతో ఓ పారిశుద్ధ్య కార్మికుడు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో దిగి ఊపిరాడక దుర్మరణం పాలయ్యాడు. ఎం.వెంకటయ్య(40) ఫతేనగర్‌లో ఉంటూ కూకట్‌పల్లి సర్కిల్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సమ్మె జరుగుతుండడంతో రెండురోజులుగా విధులకు దూరంగా ఉన్నాడు. కూకట్‌పల్లి దేవీనగర్‌లోని రోడ్డునెం.2లోని మ్యాన్‌హోల్ వద్ద మురుగునీరు సాఫీగా పోకపోవడంతో స్థానికులు,అధికారుల ఒత్తిడితో వెంకటయ్య తప్పనిసరి స్థితిలో మ్యాన్‌హోల్లోకి దిగాడు. శుభ్రం చేస్తుండగా ఊపిరాడక కాసేపటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు, కార్మిక సంఘాల నేతలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. యాక్సిడెంటల్ పాలసీ కింద రూ.4లక్షల మంజూరుతోపాటుఈఎస్‌ఐ,పీఎఫ్‌ల ద్వారా రూ.2 లక్షలు మంజూరుచేయనున్నట్లు వెస్ట్‌జోన్ కమిషనర్ ప్రకటించారు. మృతుడిది వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పోచంపల్లి.